కొత్త వెపన్స్​ కొనేద్దాం..

  • రక్షణ శాఖకు రూ.3.18 లక్షల కోట్లు
  • అందులో లక్ష కోట్లు ఆయుధాల కొనుగోళ్లకే
  • గతేడాది రూ.2.98 లక్షల కోట్లు.. ఈ సారి పెంపు 6.87 శాతం

న్యూఢిల్లీ: నేషనల్​ సెక్యూరిటీకి అధిక ప్రాధాన్యం ఇస్తామన్న మోడీ సర్కార్.. బాలాకోట్​ దాడి తర్వాత ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్​లో త్రివిధ దళాల్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులేసింది. అన్ని దిక్కుల నుంచి టెన్షన్​ పెరుగుతున్న నేపథ్యంలో కొత్త వెపన్స్​ కొనుగోళ్లపై ఫోకస్​ పెంచింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ప్రకటించిన 2019–20 వార్షిక బడ్జెట్​లో అత్యధికంగా డిఫెన్స్​ మినిస్ట్రీకి రూ.3.18లక్షల కోట్లు కేటాయించగా, అందులో  రూ.1.08లక్షల కోట్లను కేవలం కొత్త ఆయుధాలు, మిలిట్రీ హార్డ్​వేర్​ కొనడానికే వాడనున్నారు. మిగతా మొత్తాన్ని(2.10లక్షల కోట్లు) జీతాలు, డిఫెన్స్​ ఎస్టాబ్లిష్​మెంట్స్​ కోసం వాడతారు.

2018–19 ఏడాదిలో డిఫెన్స్​కు రూ.2.98 లక్షల కోట్లు కేటాయించగా, ఎన్నికల ముందు పీయూష్​ గోయల్​ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్​లో తొలిసారి డిఫెన్స్​ కేటాయింపులు 3లక్షల కోట్ల మార్కును దాటింది. కేటాయింపులో  కొంచెం(0.01 శాతం) పెరుగుదల తప్ప మధ్యంతర బడ్జెట్​తో పోల్చుకుంటే నిర్మల బడ్జెట్​లో పెద్దగా మార్పుల్లేవు. కాగా, పెన్షన్​ చెల్లింపులకు సంబంధించిన రూ.1.12లక్షల కోట్ల మొత్తాన్ని విడిగా ప్రస్తావించడం గమనార్హం. ఒకవేళ పెన్షన్లను కూడా డిఫెన్స్​ బడ్జెట్​లో కలిపేసేదుంటే సైజు రూ.4.31 లక్షల కోట్లకు (మొత్తం బడ్జెట్​లో 15.47 శాతం వాటా) పెరిగి ఉండేది.

రక్షణ రంగాన్ని తక్షణమే మోడ్రనైజ్​, అప్​గ్రేడ్​ చేయాలన్నది నేషనల్​ ప్రయారిటీ అని చెప్పిన నిర్మల.. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే డిఫెన్స్ పరికరాలపై బేసిక్​ కస్టమ్స్​ డ్యూటీ మినహాయింపు ప్రకటించారు. గతంలో కంటే నిధులు పెరగడంపై డిఫెన్స్​ మినిస్టర్​ రాజ్​నాథ్​ హర్షం వ్యక్తం చేశారు. హిందూ మహాసముద్రంలో చైనాను కట్టడి చేసేలా కొత్త సబ్​మెరైన్ల కొనుగోలు, ఎయిర్​ఫోర్స్​లో పాత విమానాల్ని రీప్లేస్​ చేయడం, స్పై డ్రోన్లు, కొత్త రైఫిల్స్.. తదితర అవసరాలకు మరిన్ని కేటాయింపుల అవసరముందని, శాఖ అవసరాలు తెల్సిన వ్యక్తిగా నిర్మల అలాంటి ప్రకటన చేయకపోవడం నిరాశ కల్గించిందని నిపుణులు అభిప్రాయపడ్డారు.

