ఏటేటా పెరుగుతున్న వ్యాపారస్తుల సూసైడ్స్

దివాలా.. చంపేస్తోంది

2018లో 7,990 మంది ఆత్మహత్య

ఎన్‌సీఆర్‌‌బీ డేటాలో వెల్లడి

ఎక్కువగా కర్నాటకలోనే

వ్యాపారం దివాలాతో ఆత్మహత్యలు

కెఫే కాఫీ డే ఫౌండర్ వీజీ సిద్ధార్థ సూసైడ్ గుర్తుండే ఉంటుంది కదా..! ఇంకా కళ్లముందే ఆ బిజినెస్‌ టైకూన్‌ మరణం మెదులుతోంది. ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి.. కెఫే కాఫీ డేను ఎన్నో దేశాలకు పరిచయం చేశారు. కానీ అప్పుల బాధ తాళలేకపోయారు. అప్పులిచ్చిన వారి నుంచి, ఐటీ అధికారుల నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకోలేక, ఇటు ఇంట్లో వారికి చెప్పుకోలేక చివరికి ఆత్మహత్య చేసుకున్నారు. వీజీ సిద్ధార్థ లాంటి వారు దేశంలో చాలా మందే ఉన్నారు. వ్యాపారాలు దివాలా తీయడంతో, కష్టించి పనిచేసినా,  ఫలితం రాకపోతుండటంతో చాలా మంది వ్యాపారవేత్తలు సూసైడ్స్ చేసుకుంటున్నారు. వ్యాపారవేత్తల సూసైడ్స్ ఏడాది ఏడాదికి పెరిగి పోతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా చూస్తే  ఈ విషయం స్పష్టమవుతోంది.

న్యూఢిల్లీ: ఎంత పెద్ద వ్యాపారవేత్తయినా… ఎంత చిన్న వ్యాపారం చేసుకునే వ్యక్తయినా… ఏదో ఒక సమయంలో భరించలేని ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ముఖ్యంగా మనీ విషయాల్లో. పెట్టుబడి మేనేజ్ చేసుకోలేని సమయంలో, వ్యాపారాలు దెబ్బతిని ధైర్యం ఇచ్చే వారు కరువైనప్పుడు, మరోవైపు అప్పులిచ్చినోళ్ల వేధింపులు.. ఇలాంటి సమయాల్లో చాలా మంది వ్యాపారవేత్తలు తనువులు చాలిస్తున్నారు. 2018లో ఇలా చనిపోయిన వ్యాపారవేత్తల సంఖ్య బాగానే పెరిగిందట. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్‌‌సీఆర్‌‌‌‌బీ) లెక్కల ప్రకారం 2018లో 7,990 మంది వ్యాపారవేత్తలు ఆత్మహత్య చేసుకుని చనిపోయారని తెలిసింది. ఈ సంఖ్య అంతకుముందు ఏడాదిలో చనిపోయిన 7,778 మందితో పోలిస్తే 2.7 శాతం పెరిగిందని వెల్లడైంది. ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వ్యాపారవేత్తల్లో కర్నాటక నుంచి ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఇక్కడ 1,113 మంది ప్రాణాలు తీసుకున్నారని తెలిసింది. ఆ తర్వాత మహారాష్ట్రలో 969 మంది వ్యాపారవేత్తలు, తమిళనాడులో 931 మంది బలవంతంగా తనువు చాలించారని వెల్లడైంది. అయితే ఆశ్చర్యకరంగా ఈ రాష్ట్రాల్లోనే అత్యధిక రాష్ట్ర జీడీపీ వృద్ధి నమోదవుతోంది. అంటే ఎకనామిక్ అవుట్‌‌పుట్ ఈ రాష్ట్రాల నుంచే అత్యధికం.

