BSNLని మూసేయట్లేదు: కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ లను మూసేస్తున్నారంటూ వచ్చిన వార్తలకు కేంద్ర ప్రభుత్వం తెరదించింది. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఖండించారు. ఎంటీఎన్ఎల్ గానీ, బీఎస్ఎన్ఎల్ ను గానీ మూసేయడం లేదని, ఏ ప్రైవేటు సంస్థకూ అప్పగించేదీ లేదని ప్రకటించారు. దీనిపై బుధవారం జరిగిన కేబినెట్ లో చర్చించామని చెప్పారు. ఈ రెండు ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ కూడా చేయడం లేదని తెలిపారు. ‘బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్.. రెండు కేంద్ర ప్రభుత్వ సంస్థల విలీనానికి కేబినెట్ నిర్ణయించింది. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు బీఎస్ఎన్ఎల్ కు అనుబంధ సంస్థగా ఎంటీఎన్ఎల్ పని చేస్తుంది’ అని చెప్పారు.

4జీ లోకి బీఎస్ఎన్ఎల్

ప్రైవేటు టెలికాం కంపెనీలతో పోటీని తట్టుకునేందుకు బీఎస్ఎన్ఎల్ కూ 4జీ స్పెక్ట్రం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ కూ 2016 రేట్లతో 4జీ స్పెక్ట్రం ఇవ్వాలని కేబినెట్ భీటీలో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు 2జీ, 3జీ సేవలు మాత్రమే అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ ఇక త్వరలోనే 4జీ సేవలను ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకురాబోతోంది.

Latest Updates