యాదాద్రిలో 150 బ‌స్సులు పార్కింగ్ చేసేలా బ‌స్ టెర్మిన‌ల్‌

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా : యాదాద్రిలో 150 బస్సులు పార్కింగ్ చేసేలా అత్యాధునిక సదుపాయాలతో ఈ బస్ టెర్మినల్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. దేశ‌, విదేశాల నుంచి ల‌క్ష‌లాదిగా భ‌క్తులు యాదాద్రీశుడి ద‌ర్శ‌నానికి రానున్న క్రమంలో భ‌క్తుల ర‌ద్దీకి అనుగుణంగా యాదాద్రిలో ఈ బ‌స్ టెర్మిన‌ల్‌ ను  నిర్మించ‌నున్న‌ట్లు తెలిపారు. ఆల‌యం కింద సైదాపురం గ్రామ శివారులో ఏడు ఎక‌రాల్లో ఈ బస్ టెర్మినల్ నిర్మాణం చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపారు.  యాదాద్రిలో బస్ టెర్మినల్, బస్ డిపోకు కావల్సిన స్థలాన్ని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మతో పాటు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డితో కలిసి మంత్రి పువ్వాడ అజ‌య్‌కుమార్ మంగ‌ళ‌వారం పరిశీలించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు స్థలాన్ని పరిశీలిస్తున్న‌ట్లు, బస్ టెర్మినల్‌లో ప్రయాణికులకు కావాల్సిన అన్ని వసతులు క‌ల్పించే విధంగా నమూనాలను తయారు చేసి సీఎం కేసీఆర్‌కు అందజేస్తామని తెలిపారు. సీఎం ఆమోదంతో బస్ స్టేషన్, డిపో నిర్మాణాలను చేపడతామని తెలిపారు.

ఆలయ ప్రారంభానికి ముందే బస్ టెర్మినల్, డిపోలను ప్రారంభించడానికి అన్ని పనులను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని ర‌వాణా శాఖ మంత్రి అధికారులకు ఆదేశించారు. ఆలయానికి వెళ్లేందుకు ప్రత్యేకమైన స్టేషన్, ఇతర ప్రాంతాలకు వెళ్ళేందుకు మరో స్టేషన్ నిర్మాణం నూతన బస్ టెర్మినల్‌లో నిర్మించేలా ఇంజినీర్లు ప్లానింగ్ రెడీ చేయాలని చెప్పారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.

Latest Updates