పచ్చదనానికి పైసల తోరణం

  • కాలుష్య నియంత్రణే లక్ష్యంగా పర్యావరణానికి ₹2,954 కోట్లు
  • క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కే ₹460 కోట్లు .. గత బడ్జెట్లో ₹5 కోట్లు
  • లోన్ వడ్డీపై ₹1.5 లక్షల వరకుఆదాయ పన్ను మినహాయింపు

న్యూఢిల్లీ: పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం కొంచెం ఎక్కువ నిధులు కేటాయించింది.  గత ఏడాది బడ్జెట్​కు మరో 10.4 శాతం కలిపి ₹2954.72 కోట్లు కేటాయించింది. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు కరెంట్​ వాహనాలను (ఎలక్ట్రిక్​ వెహికల్స్​–ఈవీ) ప్రోత్సహించే దిశగా వరాలు ప్రకటించింది. పర్యావరణానికి కేటాయించిన బడ్జెట్​లో 460 కోట్లను నేషనల్​ క్లీన్​ ఎయిర్​ ప్రోగ్రామ్​ (ఎన్​సీఏపీ) సహా కాలుష్య నియంత్రణ పథకాల కోసం ఇచ్చింది. గత ఏడాది కాలుష్య నియంత్రణ పథకాల కోసం కేటాయించిన బడ్జెట్​ కేవలం ₹5 కోట్లు. ఈ ఏడాది మాత్రం 92 రెట్లు ఎక్కువగా నిధులిచ్చింది.

ఎలక్ట్రిక్​ వెహికల్స్​కు వరాలు

జనం ఈవీలవైపు మొగ్గు చూపేలా వాటిపై విధిస్తున్న జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గించింది. ఈవీలను లోన్​తో కొంటే ఆ మొత్తంపై పడే వడ్డీని ఆదాయ పన్నులో ₹1.5 లక్షలను మినహాయించుకునే అవకాశం కల్పించింది. ఈవీలను ప్రోత్సహించేందుకు ఇప్పటికే ఫేమ్​2 స్కీమ్​ కింద ఏప్రిల్​ 1న ₹10 వేల కోట్ల బడ్జెట్​ను కేటాయించినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ చెప్పారు. అడ్వాన్స్​డ్​ బ్యాటరీ, రిజిస్టర్​ అయిన ఈవీలకే పథకాన్ని వర్తింపజేస్తామని ఆమె అన్నారు. లిథియం అయాన్​ బ్యాటరీలపై విధిస్తున్న కస్టమ్స్​ సుంకాన్ని పూర్తిగా ఎత్తేశారు.

గ్రీన్ ఇండియాకు రూ.240 కోట్లు

అడవుల విస్తీర్ణాన్ని పెంచేందుకు కేంద్రం చర్యలు చేపట్టనుంది. ఇందుకు తగ్గట్టుగా ₹240 కోట్లు కేటాయించింది. గత ఏడాది ₹210 కోట్లు ఇచ్చారు. గ్రీన్​ ఇండియా కార్యక్రమంలో భాగంగా చేపట్టిన నేషనల్​ మిషన్​ ద్వారా అటవీ విస్తీర్ణాన్ని పెంచుతారు. ఇందులో 179 కోట్లు అడవుల పెంపకానికే ఖర్చు చేయనున్నారు. ప్రాజెక్ట్​ టైగర్​కు ₹350 కోట్లు, ప్రాజెక్ట్​ ఎలిఫెంట్​కు ₹30 కోట్లు కేటాయించారు. తీర ప్రాంతాల రక్షణ కోసం ఏర్పాటు చేసిన నేషనల్​ కోస్టల్​ మిషన్​కు బడ్జెట్​ను తగ్గించింది. గత ఏడాది ₹130 కోట్లు కేటాయించగా, ఈ సారి ₹95 కోట్లు ఇచ్చింది. పర్యావరణ స్టాట్యూటరీ, రెగ్యులేటరీ విభాగాలకూ ఈసారి నిధులను తగ్గించింది. గత ఏడాది ₹166.42 కోట్లు ఇవ్వగా ఈ సారి కేవలం ₹147 కోట్లు కేటాయించింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికీ నిధులు తగ్గించింది. ₹100 కోట్లు కేటాయించింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ₹14.42 కోట్లు తగ్గాయి. టైగర్​ కన్జర్వేషన్​ అథారిటీకి రూ.కోటి పెంచి ₹10 కోట్లు కేటాయించింది.

ఎల్​ఈడీ స్కీం

సోలార్​ స్టవ్​లు, బ్యాటరీ చార్జర్ల వాడకం పెరిగేలా ఎల్​ఈడీ బల్బ్​ మిషన్​ను చేపడుతున్నట్టు నిర్మల చెప్పారు. ‘‘మెరుగైన జీవితం కావాలంటే స్వచ్ఛమైన పర్యావరణం, పునరుత్పాదక కరెంట్​ కావాలి. అందుకే ఉజాలా యోజన కింద 35 కోట్ల ఎల్​ఈడీ బల్బులను పంపిణీ చేశాం. దాని వల్ల ఏటా 18,341 కోట్లు ఆదా అవుతున్నాయి” అని అన్నారు.

Latest Updates