- తొమ్మిది నెలలుగా షెడ్లకే పరిమితం
- పరిమిత సంఖ్యలో నడుస్తున్న రెగ్యులర్ ట్రైన్స్
- అంతంత మాత్రంగానే ఆర్టీసీ బస్సులు
- ‘ప్రైవేట్ ’లో అధిక చార్జీలతో జనం ఇబ్బందులు
హైదరాబాద్, వెలుగు: ప్రజా రవాణా సరిగా లేక ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. 9 నెలలుగా ఎంఎంటీఎస్ రైళ్లు షెడ్లకే పరిమితమయ్యాయి. జనరల్ ట్రైన్స్ కూడా పరిమితి సంఖ్యలో పట్టాలెక్కాయి. ఆర్టీసీ బస్సులు కూడా అంతంత మాత్రంగానే నడుస్తున్నాయి. దీంతో ప్రైవేట్ లో అధిక చార్జీలు పెట్టలేక ప్యాసింజర్స్ కష్టాలు పడుతున్నరు. జర్నీ చేయాలంటేనే జంకుతున్నారు. అనేక మంది సొంత బండ్లపైనే ప్రయాణించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
9 నెలలుగా ఎంఎంటీఎస్ బంద్..
లౌక్ డౌన్ కారణంగా మార్చి 16 నుంచి ఎంఎంటీఎస్ రైళ్ల సేవలు నిలిపివేశారు. జంట నగరాలు, శివారు ప్రాంతాల ప్రజలకు ఎంఎంటీఎస్ రైళ్లు ఎంతగానో ఉపయోగపడేవి. కేవలం రూ.15 టిక్కెట్‌తో 40 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సదుపాయం ఉండేది. ఇన్ టైంలో గమ్యాలకు చేరుకునేవారు. అనేక మంది ఐటీ ఎంప్లాయీస్, సాధారణ ఉద్యోగులు, చిరు వ్యాపారులకు ఎంఎంటీఎస్ రైళ్లే ఆధారం. లాక్ డౌన్ తర్వాత సిటీలో మెట్రోకు అనుమతి లభించినా.. ఎంఎంటీఎస్‌కు మాత్రం ఇంకా పర్మిషన్ రాలేదు. దీంతో దక్షిణ మధ్య రైల్వే రూ.కోటి పైనే ఆదాయం కోల్పోయింది. కొన్ని సిటీల్లో లోకల్ ట్రైన్స్ నడుస్తున్నాయి. అయితే మన దగ్గర మాత్రం సర్కారు అనుమతి కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.
రోజుకు 65 రైళ్లే.. బస్సులూ అంతంతే..
కొన్ని ఆంక్షలతో రైళ్ల సేవలకు కేంద్రం అనుమతి ఇచ్చినా.. అవీ అరకొరగానే నడుస్తున్నాయి. జూన్ 10 నుంచి ఎంపిక చేసిన ప్రాంతాలకు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి స్టేషన్ల నుంచి స్పెషల్ రైళ్లు నడిపిస్తున్నారు. కరోనా కంటే ముందు దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంతకల్లు, నాందేడ్ డివిజన్ల నుంచి 876 రైళ్లు రాకపోకలు సాగించేవి. వీటిలో ఒక్క సికింద్రాబాద్ స్టేషన్ నుంచే 128 రైళ్లు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేవి. వాటిలో 2 లక్షల మంది దాకా ప్రయాణించేవారు. ప్రస్తుతం 191 ట్రైన్స్ మాత్రమే నడుస్తున్నాయి. ఇందులో 95 రైళ్లు జోన్ నుంచి ప్రారంభం అవుతుండగా, మరో 96 ట్రైన్స్ జోన్ మీదుగా వెళ్తున్నాయి. రోజుకు సగటున 65 రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు కూడా అంతంతగానే నడుస్తున్నయి. గ్రేటర్లో మొత్తం 2,450 బస్సులుంటే1,700 బస్సులను నడుపుతున్నారు. బస్సులు లేకపోవడంతో, ఉన్నవి టైంకి రాకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. సిటీతోపాటు, శివారు ప్రాంతాల్లో బస్సులు లేక యాతన పడుతున్నారు.
‘ప్రైవేట్’లో మస్తు ఛార్జీలు..
రైళ్లు, బస్సులు పరిమిత సంఖ్యలో నడుస్తుండటంతో రోజూ ఆఫీసుకు వెళ్లేవాళ్లు, చిరు వ్యాపారులు అవస్థలు పడుతున్నారు. ప్రైవేటు వెహికల్స్ లో అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని… ఆటోలు, క్యాబ్‌ల లో కొద్దిపాటి దూరానికే వందల్లో అడుగుతున్నారని, క్యాబ్‌లలో ప్రైమ్ టైంలో ముక్కుపిండి చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. వెంటనే ప్రజా రవాణాను మెరుగుపర్చాలని డిమాండ్ చేస్తున్నారు.
For More News..