బ్రిడ్జి దాటుతూ కొట్టుకుపోయిన బస్సు..ఒకరి మృతి

బ్రిడ్జి దాటుతూ కొట్టుకుపోయిన బస్సు..ఒకరి మృతి

వంతెనను దాటుతుండగా ఓ ఆర్టీసీ బస్సు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదం మహారాష్ట్రలోని యావత్మల్‌ జిల్లాలో మంగళవారం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు. నాగ్‌పూర్‌ నుంచి నాందేడ్‌ వెళ్తోన్న బస్సు.. వరద నీటితో ప్రవహిస్తున్న వంతెనను దాటేందుకు ప్రయత్నిస్తుండగా బోల్తాపడింది. ఆ బస్సు సుమారు 50 మీటర్ల దూరం కొట్టుకువెళ్లి బోల్తాపడిందని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్‌, కండక్టర్‌తో పాటు నలుగురు ప్రయాణికులు ఉన్నారని ఉమర్‌ఖేడ్‌ తహసీల్దార్‌ ఆనంద్‌ డియోల్గావ్‌ చెప్పారు. వరద ఉదృతికి బస్సు కొట్టుకుపోతున్న సమయంలో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. 

ఆ తర్వాత గల్లంతైన నలుగురిలో ఒకరిని రక్షించి..ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. గల్లంతైనా ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు, పోలీసులు తెలిపారు. గతకొంతకాలంగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద ఉప్పొంగి వంతెనలపైకి నీరు చేరుతోంది. దీంతో బ్రిడ్జీలన్నీ నీటమునిగాయి. అటువంటి వంతెనలు దాటే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు.