తయారీ రంగంలోనే కొలువులు

తయారీ రంగంలోనే కొలువులు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలేవైనా ఏ బడ్జెట్​లోనైనా అభివృద్ధి, సంక్షేమం అనే రెండు అంశాలపై ఫోకస్​ పెడతాయి. దేశ ఆర్థికాభివృద్ధికి, ప్రభుత్వ ఆర్థిక ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచటానికి ప్రయారిటీ ఇస్తాయి. ద్రవ్య లోటు (ఫిస్కల్​ డెఫిసిట్​) పెరగకుండా చూసుకుంటాయి. అన్ని వర్గాల ప్రజల్నీ దృష్టిలో పెట్టుకొనే కేటాయింపులు జరుపుతాయి. యూత్​కి ఉద్యోగ కల్పన కోసమూ ప్రయత్నాలు చేస్తాయి. కాకపోతే ఆయా చర్యలు ఒక్కోసారి ఫలించవు. ఇలా జరక్కూడదంటే ఈసారి మాన్యుఫ్యాక్చరింగ్​ సెక్టార్​ని (తయారీ రంగాన్ని)​ ఎంకరేజ్ చేయాలంటున్నారు.

ఈ రంగమే ఎందుకు?

ఎకానమీ​లో అతి పెద్ద సెక్టార్లుగా అగ్రికల్చర్​, ఇండస్ట్రీ, సర్వీస్​లను చెప్పుకోవచ్చు. వ్యవసాయ రంగం దేశంలోని మొత్తం వర్క్​ఫోర్స్​లో దాదాపు సగానికి ఉపాధి చూపుతోంది. కానీ, ఈ సెక్టార్​లో గ్రోత్​ అంతగా ఉండదు. వానలు సకాలంలో రాకపోవటం, ప్రతి సంవత్సరం క్రమంతప్పకుండా పంటలు పండకపోవటం దీనికి కారణాలు. పంట పండినా సరైన రేట్లు ఉండకపోవటం మరో కారణం. అందువల్ల ఏటా లక్షల సంఖ్యలో పెరుగుతున్న వర్క్​ఫోర్స్​కి ఈ రంగంలో పని దొరకట్లేదు. దీంతో వాళ్లంతా వేరే సెక్టార్ల వైపు వెళ్లిపోతున్నారు. దాదాపు పాతికేళ్ల నుంచీ ఇదే పరిస్థితి.

సర్వీస్​ సెక్టార్​ వేగంగా అభివృద్ధి చెందేదే అయినా అక్కడ ఉద్యోగం కోరుకునేవారి సంఖ్య భారీగా ఉంటుంది. ఆ రంగంలో నిలదొక్కుకోవాలంటే చదువు​తోపాటు స్కిల్స్​ కూడా ఉండాలి. పల్లెల నుంచి వచ్చే గ్రాడ్యుయేట్లు ఈ విషయంలో సిటీ స్టూడెంట్స్​తో పోటీపడలేకపోతున్నారు. ఇక మిగిలింది ఇండస్ట్రీ ఒక్కటే. ఇందులో రెండు సబ్​ సెక్టార్లు ఉన్నాయి. ఒకటి.. మాన్యుఫ్యాక్చరింగ్​. రెండు.. నాన్​–మాన్యుఫ్యాక్చరింగ్​. రెండో కేటగిరీలోకి కన్​స్ట్రక్షన్​, మైనింగ్​ వంటివి వస్తాయి. అందుకే అందరి చూపూ పారిశ్రామిక రంగంపైనే ఉంటోంది.

ఎంప్లాయ్​మెంట్​కి ఎక్కువ అవకాశాలు

తయారీ రంగం​లో ఏటా జరిగే అభివృద్ధికి తగ్గట్లే అదనపు ఉద్యోగాలకూ అవకాశం ఉంటుంది. దీన్నే ‘ఎంప్లాయ్​మెంట్​ ఎలాస్టిసిటీ’ అంటారు. మాన్యుఫ్యాక్షరింగ్​ సెక్టార్లో ఎంప్లాయ్​మెంట్​ ఎలాస్టిసిటీ ఎక్కువని రీసెర్చ్​లో కూడా తేలింది. యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు రెండూ ఈ రంగానికి బూస్టింగ్​ ఇచ్చాయి. 2011లో యూపీఏ గవర్నమెంట్​ ‘న్యూ నేషనల్​ మాన్యుఫ్యాక్షరింగ్​ పాలసీ’ని తెచ్చింది. జీడీపీలో ఈ రంగం వాటాను 2022 నాటికి 25 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.

మోడీ సర్కారు కూడా దేశీయ తయారీ రంగానికి పెద్ద పీట వేసింది. యూత్​కి లక్షల సంఖ్యలో జాబులు రావటానికి మాన్యుఫ్యాక్చరింగ్​ సెక్టారే మెయిన్​ ప్లాట్​ఫామ్​ అని తీర్మానించుకుంది. ఈ రంగాన్ని ప్రోత్సహించటానికి ‘మేకిన్​ ఇండియా’ ప్రాజెక్టును ప్రారంభించింది. పెద్ద, చిన్న పరిశ్రమలన్నింటినీ ప్రమోట్​ చేసే చర్యలు చేపట్టింది. మాన్యుఫ్యాక్చరింగ్​ సెక్టార్​కి గడచిన పదేళ్లుగా ఊతమిస్తున్నా ఆశించిన ఫలితాలు రావట్లేదు. జీడీపీలో తయారీ రంగం వాటా 17 శాతం లోపే ఉంటోంది. కొత్త ఉద్యోగాల కల్పన పెద్ద సంఖ్యలో అయితే సాధ్యం కావట్లేదు.

ఎందుకిలా?

మాన్యుఫ్యాక్చరింగ్​​కి ప్రభుత్వం ఎంత సపోర్టివ్​గా ఉంటున్నా జాబులు మాత్రం అందుబాటులోకి రావట్లేదు. ఆర్గనైజ్డ్ సెక్టార్​లోని ఇండస్ట్రీలు కార్మికులకు ఇచ్చే వేతనాలను భారంగా భావిస్తుండటమే దీనికి కారణం. కేపిటల్​–టు–లేబర్​ రేషియో పెరుగుతుండటంతో యాజమాన్యాలు వర్కర్ల సంఖ్యను పెంచటానికి బదులు పెట్టుబడి పెంపు పైనే దృష్టి పెడుతున్నాయి. మనుషుల ప్లేస్​లో మెషీన్లను ప్రవేశపెడుతున్నారు. ఇలాంటి చర్యల వల్ల లాభాలు రాకపోయినా కంపెనీల ఓనర్లు ఇదే ట్రెండ్​ని కొనసాగిస్తున్నారు.

మాన్యుఫ్యాక్చరింగ్​ సెక్టార్​లో ఒక్కో యూనిట్​పై పెడుతున్న పెట్టుబడితో పోల్చితే వస్తున్న రాబడి బాగా తగ్గుతున్నట్లు 2007–08 నుంచి 2017–18 వరకు సేకరించిన డేటాను బట్టి తెలుస్తోంది. అదే సమయంలో ఎంప్లాయ్స్​ శాలరీస్​ తగ్గినట్లుగా మాన్యుఫాక్చరింగ్​ సెక్టార్​పై స్టడీ చేసిన ఇండియా రేటింగ్స్​ అనే సంస్థ తెలిపింది. దేశవ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు దొరికే టెక్స్​టైల్స్​, లెదర్​ ఇండస్ట్రీల్లో ఇదే ట్రెండ్​ కొనసాగినట్లు చెప్పింది.