BSNL వింగ్స్ యాప్ : సిమ్ లేకుండానే కాల్స్

ఇంటర్నెట్‌ టెలిఫోన్ సేవలకు శ్రీకారం చుడుతోంది ప్రభుత్వరంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌. ఇప్పుడు సిమ్‌ కార్డ్‌ అవసరం లేకుండా ఏదైనా నెట్‌వర్క్‌ ఇంటర్‌నెట్‌ లేదా వైఫై ఉన్నా, కాల్‌ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది ఈ సంస్థ. ఇందుకోసం మొబైల్‌ యాప్‌ ‘వింగ్స్‌’ను కూడా ఆవిష్కరించింది. ఈ యాప్‌ ద్వారా దేశంలో ఏ టెలిఫోన్‌ నెంబరుకు అయినా కాల్‌ చేసుకోవచ్చు. ఏడాది రుసుముగా రూ.1,099 చెల్లించాలి. అనంతరం ఏ నెట్‌వర్క్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్‌/వైఫై ద్వారా అయినా దేశంలోని టెలిఫోన్‌ నెంబర్లకు అపరిమిత కాల్స్‌ చేసుకోవచ్చు. ఈనెల 25న ఈ సేవలు ప్రారంభమవుతాయి.
ప్రస్తుతం పోటీ తీవ్రంగా ఉన్నా, బీఎస్‌ఎన్‌ఎల్‌ మార్కెట్‌ వాటా గౌరవప్రదంగానే ఉందన్నారు టెలికాం మంత్రి మనోజ్‌ సిన్హా. ఇప్పుడు సిమ్‌ కార్డ్‌ అవసరం లేకుండా ఏదైనా  ఇంటర్‌నెట్‌ లేదా వైఫై ఉన్నా కాల్‌ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌ యాజమాన్యాన్ని అభినందించారాయన. ఈ సేవలను మంత్రి బుధవారం(జులై 11న) లాంఛనంగా ప్రారంభించారు.

ఈ యాప్‌ వినియోగానికి వివరాల నమోదును రెండు రోజుల్లో ప్రారంభిస్తామని చెప్పారు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అనుపమ్‌ శ్రీవాస్తవ. ఈ సేవలు ఈనెల 25 నుంచి ప్రారంభమవుతాయన్నారు. దేశీయంగా ఏ నెంబరుకు అయినా కాల్‌ చేసుకోవచ్చని, విదేశాల్లో పర్యటిస్తున్నపుడు కూడా, అక్కడ నుంచి ఇక్కడి నెంబర్లకు కాల్‌ చేసుకోవచ్చన్నారు శ్రీవాస్తవ. ఇంటర్నెట్‌/వైఫై సదుపాయం ఉంటే సరిపోతుందని తెలిపారు. ఈ యాప్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌ మొబైల్‌ నెంబరుకు అనుసంధానమై ఉంటుంది. వింగ్స్‌ యాప్‌ వినియోగించాలనుకునే వారు, బీఎస్‌ఎన్‌ఎల్‌ మొబైల్‌ లేదా ల్యాండ్‌లైన్‌ నెంబరు కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు.

Posted in Uncategorized

Latest Updates