అమిత్ శాఖకు ఐదు శాతం హైక్

ఇంటర్నల్​ సెక్యూరిటీ మరింత బలోపేతమయ్యేలా సెంట్రల్​ పోలీస్​ వ్యవస్థల్ని మోడ్రనైజ్​ చేస్తామని, బోర్డర్​లో ఫెన్సింగ్​ నిర్మాణాన్నీ పూర్తిచేస్తామన్న ఎన్నికల హామీలకు అనుగుణంగా.. బీజేపీ చీఫ్ అమిత్​ షా మంత్రిగా ఉన్న  హోం శాఖకు గతంలో కంటే 5.17 శాతం  నిధులు పెంచారు. గతేడాది రూ.1.13 లక్షల కోట్లున్న కేటాయింపును ఈసారి రూ.1.19 లక్షల కోట్లకు పెంచారు. ​సెంట్రల్​ పోలీస్​ ఫోర్స్​లో మౌలిక సదుపాయాల కోసం రూ.4,754 కోట్లు కేటాయించారు.

ఈ నిధులతో మోడ్రన్​ వెపన్స్​, కొత్త వెహికిల్స్​ కొనుగోలు, బ్యారక్​లు, సిబ్బందికి క్వార్టర్స్ నిర్మాణాలు చేపడతారు. మోడ్రనైజేషన్​ కోసం మరో రూ.3,462 కోట్లు ఇచ్చారు. ఢిల్లీ పోలీస్​కు రూ7,496 కోట్లు, ఇండో–పాక్​, చైనా–ఇండియా సహా ఇతర ఇంటర్నేషనల్​ బోర్డర్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.2,129 కోట్లు, జమ్మూకాశ్మీర్​, నార్త్​ఈస్ట్​లో టెర్రరిస్టులు, మిలిటెంట్ల ఏరివేతలో కీలకంగా వ్యవహరిస్తున్న సెంట్రల్​ రిజర్వ్​డ్​ పోలీస్​ ఫోర్స్​(సీఆర్​పీఎఫ్​)కు రూ.23,963 కోట్లు కేటాయించారు. బీఎస్​ఎఫ్​కు రూ.19,650 కోట్లు దక్కాయి. మొత్తంగా హోం శాఖ బడ్జెట్​లో కేంద్ర సాయుధ బలగాలకు రూ.71, 713 కోట్ల నిధులు కేటాయించారు.

గతేడాది బడ్జెట్​లో ఈ సంఖ్య రూ.67,779కోట్లుగా ఉంది. కీలకమైన ఇంటెలిజెన్స్​ బ్యూరోకు రూ.2,384 కోట్లు, ప్రధాన మంత్రి సెక్యూరిటీని పర్యవేక్షించే స్పెషల్​ ప్రొటెక్షన్​ గ్రూప్​(ఎస్పీజీ)కి రూ.535.45కోట్లు, బోర్డర్​ డెవలప్​మెంట్​ ప్రోగ్రామ్​కు రూ.825 కోట్లు,  జమ్మూకాశ్మీర్​లో వలసదారులకు సౌకర్యాల కల్పన కోసం రూ.842 కోట్లు,  ఫ్రీడమ్​ ఫైటర్ల పెన్షన్లకు రూ.953కోట్లు, నిర్భయ నిధికి రూ.50 కోట్లు, నేషనల్​ సైక్లోన్​ రిస్క్​ మిటిగేషన్​ ప్రాజెక్ట్​కు రూ.296 కోట్లు కేటాయించారు. జమ్మూకాశ్మీర్​లో స్పెషల్​ ఇండస్ట్రీ ఇనిషియేటివ్​ కింద రూ.50 కోట్లు, యూనియన్​ టెరిటరీ(యూటీ)లకు గ్రాంట్​ ఇన్​ ఎయిడ్​గా రూ.4,895 కోట్ల ఇచ్చారు. ఇక 2021 జనాభా లెక్కల పనికి రూ.612 కోట్లు, హిందీ భాషాభివృద్ధికి 78.09 కోట్ల నిధులు కేటాయించారు.

Latest Updates