పెట్రోల్ కార్లకే గిరాకీ..BS6 రూల్సే కారణం

న్యూఢిల్లీ : ఇండియాలో ఎస్‌‌యూవీ కార్లను కొనేవారు ఎక్కువగా పెట్రోల్ వెర్షన్‌‌నే కొంటున్నారు. రోడ్లపై డీజిల్ వాహనాలను నిషేధించాలని ప్లాన్స్‌‌తో పాటు త్వరలోనే బీఎస్–6 నిబంధనల అమలు కాబోతుండటమే ఇందుకు కారణమని తాజా రిపోర్ట్‌‌లు తెలిపాయి. 2019 సెప్టెంబర్‌‌‌‌లో అమ్ముడుపోయిన అన్ని యుటిలిటీ వెహికిల్స్‌‌లో 35 శాతం పెట్రోల్‌‌తో రన్ అయ్యేవే ఉన్నాయి. ఏడాది క్రితం వీటి అమ్మకాలు 17 శాతమే. వచ్చే కొన్ని నెలల్లో ఈ ట్రెండ్ మరింత పెరగనుందని, పెట్రోల్ వాహనాల విక్రయాలే ఎక్కువగా ఉంటాయని ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నారు. బీఎస్–6 నిబంధనలు అమల్లోకి వచ్చాక స్మాల్, మిడ్‌‌ సైజు ఎస్‌‌యూవీ అమ్మకాల్లో పెట్రోల్‌‌ వెహికిల్సే అత్యధికంగా ఉంటాయని పేర్కొంటున్నారు.

డీజిల్‌‌, పెట్రోల్‌‌ ధరలకు మధ్య తగ్గిన వ్యత్యాసం...

మరోవైపు పెట్రోల్‌‌కు,డీజిల్‌‌కు మధ్యనున్న ధరల వ్యత్యాసం కూడా ప్రస్తుతం చాలా సిటీల్లో రూ.ఐదుకు తగ్గింది. 2012 మేలో ఈ రెండింటి మధ్య రూ.31 తేడా ఉండేది. ఒడిశా, గోవా, గుజరాత్ వంటి కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు పెట్రోల్ కంటే డీజిలే అత్యధిక ధర పలుకుతోంది. అప్పట్లో కాస్ట్ బెనిఫిట్‌‌తో డీజిల్ వెహికిల్స్‌‌ను కొనేవారు. కానీ ఇప్పుడు అది కూడా లేదు. మరోవైపు డీజిల్ వెహికిల్స్‌‌తో పర్యావరణం కూడా బాగా దెబ్బతింటోంది. పర్యావరణంపై కన్జూమర్లు స్పృహతోనే ఉంటున్నారని, కాలుష్యాన్ని తగ్గించేందుకు చాలా మంది డీజిల్ వెహికిల్స్‌‌ను కొనడం లేదని కంపెనీలు చెబుతున్నాయి. కియా సెల్టోస్, ఎంజీ హెక్టార్ లాంటి కొత్త వెహికిల్స్‌‌ కూడా ప్రస్తుతం పెట్రోల్ వెర్షన్లలోనే లాంచ్ అయ్యాయి.

2 కోట్ల కార్లు అమ్మిన మారుతి

  • తొలి కారు 1983 డిసెంబర్ 14న విడుదల

న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియన్ మార్కెట్‌‌లో రెండు కోట్ల ప్యాసెంజర్ వెహికిల్స్‌‌ను అమ్మింది.  తాము పీవీ అమ్మకాల్లో రెండు కోట్ల మైలురాయిని క్రాస్ చేశామని  శనివారం మారుతీ సుజుకి వెల్లడించింది. కంపెనీ తొలి కారును 1983 డిసెంబర్ 14న తీసుకొచ్చింది. ఐకానిక్ మారుతీ 800ను తొలుత మార్కెట్‌‌లో ప్రవేశపెట్టింది. తొలి కారును తెచ్చిన 37 ఏళ్ల కంటే తక్కువ సమయంలోనే ఈ మార్క్‌‌ను సాధించినట్టు మారుతీ సుజుకి ఇండియా ప్రకటించింది. 29 ఏళ్లలోనే కోటి వెహికిల్ సేల్స్‌‌ను అందుకున్నామని, మరో కోటి వెహికిల్‌‌ సేల్స్‌‌ను రికార్డు సమయంలో(8 ఏళ్లలోనే) ఛేదించినట్టు పేర్కొంది. ఈ మైలురాయిని సాధించడం, మారుతీ సుజుకికి, తమ డీలర్లకు, సప్లయిర్లకు గొప్ప విజయమని మారుతి సుజుకి ఇండియా ఎండీ, సీఈవో కెనిచి అయుకవ అన్నారు. సీఎన్‌‌జీ వెహికిల్స్‌‌ను, స్మార్ట్ హైబ్రిడ్ వెహికిల్స్‌‌ను, బీఎస్6 మోడల్స్‌‌ను నిర్దేశించుకున్న సమయం లోపల ప్రవేశపెట్టినట్టు తెలిపారు. చిన్న ఈవీని ఇండియన్ మార్కెట్‌‌లోకి తెచ్చేందుకు  మారుతీ సుజుకి చూస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 50 ఈవీలను టెస్ట్‌‌ చేస్తోంది.

 

Latest Updates