
ఎవరితోనూ గొడవలు లేవని చెబుతున్న కుటుంబ సభ్యులు
కూకట్పల్లి, వెలుగు: మియాపూర్ పీఎస్ పరిధిలో మిస్సింగ్ అయిన వ్యాపారి కూకట్ పల్లి పీఎస్ పరిధిలో శవమై కనిపించాడు. అతడి తల,శరీరంపై ఉన్న గాయాల ఆధారంగా హత్యకు గురయ్యాడని పోలీసులు భావిస్తున్నారు. మియాపూర్ లోని జనప్రియనగర్ రెండో ఫేజ్ 195 ఎఫ్ లో ఉండే కాకర రామకృష్ణ(55) బిజినెస్ చేసేవాడు. మియాపూర్ ఆంధ్రాబ్యాంక్ లో లోన్ డబ్బులు కట్టి వస్తానని ఇంట్లో చెప్పి గురువారం సాయంత్రం 6 గంటలకు బయటికి వెళ్లాడు. ఎంతసేపటికీ రామకృష్ణ తిరిగిరాకపోవడంతో అతడి కొడుకు కిశోర్ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు తన తండ్రి కనిపించడంలేదంటూ మియాపూర్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. అదే టైమ్ లో కూకట్ పల్లిలోని కైత్లాపూర్ గ్రామంలోని డంపింగ్ యార్డు సమీపంలో ఓ డెడ్ బాడీని చూసిన స్థానికులు లోకల్ పోలీసులకు సమాచారం అందించారు. కూకట్ పల్లి పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు.
గుర్తుతెలియని వ్యక్తి హత్యగా భావించి దర్యాప్తు చేపట్టారు. మియాపూర్ లో కనిపించకుండాపోయిన వ్యాపారి రామకృష్ణ డెడ్ బాడీనే కూకట్ పల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు సాయంత్రానికి నిర్ధారణ అయ్యింది. రామకృష్ణను ఎక్కడో హత్య చేసి డెడ్ బాడీని కూకట్ పల్లి పరిధిలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు తమకు ఎవరితో ఎలాంటి గొడవలు లేవని రామకృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించి కేసు ఫైల్ చేశామని.. హత్యకు గల కారణాలు దర్యాప్తులో తెలుస్తాయని కూకట్ పల్లి పోలీసులు చెప్పారు.