భారీగా పెరిగిన నిత్యావసర వస్తువుల కొనుగోళ్లు

 •                కరోనా భయానికి పెరిగిన నిత్యావసర వస్తువుల అమ్మకాలు
 •                 కిరాణా స్లోర్లు, ఈకామర్స్ సైట్లలో కొనుగోళ్ల జోరు
 •               కరోనాతో ఉప్పు, పప్పు.. బియ్యం, కారం తెగ కొంటున్నరు
 •               బిగ్‌ బాస్కెట్, గ్రోఫర్స్ లాంటి
 •                 ఈ-గ్రోసర్‌‌ల్లో 100 శాతం వరకు పెరిగిన అమ్మకాలు
 •                 సప్లయిను పెంచుతోన్న రిటైల్ చెయిన్స్, ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు
 •                 బిస్కెట్స్, రోజువారీ తినే ఆహార పదార్థాలు, సోప్స్, హ్యాండ్ వాషెస్‌ అమ్మకాలు పెరిగినయ్​
 •                 సిటీల షట్‌డౌన్, వర్క్ ఫ్రమ్ హోమ్‌తో పెరిగిన డిమాండ్
 •                 బియ్యం, గోధుమలు అవుటాఫ్ స్టాక్

కరోనా భయానికి సిటీలన్ని ఎక్కడికక్కడ లాక్‌‌డౌన్ అయిపోతున్నాయి. రాకపోకలు తగ్గాయి. కరోనా కేసులు పెరిగితే… చాలా నిత్యావసర వస్తువులు దొరకకుండా పోతాయని ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. ఇప్పటికే మాల్స్‌‌ను, ప్రజలు రద్దీగా ఉండే స్టోర్లను మూసివేయాలని ప్రభుత్వాలు ఆదేశిస్తున్నాయి. దీంతో ముందస్తు జాగ్రత్తగా అవసరమైన అన్ని వస్తువులను  ముందే కొనిపెట్టుకోవాలని ప్రజలు చూస్తున్నారు. దీంతో ఎన్నడు లేనంతగా ఈకామర్స్ ఫ్లాట్‌‌ఫామ్స్, రిటైల్ చెయిన్లు, కిరాణా స్టోర్లలో అమ్మకాలు పెరిగాయి. వీటిలో నిత్యావసర వస్తువులు, శానిటైజర్స్, ఫ్లోర్ క్లీనర్స్‌‌ కు గిరాకీ బాగా కనిపిస్తోంది. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో, గత కొన్ని రోజుల నుంచి  కన్జూమర్ గూడ్స్‌‌ అమ్మకాలు రాకెట్‌‌ వేగంతో పెరుగుతున్నాయని కిరాణా స్టోర్లు, ఈకామర్స్ ప్లాట్‌‌ఫామ్స్ చెబుతున్నాయి. డిమాండ్ మేరకు కొన్ని ప్రొడక్ట్‌‌లు అవుటాఫ్​ స్టాక్ అవుతున్నాయి.  శానిటైజర్స్ లాంటి ప్రొడక్ట్‌‌లు ఆన్‌‌లైన్‌‌లో అందుబాటులో ఉండటం లేదు. కొన్ని మెడికల్ షాపుల్లో వీటి కొరత కనిపిస్తోంది. వీటి ధరలు కూడా అమాంతం పెరిగాయి. షాపులకు, కిరాణా స్టోర్లకు నిత్యావసర సరుకులను సప్లయి చేయడంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించడం లేదని, వీటి కొరత లేదని రిటైలర్స్, ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్(ఎఫ్‌‌ఎంసీజీ) కంపెనీలు చెబుతున్నాయి. కేటగిరీని బట్టి అమ్మకాలు 15–45 శాతం పెరిగాయని పేర్కొన్నాయి. బియ్యం, గోధుమ పిండి, ఆయిల్, షుగర్, బిస్కెట్స్, ఇన్‌‌స్టాంట్ నూడుల్స్, బట్టర్, ఫ్రోజెన్ ఫుడ్, సోప్స్, హ్యాండ్‌‌వాషెస్, ఫ్లోర్ క్లీనర్స్ వంటి ప్రొడక్ట్‌‌లు.. హైదరాబాద్,ముంబై, ఢిల్లీ–ఎన్‌‌సీఆర్, బెంగళూరు, పుణే, కొచ్చి, తిరువనంతపురం, అహ్మదాబాద్‌‌లలో వేగంగా అమ్ముడుపోతున్నట్టు ఫ్యూచర్ గ్రూప్‌‌, గ్రోఫర్స్, స్పెన్సర్స్ రిటైల్, అమెజాన్, ఫ్లిప్‌‌కార్ట్‌‌లకు చెందిన ఎగ్జిక్యూటివ్‌‌లు చెప్పారు. ఎక్కువగా అమ్ముడుపోతున్న మిగతా ప్రొడక్ట్‌‌ల్లో శానిటైజర్స్, ఫ్లోర్‌‌‌‌ క్లీనర్స్, హనీ, టాయ్‌‌లెట్ పేపర్, టిస్యూస్, వెట్ వైప్స్ ఉంటున్నట్టుపేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు ఈ ప్రొడక్ట్‌‌ల్లో ఎలాంటి సప్లయి సమస్య రాలేదని గ్రోఫర్స్ సీఈవో అల్‌‌బిందర్ ధిండ్సా చెప్పారు. నిత్యావసర వస్తువులు ఎప్పడికప్పుడు అందుబాటులో ఉండేలా తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. చాలా మంది వ్యక్తులు ఈ వస్తువుల కొనుగోలులో గేమ్స్ ఆడుతున్నారని, వారిని తమ ప్లాట్‌‌ఫామ్‌‌పై బ్లాక్ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. జెన్యూన్ కస్టమర్లకే నిత్యావసర వస్తువులను సప్లయి చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆఫీసులు, మాల్స్, స్కూల్స్, కాలేజీలు, మల్టిఫ్లెక్స్‌‌లు, పబ్స్, రెస్టారెంట్లు, అన్ని ప్రభుత్వ ఆఫీసులు మూతపడటం, ప్రైవేట్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ చేస్తుండటంతో… ఇన్‌‌–హోమ్‌‌ కంన్జప్షన్ పెరిగిందన్నారు.

