బుమ్రా ఫెరారీ కారు లాంటోడు

బుమ్రా ఫెరారీ కారు లాంటోడు

టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాపై పాకిస్థాన్ మాజీ ఓపెనర్ సల్మాన్ భట్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఒకప్పుడు పాక్ టీమ్‌లో వసీం అక్రమ్, వకార్ యూనిస్ ఎలాంటి పాత్ర పోషించారో ఇప్పుడు భారత జట్టులోనూ బుమ్రా అలాంటి రోల్ పోషిస్తున్నాడని భట్ మెచ్చుకున్నాడు. కార్లతో బుమ్రాను పోల్చాలంటే టయోటా, కరొల్లా కేటగిరీలోకి రాడని.. అతడి లాంటి బౌలర్లు ఫెరారీ, లంబోర్గినీ లాంటి స్పెషల్ కార్ల కిందకు వస్తారని కొనియాడాడు. 

‘బుమ్రా లాంటి బౌలర్లను మంచిగా వాడుకోవాలి. మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్లు, ప్రణాళికలను బట్టి అలాంటి వారితో బౌలింగ్ చేయించాలి. అప్పుడు బుమ్రా లాంటి ప్లేయర్ల సేవలను ఎక్కువ రోజులు వినియోగించుకోవచ్చు. ముఖ్యంగా ఆసక్తికరమైన, ప్రత్యేకమైన సిరీస్‌‌ల్లోనే అతడ్ని ఆడించాలి. అప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయి. బుమ్రా ఓ వైవిధ్యమైన బౌలర్. ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో ఉత్తమ ప్లేయర్లలో అతనొకడు. పూర్తి నియంత్రణతో కూడిన బౌలింగ్, యార్కర్లు, డాట్ బాల్స్ ఎక్కువ వేయడం ద్వారా చివరి ఓవర్లలో ఎంతటి బ్యాట్స్‌‌మెన్‌ను అయినా వణుకు పుట్టించగలడు. భారత జట్టుకు బుమ్రా ఓ వెలకట్టలేని ఆస్తి’ అని భట్ పేర్కొన్నాడు.