
ఏటా రూ. 300 కోట్ల రాయితీ ఇస్తామన్న సర్కారు
అయినా తెరవని యాజమాన్యం
జయశంకర్ భూపాలపల్లి/మంగపేట, వెలుగు: ఆరేళ్లుగా మూతపడి ఉన్న బిల్ట్ ఫ్యాక్టరీ పూర్తిగా ఖరాబవుతోంది. పట్టించుకునేవారు లేకపోవడంతో వందల కోట్ల విలువ చేసే పరికరాలు తుప్పు పడుతున్నాయి. సరైన మెయింటెనెన్స్ లేక విదేశాల నుంచి తెప్పించిన మెషిన్లు పనికిరాకుండా పోతున్నాయి. ములుగు జిల్లా మంగపేట మండలంలోని కమలాపూర్‌లో బిల్ట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి నాలుగున్నర దశాబ్దాలు అవుతోంది. 1975లో అవంతా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు చెందిన బల్లార్పూర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్(బిల్ట్) ఈ పరిశ్రమను ఏర్పాటు చేసింది. ఇక్కడకంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పేపర్ గుజ్జు చాలా తక్కువ ధరకు లభిస్తుండటంతో ఇక్కడ తయారయ్యే ముడి సరుకును కొనుగోలు చేయడానికి సంస్థలు ముందుకు రాలేదు. దీంతో 2013–14 ఆర్థిక సంవత్సరంలో రూ.57.21 కోట్లు, 2014 ఏప్రిల్ నాటికి రూ.4.6 కోట్ల నష్టం రావడంతో ఉత్పత్తి నిలిపివేయాలని బిల్ట్ యాజమాన్యం నిర్ణయించింది. 2014 ఏప్రిల్ 5న సీ షిఫ్ట్ నుంచి ఫ్యాక్టరీలో పేపర్ గుజ్జు ఉత్పత్తి నిలిపివేసింది. దీంతో 705 మంది పర్మినెంట్ కార్మికులు, సుమారు రెండు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు, పరిశ్రమపై ఆధారపడి జీవించే వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
తెలంగాణలో మూతపడిన తొలి పరిశ్రమ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూత పడిన తొలి పరిశ్రమ ఇదే. ఈ ఫ్యాక్టరీలో తొలినాళ్లలో రోజుకు 130 టన్నుల పల్ప్ ఉత్పత్తి చేసేవారు.1994–95 సంవత్సరంలో కంపెనీలోని పాత మెషిన్ల స్థానంలో కొత్తవి అమర్చారు. జపాన్, ఫిన్లాండ్, స్వీడన్ దేశాల నుంచి రూ. కోట్ల విలువ చేసే మెషినరీ తీసుకొచ్చి ఫ్యాక్టరీని ఆధునీకరించారు. ఆ తర్వాత రోజుకు 267 టన్నుల పేపర్ గుజ్జు ఉత్పత్తి జరిగేది. ఈ మెషిన్లకు 14 ఏళ్ల వ్యాలిడిటీ మాత్రమే ఉంది. అయినా యాజమాన్యం 17 ఏళ్లపాటు నడిపించింది. 2014 జూన్ నెలలో ఫ్యాక్టరీ మూతపడగానే అప్పటి నుంచి ఈ మెషిన్లను పట్టించుకునేవారు లేక, సరైన మెయింటెనెన్స్ లేక యంత్రాలన్నీ తుప్పు పడుతున్నాయి. ఫిన్లాండ్ నుంచి తెప్పించిన పల్ప్ మిల్ డిపార్ట్మెంట్లోని డీడీ వాచర్, షీటింగ్ మెషిన్, జపాన్ నుంచి దిగుమతి చేసుకున్న టర్బో జనరేటర్, వీటితో పాటు సోడా రికవరీ ప్లాంట్(ఎస్ఆర్పీ), వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, చిప్పర్ హౌజ్, సున్నం ప్లాంట్, న్యూ కెమికల్ ప్లాంట్ లోని మెషినరీతోపాటు కంపెనీలోని పైప్ లైన్లు, భవనాలు శిథిలావస్థకు చేరాయి. ఫ్యాక్టరీ ఆవరణ పూర్తిగా చిత్తడిని తలపిస్తోంది. ఫ్యాక్టరీ తెరవకపోతే మరో 6 నెలలు, ఏడాదిలో ఒక్క యంత్రం కూడా పనికిరాకుండా పోతుందని కార్మిక సంఘాల నేతలు అంటున్నారు.
