కూలీలు అవసరం లేకుండానే మెషీన్ ఇళ్ళు కట్టేస్తది

  • వారంలోనే 2 వేల  చ. అడుగుల ఇంటి నిర్మాణం
  • కూలీల అవసరం ఉండదు

హైదరాబాద్, వెలుగు:  ఇల్లు ప్రతి ఒక్కరి కల.. కదిలే ఇళ్లని, చెక్కతో నిర్మించిన ఇళ్లని, ఇలా తక్కువ ఖర్చుతో కూడిన చాలా రకాల ఇళ్లను చూస్తుంటాం. ఇప్పుడు త్రీడీ ప్రింటెడ్ హోమ్ కూడా వచ్చేసింది. దేశంలోనే మొట్టమొదటి సారిగా నగరంలో నిర్మితమైంది ఈ త్రీడీ ప్రింటెడ్ హోమ్. రష్యా ఇంజనీర్ల సహకారంతో ఓజాజ్ గ్లోబల్ సంస్థ ఈ ఇంటిని నిర్మించింది. రోబోటిక్ టెక్నాలజీతో నిర్మితమైన ఈ త్రీడీ ప్రింటెడ్ ఫస్ట్ హోమ్ ని శుక్రవారం మేడ్చల్ లో ఆవిష్కరించారు.  ఓజాజ్ సంస్థ ప్రతినిధి జాషువా, జాన్ ఇజ్రాయిల్,రష్యా ఇంజనీర్లు ఇమాన్యుల్ మనీ, రోమన్ క్రోపాచెవ్, అలెగ్జాండర్ లు పాల్గొన్నారు.

దేశంలోనే తొలి త్రీడీ ప్రింటెడ్ హోమ్

ఈ రోబోటిక్ త్రీడీ టెక్నాలజీ ద్వారా నచ్చిన డిజైన్ తో ఇల్లు కట్టుకోవచ్చు. కంప్యూటర్ లో డిజైన్ చేసుకుని డిజైన్ ను, సిమెంట్ తో పాటు కొన్ని స్పెషల్ కాంపొజిషన్స్ కలిపి మెటీరియల్ ని ఫీడ్ చేస్తే ఈ మిషన్ ఒక రియలిస్టిక్ హౌజ్ ని ఆవిష్కరిస్తుంది. నిర్మాణరంగ కూలీల్లో ప్రతి నలుగురిలో ఒకరు చనిపోతున్నారని, యూరప్ లో సర్వే ప్రకారం రోజుకు130 మంది చనిపోతున్నారని వీరికి సరైన భద్రత, బీమా ఉండదని ఓజాజ్ సంస్థ సీఈవో జాషువా అన్నారు. అయితే త్రీడీ టెక్నాలజీ ద్వారా ఆ ప్రాణ నష్టం నివారించవచ్చన్నారు. దీని ద్వారా 95 శాతం వరకు శ్రమజీవుల అవసరం లేకుండానే ఇల్లు మొత్తం నిర్మాణం చేయొచ్చని తెలిపారు.

వందేళ్ల పాటు బిల్డింగ్​కు పగుళ్లుండవ్​

ఈ త్రీడీ ప్రింటెడ్ హోమ్ ద్వారా నీటి కొరతను పరిష్కరించుకోవచ్చట. నిర్మాణం తొలిదశలో మెటీరియల్ మిక్చర్ లో తప్ప ఇక క్యూరింగ్ కు నీటి అవసరం ఉండదు. ఏదైనా కొత్త టెక్నాలజీ వస్తే సందేహపడడం, నాణ్యత గురించి భయపడడం సహజమే. అయితే ఈ రోబోటిక్ నిర్మాణం నాణ్యత పరంగా అద్భుతమని ఓజాజ్ సంస్థ సీఈవో జాషువా చెప్పారు. సాధారణ పద్ధతిలో కట్టిన ఇళ్లు మూడు  నాలుగు నెలలకే క్రాక్స్ వస్తే ఈ టెక్నాలజీ తో వందశాతం క్రాక్స్ కనిపించవని తెలిపారు. అంతే కాకుండా కట్టిన తర్వాత వందేళ్ల పాటు పగుళ్లు రానేరావని చెప్పారు. వచ్చే 2020 నుంచి 30 శాతం నిర్మాణాలు దీంతోనే జరగాలని మిడిల్ఈస్ట్ కంట్రీస్ నిర్ణయించాయని తెలిపారు.

అలాగే దీని వల్ల ఇంటి నిర్మాణానికి అయ్యే సమయం చాలా ఆదా అవుతుందన్నారు. సాధారణంగా 6 నెలల నుంచి ఏడాది పట్టే ఇంటి నిర్మాణం ఇందులో రోజుల్లోనే అయిపోతుందన్నారు. ఈ టెక్నాలజీతో 2వేల చదరపు అడుగుల ఇంటిని వారం రోజుల్లోనే పూర్తి చేయొచ్చు. కొత్త కొత్త నగరాలు నిర్మించాలనుకునేవారికి ఈ టెక్నాలజీ ఉపయోగపడనుంది. దీంతో కేవలం ముణ్నాలుగేళ్లలోనే వందల, వేల ఇళ్లు కట్టే వీలుంది. అంతేకాకుండా నిర్మాణ వ్యర్థాలను కూడా తిరిగి నిర్మాణ మెటీరియల్ గా ఇందులో ఉపయోగించవచ్చు. భారతదేశాన్ని ఈ టెక్నాలజీలో గొప్ప స్థాయికి చేర్చాలనేది తమ ఆశయమని, ప్రపంచంలోనే అతి పెద్ద త్రీడీ బిల్డింగ్ ను వచ్చే మార్చిలో నిర్మించనున్నామని నిర్వాహకులు వెల్లడించారు. ఇదే రోబోటిక్ టెక్నాలజీ ద్వారా సముద్రంలోని ప్లాస్టిక్ వ్యర్థాలను తీసి దాన్ని త్రీడీ బోట్స్ తయారు చేయనున్నామని తెలిపారు.

Latest Updates