
- కనీస పరిమితిని రూ.3 లక్షలకు పెంచాలని వినతి
- డిడక్షన్ ను పెంచే అవకాశాలు ఉన్నాయంటున్న ఆర్థికరంగ నిఫుణులు
తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ తన తొలి బడ్జెట్‌ను జూలై 5 న సమర్పించనున్న తరుణంలో దేశంలోని ప్రజల ఆశలు ఇప్పటికే ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి ఆదాయ వర్గాల వారు పన్ను భారం తగ్గాలని కోరుకుంటున్నారు. ఆదాయపు పన్ను బేసిక్ ఎగ్జెంప్షన్ను పెంచాలని, లేదా పన్ను రాయితీలైనా ప్రకటించాలని మధ్యతరగతి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వారి డిమాండ్లన్నింటినీ అంగీకరించలేకున్నా, కొన్నింటితోనైనా ఆనందపరిచే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ట్యాక్సేషన్ విషయంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని ఎకానమిస్టులు అభిప్రాయపడుతున్నారు. కాకపోతే, డిమాండ్ పెంచేందుకు, వృద్ధికి ఊతమిచ్చేందుకు కొన్ని తాయిలాలను ప్రభుత్వం ప్రకటించొచ్చని పన్ను నిపుణులు చెబుతున్నారు. రాబోయే బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటించడానికి అవకాశమున్న ఇన్‌కంటాక్స్ మార్పులను చూద్దాం…
బేసిక్ ఎగ్జెంప్షన్ పెంపు..
ఇంటరిమ్ బడ్జెట్లో సెక్షన్ 87 ఏ కింద రూ. 5 లక్షల దాకా ఫుల్ ట్యాక్స్ రిబేటును ప్రకటించిన నేపథ్యంలో, బేసిక్ ఎగ్జెంప్షన్లో మార్పు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. కాకపోతే, ఈ ఆదాయపు పన్ను కనీస పరిమితిని ఇప్పుడున్న రూ. 2.50 లక్షల నుంచి కనీసం రూ. 3 లక్షలకైనా పెంచాలని చాలా మంది ప్రజలు, పారిశ్రామిక సంస్థలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. చాలా మంది దీని కోసం ఎదురు చూస్తున్నారు. దాని వల్ల పన్ను పరిధిలోంచి ఎక్కువ మంది బయటకు వెళ్లిపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. నిజానికి పన్ను చెల్లింపుదారుల సంఖ్యను భారీగా పెంచాలని ఆశిస్తున్న ప్రభుత్వం కనీస పరిమితిని పెంచేందుకు అవకాశాలు తక్కువగానే ఉన్నాయి.
ట్యాక్స్ డిడక్షన్ పెంపు..
కనీస పరిమితి పెంచలేకపోయినా, మధ్యతరగతి ప్రజలను సంతోష పెట్టేందుకు ఆదాయపు పన్ను చట్టంలోని వివిధ సెక్షన్ల కింద డిడక్షన్స్‌ను ప్రభుత్వం పెంచే అవకాశం ఉంది. సెక్షన్ 80 (సీ) కింద ఇస్తున్న డిడక్షన్స్ ఇప్పుడున్న రూ. 1.5 లక్షల నుంచి రూ. 2 లక్షలకు పెంచే సూచనలున్నాయి. దీంతో ఆ సెక్షన్ కింద వచ్చే ఇన్వెస్ట్‌మెంట్స్‌లో పెట్టుబడులు పెట్టిన వారికి ప్రయోజనం కలుగుతుంది. పీపీఎఫ్, ఈపీఎఫ్, ఎన్ఎస్సీ, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఎన్పీఎస్ వంటి వాటిలో పెట్టుబడులకు సెక్షన్ 80 (సీ) కింద డిడక్షన్స్ వర్తిస్తాయి.
హెల్త్‌కేర్ ట్యాక్స్ బెనిఫిట్స్ పెంపు..
హెల్త్‌కేర్ ట్యాక్స్ సేవింగ్ ఇన్స్ట్రమెంట్స్లో పెట్టుబడులకు డిడక్షన్ పెంచొచ్చు. సెక్షన్ 80 (డీ) కింద డిడక్షన్స్‌ను పెంచాలని పారిశ్రామిక సంస్థలు ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరాయి. సెక్షన్ 80 (డీ) కింద డిడక్షన్ ప్రస్తుతం రూ. 25 వేలుంది. 60 ఏళ్లలోపు వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. 60 ఏళ్లు పైబడిన వారికి రూ. 50 వేల దాకా డిడక్షన్ అందుబాటులో ఉంది. సెక్షన్ 80 (డీ) డిడక్షన్‌ను పెంచే సూచనలున్నాయని భావిస్తున్నారు.
ఇంటి అప్పుపై ఎక్కువ డిడక్షన్..
డిమాండ్ లేక సతమతమవుతున్న రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆదుకునేందుకు ఇళ్ల కొనుగోలుదారులకు మరిన్ని రాయితీలను ప్రకటించొచ్చు. సెక్షన్ 24 బీ కింద గరిష్టంగా రూ. 2 లక్షల దాకా డిడక్షన్‌ను ప్రస్తుతం పొందవచ్చు. ఈ పరిమితిని ఎక్కువ చేయొచ్చని ఎకానమిస్టులు అభిప్రాయపడుతున్నారు. రియల్ ఎస్టేట్ అమ్మకాలను పెంచేందుకు ఈ చర్య తీసుకుంటారని అంచనా వేస్తున్నారు. ఇంటి నిర్మాణం పూర్తయినప్పటి నుంచి ఈ డిడక్షన్‌ను పొందే వీలుంది.
టాక్స్ ఫ్రీ బాండ్లు మళ్లీ వస్తున్నాయా..
దేశంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు బూస్ట్ ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం. వివిధ వస్తువులు–సేవల డిమాండ్ పెరుగుదలకే కాకుండా, ఉపాధి కల్పనకూ ఇది సాయపడుతుందనేది ఆలోచన. ఈ నేపథ్యంలో టాక్స్ ఫ్రీ బాండ్లు మళ్లీ తెరమీదకి వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వ సంస్థల ద్వారా ఈ బాండ్లను జారీ చేసి అవసరమైన క్యాపిటల్‌ను ప్రభుత్వం సమకూర్చుకోవచ్చు. అలాంటి బాండ్స్నే ట్యాక్స్ ఫ్రీ బాండ్స్‌గా వ్యహరిస్తున్నారు. ఎందుకంటే ఆ బాండ్స్ మీద వచ్చే వడ్డీ మీద పన్ను ఉండదు. సాధారణంగా ఈ బాండ్స్ ఎక్కువ పరిమితి (10 ఏళ్ల మెచ్యూరిటీ)తో ఉంటాయి. మార్కెట్లోని ఇతర పెట్టుబడులతో పోలిస్తే ఈ బాండ్స్ భద్రమైనవి.