అందని 72 నెలల జీతం
బిల్ట్ ఫ్యాక్టరీలో పనిచేసే పర్మినెంట్ కార్మికులకు 72 నెలలుగా యాజమాన్యం వేతనాలు చెల్లించకుండా, కార్మికుల హక్కులను కాలరాస్తోంది. బిల్ట్ ను తెరిపించాలని కోరుతూ కార్మికులు తొలిసారి 362 రోజులు, రెండోసారి ఏడాదికి పైగా దీక్షలు చేశారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం, కార్మిక శాఖ అధికారులకు మాత్రం పట్టలేదు. 2014 జూన్ నెలలో లే ఆఫ్‌కు దరఖాస్తు చేసిన యాజమాన్యం, అక్టోబర్ నెలలో బిల్ట్ క్లోజ్ చేయడానికి దరఖాస్తు చేసింది. ఈ రెండింటిని కూడా కార్మిక శాఖ అంగీకరించలేదు. పర్మినెంట్ కార్మికులకు నెలవారీ జీతాలు చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది. అయినా బిల్ట్ యాజమాన్యం పట్టించుకోవడం లేదు. అదీగాక ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థను మూసేశారు. దీంతో కార్మికుల పిల్లల చదువులు అటకెక్కాయి. కార్మికుల పోరాటాలతో దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం 2015లో బిల్ట్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇస్తూ ఫ్యాక్టరీని నడిపించడానికి అవసరమైన రాయితీలు ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏటా రూ.300 కోట్లు రాయితీ ఇస్తామంటూ జీవో జారీ చేసింది. అయినా గత ఐదేండ్లుగా సమస్య ఎటూ తేలలేదు. ఫ్యాక్టరీ మూతపడడంతో కార్మికులకు కష్టాలు మొదలయ్యాయి. కుటుంబపోషణ ఎలా అనే బెంగతో 21 మంది వరకు కార్మికులు మృతిచెందారు.
ఉపాధి లేక రోడ్డున పడ్డం
బిల్ట్ ఫ్యాక్టరీని మూసేయడంతో కార్మికులంతా రోడ్డున పడ్డారు. 72 నెలలుగా మేనేజ్మెంట్ మాకు వేతనాలు చెల్లించడం లేదు. దీంతో తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాం. రోగం వస్తే వైద్యం చేయించుకోవడానికి చేతిలో రూపాయి లేదు. కుటుంబ పోషణ కోసం వ్యవసాయ, భవన నిర్మాణ పనులకు వెళ్తున్నాం. బిల్ట్ ఫ్యాక్టరీ తెరవడం లేదనే బాధతో ఇప్పటికే 21 మంది కార్మికులు చచ్చిపోయారు. ‑గద్దె వెంకటేశ్వరరావు, బిల్ట్ కార్మికుడు
రాయితీలిచ్చామని సర్కారు గొప్పలు చెప్పింది
బిల్ట్ ఫ్యాక్టరీని తెరిపించడానికి ప్రభుత్వం రాయితీలిస్తామని గొప్పలు చెప్పిందేకానీ ఇప్పటివరకు ఇచ్చిన హామీల్లో ఎలాంటి పురోగతి లేదు. అటు యాజమాన్యం, ఇటు ప్రభుత్వం బాగానే ఉన్నాయి. చివరికి కరెంటు, నీళ్లు లేక అరిగోస పడేది మాత్రం బిల్ట్ కార్మికులే. సంవత్సరాల తరబడి పనులు లేక కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో వ్యవసాయ కూలీలుగా మారారు. మేనేజ్మెంట్ జీతాలు ఇవ్వకపోవడంతో చికిత్స చేయించుకునే ఆర్థిక స్థోమత లేక అనారోగ్యంతో చనిపోయారు. ప్రభుత్వం యాజమాన్యంతో చర్చలు జరిపి బిల్ట్ ఫ్యాక్టరీని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలి.‑వడ్లూరి రాంచందర్, బిల్ట్ కార్మిక సంఘాల నేత