కరోనా భయంతో పెరిగిన నిత్యావసర వస్తువుల కొనుగోళ్లు, మరో రెండు వారాల వరకు ఇలానే కొనసాగవచ్చని బిస్కెట్ మేకర్ పార్లే ప్రొడక్ట్స్ కేటగిరీ హెడ్ మయాంక్ షా చెప్పారు. సాధారణంగా అమ్ముడుపోయే వాటి కంటే 15–20 శాతం అమ్మకాలు పెరిగాయన్నారు. అన్ని నగరాల్లో గత కొన్ని రోజుల నుంచి డిమాండ్ రెండింతలు పెరిగిందని ఈ–గ్రోసర్ బిగ్‌‌బాస్కెట్ చెప్పింది. ఆర్డర్ వాల్యు యావరేజ్‌‌గా 20 శాతం వరకు పెరిగిందని తెలిపింది. కేవలం ముంబైలోనే 80 శాతం వరకు డిమాండ్ పెరిగిందని  గ్రోఫర్స్ సీఈవో ధిండ్సా చెప్పారు. బెంగళూరు, న్యూఢిల్లీల్లో యావరేజ్‌‌గా 50 శాతం పెరిగినట్టు పేర్కొన్నారు. సంఖ్యా పరంగా ఆర్డర్స్ 45 శాతం, వాల్యు పరంగా 18 శాతం పెరిగినట్టు వెల్లడించారు. ఉల్లిగడ్డలు, ఆలు గడ్డలు, బియ్యం, గోధుమలు తమ ప్లాట్‌‌ఫామ్స్‌‌పై అవుటాఫ్ స్టాక్ అవుతున్నట్టు ఆన్‌‌లైన్ గ్రోసరీ సంస్థలు చెప్పాయి. దిగుమతులపై ఆధారపడే డైపర్స్,డ్రై ఫ్రూట్స్, ఆయిల్స్, ధాన్యాల్లో సప్లయి కొరత ఏర్పడిందని ఈ సంస్థల ఎగ్జిక్యూటివ్‌‌లు తెలిపారు.  ఐటీసీ లిమిటెడ్, పార్లే ప్రొడక్ట్స్, అమూల్,గోద్రెజ్ కన్జూమర్‌‌‌‌ వంటి ఎఫ్‌‌ఎంసీజీ కంపెనీలు డిమాండ్‌‌ను అందుకోవడానికి ఎక్కువగా అమ్ముడుపోయే వస్తువుల సప్లయిని పెంచాయి. ఈకామర్స్ ప్లాట్‌‌ఫామ్స్, కిరాణాలు జనాల నుంచి డిమాండ్ పెరిగినట్టు తమకు రిపోర్ట్ చేశాయని అమూల్ ఎండీ ఆర్‌‌‌‌ సోధి తెలిపారు.

