BSNL: జీతాలకు పైసల్లేవ్, ఆదుకోండి

ప్రభుత్వానికి మొరపెట్టుకున్న బీఎస్​ఎన్​ఎల్​

ఇప్పటికే 13వేల కోట్ల అప్పుల్లో టెలికాం సంస్థ

90 వేల కోట్ల నష్టాలతో పడుతూ లేస్తూ నడక

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరోసారి ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి ఇబ్బందులు పడుతోంది. తీవ్ర సంక్షోభంలో ఉన్న తమ సంస్థను ఆదుకోవాలని, వెంటనే ప్రభుత్వం మనీ ఇయ్యాలని బీఎస్ఎన్ఎల్ కోరుతోంది. జూన్ నెల వేతనాల కింద 1.76 లక్షల మంది ఉద్యోగులకు బీఎస్ఎన్ఎల్ రూ.850 కోట్లు చెల్లించాలి. డబ్బులు లేకపోవడంతో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోవడంతో పాటు నిర్వహణ కష్టమవుతోందని బీఎస్ఎన్ఎల్ చెప్పింది.  ఈ కంపెనీకి ఇప్పటికే సుమారు రూ.13 వేల కోట్లు అప్పు ఉంది. వెంటనే అవసరమైనంత ఈక్విటీ ఇవ్వకపోతే బీఎస్ఎన్ఎల్ ఆపరేషన్స్ కొనసాగించడం కష్టమవుతుందని సంస్థ కార్పొరేట్ బడ్జెట్, బ్యాంకింగ్ డివిజన్ సీనియర్ జనరల్ మేనేజర్ పురాణ్​ చంద్ర చెప్పారు.

ఈ మేరకు టెలికాం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీకి లేఖ రాశారు. ఆర్థిక సంక్షోభంతో ఫిబ్రవరి నెలలో తొలిసారి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోయింది. ఇప్పుడు మరోసారి జీతాలు చెల్లించడానికి డబ్బులేదని ప్రకటించింది. కుదేలవుతోన్న తమ కంపెనీ భవిష్యత్తుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటూ ఆ లేఖలో బీఎస్ఎన్ఎల్ కోరింది.  ఈ లేఖలోనే భారీ రుణాలతో టెలికాం సంస్థ ఆర్థికంగా సంక్షోభంలో కూరుకుపోయిందని, గతసారి కూడా ఉద్యోగులకు వేతనాలు చెల్లించడంలో ఇబ్బందులు పడిందని వివరించింది.  రిలయన్స్ జియో మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత ప్రైవేట్ కంపెనీలు ధరల యుద్ధానికి తెరతీశాయి. ఈ ధరలయుద్ధానికి బీఎస్ఎన్ఎల్ తట్టుకోలేకపోయింది.   బీఎస్ఎన్ఎల్ ఆపరేటింగ్ నష్టాలు 2018 డిసెంబర్ నాటికి రూ.90 వేల కోట్లకు చేరాయి. మిగతా కంపెనీలు 5జీ సేవలు అందించేందుకు సిద్ధమవుతుండగా, బీఎస్​ఎన్​ఎల్​ను కాపాడేందుకు   ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి రోడ్​మ్యాప్​నూ తయారు చేయలేదు.

Latest Updates