వినాయక విగ్రహాలను ధ్వంసం చేసిన మహిళ.. వీడియో వైరల్

న్యూఢిల్లీ: బుర్ఖాలో వేసుకున్న మహిళ బహ్రెయిన్‌లోని సూపర్ మార్కెట్‌లో వినాయకుడి విగ్రహాలను ధ్వంసం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గణేశ్ చతుర్థి రాబోతున్న నేపథ్యంలో గణపతి విగ్రహాలను సదరు సూపర్‌‌ మార్కెట్‌లో కొనుగోళ్ల కోసం ఓ షెల్ఫ్‌లో ఉంచారు. బుర్ఖాలో ఉన్న ఓ మహిళ అక్కడికి వచ్చి విగ్రహాలను తీసుకొని ఒక దాని తర్వాత ఇంకొకటి కిందకు విసిరి కొట్టింది. వారించడానికి వచ్చిన షాప్ అటెండెంట్‌ను ఆ మహిళ అరబిక్‌లో ఏదో అనడాన్ని వీడియోలో చూడొచ్చు. ముస్లిం దేశంలో గణపతి విగ్రహాలను అమ్మడంపై సదరు మహిళ అభ్యంతరం తెలిపినట్లు తెలుస్తోంది.

‘ఇది మొహమ్మద్ బెన్ ఇస్సా దేశం. దీన్ని ఆయన ఆమోదిస్తారని అనుకుంటున్నావా?’ అని ఆ మహిళ చెప్పడాన్ని గుర్తించొచ్చు. బహ్రెయిన్‌ రాజధాని మనామాకు దగ్గర్లోని జుఫ్ఫెయిర్ సూపర్‌‌ మార్కెట్‌లో జరిగిందని సమాచారం. సదరు మహిళ విగ్రహాలను ధ్వంసం చేస్తుండగా బుర్ఖాలో ఉన్న మరో మహిళ ఘటనను ఫోన్‌లో వీడియో తీసింది. ఈ వీడియోను ఇండియాలోని చాలా మంది యూజర్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. గణేశ్ విగ్రహాలను ముక్కలు ముక్కలుగా చేసిన సదరు మహిళపై బహ్రెయిన్ పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది. లోకల్ మీడియా కథనం ప్రకారం.. మతపరమైన భావాలు, ఆచారాలను అగౌరవపరిచినందుకు 54 ఏళ్ల సదరు మహిళపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఆ మహిళపై కేపిటల్ పోలీసులు లీగల్ యాక్షన్స్ తీసుకుంటారని బహ్రెయిన్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ట్వీట్ చేసింది.

Latest Updates