దివాలానే అసలు సమస్య

ఎన్‌‌సీఆర్‌‌‌‌బీ డేటా వ్యాపారవేత్తల ఆత్మహత్యలకు గల కారణాలను కూడా వెల్లడించింది.2018 లో మొత్తం 4,970 మందికి పైగా వ్యాపారవేత్తలు తమ బిజినెస్‌‌లు దివాలా తీయడంతో ప్రాణాలు తీసుకున్నారని చెప్పింది. 2017లో ఈ సంఖ్య 5,151గా ఉంది. అంటే  అంతకుముందు ఏడాదితో పోలిస్తే.. బిజినెస్‌‌లు దివాలా తీయడంతో చనిపోయిన వారి సంఖ్య కాస్త తగ్గింది. అయితే వ్యాపారాలు దివాలా తీయడాన్ని చాలా మంది  బయటికి చెప్పుకోలేక లోలోపల సతమతమవుతున్నారని ముంబైకి చెందిన సైకియాట్రిస్ట్‌‌ హరీష్ శెట్టి పేర్కొంటున్నారు. బిజినెస్ లాస్ అనేది ఫ్యామిలీస్‌‌లో పరువు ప్రతిష్టలకు మచ్చ తెచ్చేదిగా భావిస్తున్నారన్నారు.  వ్యాపారవేత్తలు సూసైడ్ చేసుకున్న కేసుల్లో రెండవ అతిపెద్ద కారణంగా ఫ్యామిలీ గొడవలు నిలుస్తున్నాయి. 2017లో ఫ్యామిలీ ఇష్యూలతో చనిపోయిన వారు 30.1 శాతం ఉంటే, ఈ సంఖ్య 2018 నాటికి 30.4 శాతానికి పెరిగింది. ఫ్యామిలీ ఇష్యూలు కూడా ఆర్థిక ఇబ్బందులతోనే ఎక్కువగా వస్తున్నాయని హరీష్ శెట్టి చెప్పారు. ఆరోగ్యపరమైన సమస్యలతో 17.7 శాతం మంది, పెళ్లి సంబంధమైన కారణాలతో 6.2 శాతం మంది, డ్రగ్స్‌‌కు బానిసలై 5.3 శాతం మంది, లవ్ ఫెయిల్యూర్‌‌‌‌తో 4 శాతం మంది వ్యాపారవేత్తలు ఆత్మహత్య చేసుకుని చనిపోయారని ఎన్‌‌సీఆర్‌‌‌‌బీ డేటా పేర్కొంది.

ఒత్తిడిని ఛేదించే మార్గాలు

మీ చేయి దాటిపోయినప్పుడు, ఫెయిల్యూర్స్ కామన్‌‌గా భావించాలి. అదేమీ షేమ్ కాదు.

ఫైనాన్సియల్, ఎమోషనల్ హెల్ప్ కోసం చూడాలి.

మీ ప్రాబ్లమ్స్‌‌ను స్నేహితులతో, కుటుంబ సభ్యులతో పంచుకోవాలి.

అప్పులిచ్చిన వారికి ఫోన్ చేసి, పరిస్థితిని అర్థమయ్యేలా చెప్పాలి.

మీ రోజువారీ ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి.

రోజుకు 13కి పైగా సూసైడ్స్…

రోజుకు 13కి పైగా సూసైడ్స్‌‌ వ్యాపారాల దివాలా వల్లనే జరుగుతున్నాయి. మహారాష్ట్రలో 1,541 సూసైడ్‌‌లు, కర్నాటకలో 1391 ఆత్మహత్యలు, బెంగళూరులో 142 కేసులు దివాలాకు సంబంధించినవే ఉన్నాయి. ముంబైలో 20 మంది వ్యాపారాలు దివాలా తీయడంతో చనిపోయారు. రోజంతా ఎంతో కష్టపడి పనిచేసినా.. తగినంత ప్రతిఫలం రాని సమయంలో చాలా మంది ఇక తమవల్ల కావడం లేదని కుంగిపోతున్నారని సైకియాట్రిస్ట్ అంజలి ఛాబ్రియా అన్నారు. తమ చేయి దాటిపోయిన సమయంలో హెల్ప్‌‌లెస్‌‌గా మారిపోతున్నారని పేర్కొన్నారు.

Latest Updates