 • కరోనా వైరస్ కారణంతో ఖరీదైనవిగా మారినవి.. చౌకగా మారినవి…

ఖరీదైనవిగా.. బంగారం

వైరస్ భయానికి స్టాక్ మార్కెట్లు కుప్పకూలు తుండటంతో, ఇన్వెస్టర్లు సురక్షితమైన సాధనంగా బంగారాన్ని భావిస్తున్నారు.

మాస్క్‌‌లు, శానిటైజర్స్

కరోనా రాకుండా ఉండేందుకు ప్రజలు తమ వంతు జాగ్రత్తగా మాస్క్‌‌లు పెట్టుకుని బయట తిరగాలని, ఎప్పడికప్పుడు శానిటైజర్స్‌‌తో చేతులు శుభ్రపరుచుకోవాలని ఆదేశాలు వస్తుండటంతో వీటికి బాగా డిమాండ్ పెరిగి, ధరలు అమాంతం ఎగిశాయి.

మెడిసిన్లు

చైనా నుంచి  వచ్చే బల్క్ డ్రగ్స్ ఇంటర్‌‌‌‌మీడియేటర్స్ తగ్గడంతో, మెడిసిన్లు కాస్ట్‌‌లీగా మారాయి. పారాసిటమల్‌‌ను కామన్‌‌గా వాడుతుండటంతో దీని ధర 40 శాతం వరకు పెరిగింది.

ఫోన్లు

చైనా షట్‌‌డౌన్ అవడంతో, సప్లయి చెయిన్‌‌ ప్రభావితమైంది. దీంతో ఫోన్ల తయారీకి అవసరమైన కాంపోనెంట్ల దిగుమతి తగ్గి, ధరలు పెరిగాయి. ఈ ప్రభావం ఫోన్ ధరలపై పడుతోంది.

ఏసీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్ లాంటి కన్జూమర్ డ్యూరెబుల్స్

కన్జూమర్ డ్యూరెబుల్స్‌‌కు కావాల్సిన 45 శాతం కంప్లీట్ బిల్ట్ యూనిట్లను చైనా నుంచే ఇండియా దిగుమతి చేసుకుంటోంది. ఇప్పటి వరకైతే స్టాక్ ఉన్నప్పటికీ, వచ్చే నెల నుంచి ధరలపై కరోనా ప్రభావం పడే అవకాశం ఉంది.

 

 • చౌకగా మారినవి…

పెట్రోల్,డీజిల్

ఇంటర్నేషనల్‌‌‌‌గా క్రూడాయిల్ ధరలు దిగి రావడంతో, దేశంలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి.

నాన్ వెజ్ ఐటమ్స్

నాన్ వెజ్ ఐటమ్స్ వల్లే కరోనా వస్తుందని రూమర్లు రావడంతో, కోడి, మేక మాసం, గుడ్ల ధరలు తగ్గిపోయాయి.

టీ.. ఇరాన్, చైనాలు టీని ఇంపోర్ట్ చేసుకోవట్లే. దీంతో గతేడాది ఇండియాలో  రూ.200గా ఉన్న ధరలు ఇప్పుడు రూ.120కి తగ్గాయి.

విమాన టిక్కెట్లు

ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో, విమాన టిక్కెట్లు చౌకగా మారాయి.

ఓలా, ఉబర్ ధరలు

జనాలు ఇళ్లకే పరిమితం అవుతుండటంతో, ఓలా, ఉబర్ లాంటి రైడ్స్ హైలింగ్ ప్లాట్‌‌‌‌ఫామ్స్‌‌‌‌పై ట్రాఫిక్‌‌‌‌ తగ్గింది. డిమాండ్ 50 శాతం వరకు పడింది. దీంతో వీటి ఫెయిర్స్ దిగొచ్చాయి.

Latest Updates