రంజాన్ కోసమే తక్కువ కరోనా కేసులు

హైదరాబాద్, వెలుగుప్రమాదకర కరోనా విషయాన్నీ రాష్ట్ర సర్కారు మత కోణంలో చూస్తోందని, ఇది దురదృష్టకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌‌కుమార్ విమర్శించారు. రాష్ట్రంలో కరోనా టెస్టులు ఒక్కసారిగా ఎందుకు నిలిపేశారని, కుంటి సాకులు ఎందుకు చెబుతున్నారని దుయ్యబట్టారు. రంజాన్‌‌ను దృష్టిలో పెట్టుకొని కరోనా కేసులు తక్కువ చూపిస్తున్నారని ఆరోపించారు.

కేసీఆర్‌.. మంత్రులకు సంస్కారం నేర్పండి

తమ దీక్షలపై కామెంట్‌ చేసిన మంత్రి తలసానిపై సంజయ్ మండిపడ్డారు. దీక్షలు చేసినోళ్లు వెధవలైతే తెలంగాణ ఉద్యమంలో దీక్ష చేసిన కేసీఆర్ ఏమవుతారో తలసాని చెప్పాలన్నారు. లాక్‌డౌన్ అమలుపై హోం మంత్రి మహమూద్ అలీ చేసిన వ్యాఖ్యలకు తలసాని జవాబివ్వాలని డిమాండ్ చేశారు. మంత్రులు అవగాహన, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని.. వాళ్లకు సంస్కారం నేర్పించాలని సీఎంకు సూచించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌‌రెడ్డి స్పాన్సర్ చేస్తున్న 10 వేల మోడీ కిట్స్‌‌ను తరలించే వాహనాలను సోమవారం బంజారాహిల్స్‌‌లోని బంజారా ఫంక్షన్‌‌హాల్‌‌లో జెండా ఊపి సంజయ్ ప్రారంభించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు.

సీఎస్‌‌, డీజీపీ పోంగనే కేసులెట్ల తగ్గుతయ్‌‌?

లాక్‌‌డౌన్‌‌ టైమ్‌‌లో రంజాన్ పేరుతో ఓల్డ్ సిటీలో రోడ్లపైకి వస్తున్న వాళ్లను సర్కారు ఎందుకు కట్టడి చేయలేకపోతోందని సీఎం కేసీఆర్‌‌ను సంజయ్‌‌ నిలదీశారు. రంజాన్ గుర్తుకొచ్చే సీఎంకు ఉగాది, శ్రీరామనవమి, అంబేడ్కర్, జ్యోతిబాఫూలే జయంతులు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. మైనార్టీల విషయంలో కనిపించే మతం.. హిందువుల విషయంలో కనిపించలేదా అని ఫైరయ్యారు. మైనార్టీల మెప్పు కోసమే కేసీఆర్ సర్కారు పని చేస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ సర్కారు విధానాలతో ప్రజల్లో లాక్‌‌డౌన్ అమలుపై సీరియస్ నెస్ తగ్గిపోయిందన్నారు. వికారాబాద్, గద్వాల, సూర్యాపేట  జిల్లాలకు హైదరాబాద్ నుంచి సీఎస్, డీజీపీ, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ పోగానే కేసులెట్లా తగ్గుతాయని ప్రశ్నించారు. డెడ్ బాడీల నుంచి శాంపిల్స్ తీసుకోవద్దనడమేంటని అడిగారు.  కార్యక్రమంలో ఎంపీ గరికపాటి మోహన్‌‌రావు, ఎమ్మెల్సీ రాంచందర్‌‌రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు.

Latest Updates