పొలంలోనే చివరి శ్వాస : ట్రాక్టర్ కిందపడి బీటెక్ విద్యార్థిని మృతి

సిద్దిపేట జిల్లా : ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి యువతి చనిపోయిన విషాధ ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని కేబి కాలనీకి చెందిన గౌరీగాని లక్ష్మీనారాయణ అనే రైతు శుక్రవారం తన పొలంలో నాటు వేసేందుకు పొలానికి వెళ్లాడు. అతనితో పాటు బీటెక్ చదువుతున్న కూతురు నవీన (22) లక్ష్మీనారాయణతో పొలానికి వచ్చింది. వరి నారు ట్రాక్టర్ పై వేసుకొని పొలంలోకి దించుతుండగా తల్లీదండ్రులు సంబరపడ్డారు. కానీ అంతలోనే విధి వక్రీకరించింది. అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడింది.

లక్ష్మీనారాయణ ట్రాక్టర్ నడుపుతూ వెనుకకు తీస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడడంతో.. తండ్రి పక్కనే కూర్చున్న నవీన ట్రాక్టర్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. ట్రాక్టర్ ను పైకి లేపడానికి స్థానికులు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. గట్టిగా అరుస్తూ నవీన పొలంలోనే చివరిశ్వాస విడిచింది. చివరకు JCB సహాయంతో ట్రాక్టర్ ను పైకి లేపి మృతదేహాన్ని బయటకు తీశారు. అంతసేపు తల్లిదండ్రులతో కలిసి పొలం పని చేసిన కూతురు కళ్లముందే మృతిచెందడంతో.. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

ఇవాళ నవీన బర్త్ డే

నేడు నవీన బర్త్ డే కావడంతో ఆమె ఫ్రెండ్స్, చుట్టాలు కన్నీరుమున్నీరవుతున్నారు. పుట్టినరోజు నాడే మరణించడంతో కుటుంబసభ్యులు నవీన మరణం జీర్ణించుకోలేకపోతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

Latest Updates