ప్రభుత్వ క్యాన్సర్ హాస్పిటల్ లో యూజర్ చార్జీల దందా

ప్రభుత్వ క్యాన్సర్ హాస్పిటల్ అయిన ఎం.ఎన్.జె హాస్పిటల్​లో ఆరోగ్యశ్రీ రోగుల నుంచి యూజర్ చార్జీల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని సీపీఎం గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ కమిటీ ఆరోపించింది. కొన్ని టెస్ట్ లకు రూ.100, 200, 300 వసూలు చేస్తుండగా ఎం.ఆర్.ఐ, సిటీ స్కాన్, ఐ.హెచ్.సి లాంటి టెస్ట్ లకు రూ.2 వేల నుంచి 3 వేల వరకు వసూలు చేస్తున్నారని సీపీఎం గ్రేటర్ సెంట్రల్ కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ ఆరోపించారు. ఆరోగ్యశ్రీ స్కీంలో చికిత్స పొందే రోగుల వద్ద ఒక్కపైసా వసూలు చేయొద్దని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నిబంధనలు స్పష్టం చేస్తున్నప్పటికీ అందుకు విరుద్ధంగా యూజర్ చార్జీల పేరుతో పేషెంట్లపై భారం మోపుతున్నారన్నారు.

చట్ట విరుద్ధంగా వసూలు చేస్తున్న ఈ ఛార్జీల దందాపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీపీఎం సెంట్రల్ కమిటీ డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో మెమోరాండం సమర్పించింది. వెంటనే వసూలు నిలిపివేయాలని, విచారణ జరపాలని కోరింది. హెత్ సెక్రటరీకి కూడా మెమోరాండం ఇచ్చింది. యూజర్ చార్జీలను ఆరోగ్యశ్రీ నుంచి బిల్లు వచ్చిన తర్వాత పేషెంట్లకు తిరిగి ఇస్తున్నామని ఎం.ఎన్.జె హాస్పిటల్ వర్గాలు చెబుతున్నప్పటికీ యూజర్ చార్జీలు వసూలు చేసే ముందు ఈ విషయాన్ని పేషెంట్లకు చెప్పటం లేదని శ్రీనివాస్ తెలిపారు. దీంతో చాలా మంది రోగులు డబ్బులు తిరిగి తీసుకోవటం లేదని, ఇలా వచ్చిన సొమ్మును ఏం చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

తిరిగి పేషెంట్లకు చెల్లిస్తున్నాం:డాక్టర్ జయలలిత, హాస్పిటల్​ డైరెక్టర్​

ఎం.ఎన్.జె లో యూజర్ చార్జీలు వసూలు చేయటమనేది మొదటి నుంచి ఉంది. పేషెంట్లకు  క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించిన తర్వాతే ఆరోగ్యశ్రీ ద్వారా బిల్లు పెట్టుకోవటానికి అవకాశం ఉంది. క్యాన్సర్ నిర్ధరణ కాకపోతే ఆరోగ్యశ్రీ ద్వారా బిల్లు పెట్టుకోవటానికి అవకాశం లేదు.

ఆ క్రమంలో నిర్వహించే టెస్ట్ లకు అయ్యే ఫిల్మ్ చార్జీలను తీసుకుంటున్నాం. అది కూడా చెల్లించే స్థాయిలో ఉన్న వారి వద్ద తీసుకుంటున్నాం. ఆరోగ్యశ్రీ బిల్లులు వచ్చాక తిరిగి వారికి యూజర్ చార్జీలు చెల్లిస్తున్నాం. యూజర్ ఛార్జీలను పూర్తిగా ఎత్తివేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నాం. ప్రభుత్వంతో మాట్లాడి రద్దు చేసే ప్రయత్నం చేస్తాం.

Latest Updates