రూ. 40కి కూరగాయలు కొని.. రూ. 500 ఇవ్వడంతో దొరికిన దొంగనోట్లు

రూ. 200, 500 నోట్లను కలర్ ​జిరాక్స్ ​తీసిన్రు

మంచిర్యాలలో ఇద్దరి అరెస్ట్​

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలో శనివారం దొంగ నోట్లు చలామణి చేస్తూ దొరికిన రాజేందర్​ వాటిని కలర్​ జిరాక్స్ ​తీసినట్లు పోలీసులు తేల్చారు. డీసీపీ ఉదయ్​కుమార్​రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జైపూర్​ మండలం నర్సింగాపూర్​ గ్రామానికి చెందిన బోయిని రాజేందర్(30) మంచిర్యాల మార్కెట్​లో శీపతి కుమార్ అనే వ్యాపారి దగ్గర రూ.40 కూరగాయలు కొనుగోలు చేసి రూ.500 నోటు ఇచ్చాడు. అతడి వద్ద చిల్లర లేకపోవడంతో పక్కన ఉన్న మరో వ్యాపారికి ఇచ్చి చిల్లర అడిగాడు. ఆ నోటు మందంగా ఉండడంతో అనుమానం వచ్చి మరొక నోటు ఇవ్వమన్నాడు. రెండు నోట్లపై సీరియల్​నంబర్​ఒకటే ఉండడంతో రాజేందర్​ను నిలదీయడంతో గొడవకు దిగాడు. వ్యాపారులంతా ఏకమై అతడిని స్తంభానికి కట్టేసి కొట్టి, పోలీసులకు అప్పగించారు. కుమార్ కంప్లైంట్​ మేరకు పోలీసులు రాజేందర్​పై కేసు ఫైల్​చేసి ఎంక్వైరీ చేపట్టారు.

రూ. 1.62 లక్షలు జిరాక్స్​ తీసిన్రు

జైపూర్​మండలం మద్దులపల్లికి చెందిన అట్ల మల్లేష్(39) కొన్నేళ్ల క్రితం మందమర్రిలో నివాసం ఉంటూ కరెన్సీ కలర్​ జిరాక్స్​ చేసి చలామణి చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. ఇద్దరి మధ్య మాటల క్రమంలో అతడు రాజేందర్​కు విషయం చెప్పాడు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ఇద్దరూ కలిసి నకిలీ కరెన్సీ చలామణి చేయాలనుకున్నారు. రాజేందర్​గ్రామంలో కలర్​ జిరాక్స్​ నడిపించే తన బావ బొలిశెట్టి లచ్చన్న దగ్గర జిరాక్స్​మిషన్​ను రోజుకు రూ.వెయ్యికి రెంట్​కు తీసుకున్నాడు. మంచిర్యాలలో పేపర్లు కొన్నారు. ఈ నెల 6న పెద్దపల్లి జిల్లా మంథని మండలం పోతారంలోని తన బంధువుల ఇంట్లో ఎవరూ లేని సమయంలో అక్కడ రూ.500, 200 నోట్లను జిరాక్స్​తీశారు. మల్లేష్​ రూ.56 వేలు, రాజేందర్​ రూ.1.06 లక్షలు వారి దగ్గర పెట్టుకున్నారు. ఈ నెల 7, 8, 9 తేదీల్లో గోదావరిఖని నుంచి మంచిర్యాల మధ్య తిరుగుతూ చిన్నచిన్న షాపులు, కూరగాయల వ్యాపారులను లక్ష్యంగా చేసుకున్నారు. వారి వద్ద తక్కువ మొత్తంలో వస్తువులను కొని నకిలీ నోట్లను ఇచ్చి వచ్చిన చిల్లర డబ్బులు జమ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే రాజేందర్​ మంచిర్యాలలో పట్టుబడ్డాడు. పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు.

For More News..

డెవలప్​మెంట్ గురించి చెప్పుడే కానీ చేస్తలేరు!

పంచాయతీ కార్యదర్శులకు త్వరలో ప్రమోషన్లు!

ఢిల్లీ పోయొచ్చినంక కేసీఆర్ మారిండు!

Latest Updates