లేఅవుట్లు​, ప్లాట్లకు మస్తు గిరాకీ : ట్రిపులార్ ప్రపోజల్​తో పాత వెంచర్లు కొంటున్నరు

లేఅవుట్లు​, ప్లాట్లకు మస్తు గిరాకీ : ట్రిపులార్ ప్రపోజల్​తో పాత వెంచర్లు కొంటున్నరు

శివారు జిల్లాల్లోని లేఅవుట్లు​, ప్లాట్లకు గిరాకీ
రియల్​ బిజినెస్​కు పెరిగిన డిమాండ్​
పర్మిషన్ల కోసం హెచ్ఎండీఏకు అప్లికేషన్లు

“ ఘట్ కేసర్ కు చెందిన ఓ రియల్ వ్యాపారి కొత్తగా వెంచర్ చేసేందుకు రెడీ అయ్యాడు.   మార్కెట్ లో భూముల ధరలు భారీగా ఉండగా కోట్లు ఖర్చు చేసి కొత్తగా ఎందుకని ఆలోచించాడు. రీజినల్ రింగ్​రోడ్డు ప్రకటన రావడంతో వెంటనే భువనగిరికి సమీపంలో 1998 సంవత్సరం నాటి 8 ఎకరాల జీపీ లే అవుట్ పాత వెంచర్ కొన్నాడు. మార్కెటింగ్ చేసుకునేందుకు రోడ్లు, ఓపెన్ ఏరియా, వసతులు లాంటివి కల్పిస్తున్నాడు.” “ కొత్తపేట్ కు చెందిన రమేష్ మూడేళ్ల కిందట కడ్తాల్ లోని ఓ వెంచర్ లో ప్లాటును కొన్నాడు.  కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులతో అమ్మేందుకు గతేడాది ట్రై చేయగా ఎవరూ ముందుకు రాలేదు. ప్రస్తుతం శ్రీశైలం హైవే మీదుగా రీజినల్ రింగ్​రోడ్డు ప్రపోజల్​ప్రకటనతో నెలరోజులు గా స్థానిక రియల్​ఏజెంట్లు అమ్మిపెడతామంటూ అతని వెంట  పడుతున్నాడు.’’ 

హైదరాబాద్, వెలుగు : రీజినల్ రింగ్​రోడ్డు (ఆర్ఆర్ఆర్ )ప్రపోజల్ ​ప్రకటనతో  సిటీ శివారు జిల్లాల్లో రియల్​బిజినెస్ కు డిమాండ్​ పెరిగింది. సింగిల్ ప్లాటుతో పాటు  ఎకరాల విస్తీర్ణంలోని పాత వెంచర్లు కూడా అమ్ముడవుతున్నాయి.  ట్రిపులార్​ పై  కేంద్రం ప్రపోజల్​తోనే రియల్​ మార్కెట్ లో బూస్టింగ్ వస్తుంటే, ఇక పనులు మొదలైతే ఓపెన్ ప్లాట్లు, రెసిడెన్షియల్ ​ప్రాజెక్టుల నిర్మాణాలు, అమ్మకాలు, కొనుగోళ్లు మరింత పెరుగుతాయి. ఓఆర్ఆర్ కు 40 నుంచి 50 కిలోమీటర్ల దూరంలోనే ట్రిపులార్ అలైన్ మెంట్ ఉండడంతో ఆయా ప్రాంతాలకు మూడు కిలోమీటర్ల పరిధిలోనే అమ్మకాలు ఎక్కువవుతున్నాయి. 

 ప్రాజెక్టులకు డిమాండ్ 

ఓఆర్ఆర్ కు 10 కిలోమీటర్ల లోపు కోట్ల పోసి భూములు కొని డెవలప్​ చేయడం ఎందుకని పాత వెంచర్లపై ఇన్వెస్టర్లు, రియల్ వ్యాపారులు ఇంట్రెస్ట్​పెట్టారు. హెచ్ఎండీఏ పరిధిలో కొనేవారు ఎక్కువయ్యారు. తక్కువ ధరలో వీటిని తీసుకొని డీటీసీపీ, హెచ్ఎండీఏ, వైటీడీఏ  రూల్స్​ కు అనుగుణంగా డెవలప్ చేసి బిజినెస్ ​చేసేందుకు రెడీ అవుతున్నారు. మరో ఐదారు నెలలు గడిస్తే జీపీ లే అవుట్లు కూడా దొరకని పరిస్థితి ఉంటుందని పటాన్ చెరుకు చెందిన ఓ రియల్ వ్యాపారి చెప్పారు.  

విస్తరణలో బడా కంపెనీలు

ఐదారేళ్ల క్రితమే ట్రిపులార్ పేరిట బడా కంపెనీలు రియల్​బిజినెస్​మొదలు పెట్టాయి. ప్రాజెక్టు తాత్కాలికంగా ఆగిపోవడంతో క్రయవిక్రయాలపై కొంత ఎఫెక్ట్​ పడింది. ఇటీవల కేంద్రం మళ్లీ పర్మిషన్​ ఇవ్వడంతో ఆయా ప్రాంతాల్లో వెంచర్లను చేసేందుకు రెడీ అయ్యారు. ట్రిపులార్ వెళ్లే నర్సాపూర్, తూప్రాన్, భువనగిరి, చౌటుప్పల్, యాచారం, కడ్తాల్ వంటి ప్రాంతాల్లో ఉన్న బడా కంపెనీలు తమ వెంచర్లను వందల ఎకరాల్లో డెవలప్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి.  పర్మిషన్లకు అప్లికేషన్లు కొత్తగా తెచ్చిన ఎల్ఆర్ఎస్ తో జీపీ లే ఔట్ల పర్మిషన్లకు ఇబ్బంది పడాల్సి వస్తుంది. దీంతో పాత లే ఔట్లను ప్రస్తుత రూల్స్​కు అనుగుణంగా డెవలప్ చేస్తున్నారు. దీంతో జీపీ లే ఔట్లను తక్కువ ధరలో కొనుగోలు చేసి, వాటిలో 30, 40, 60, 100 ఫీట్ల రోడ్లు, ఓపెన్ స్పేస్, క్లబ్ హౌజ్ వంటి మౌలిక వసతులను మెరుగుపరిచి డీటీసీపీ, హెచ్ఎండీఏ లకు పర్మిషన్ల కోసం అప్లై చేస్తున్నారు. పర్మిషన్ల ప్రక్రియ ఈజీగానే  అవడంతోపాటు, పాత ధర కంటే ఎక్కువ వస్తుంది. దీంతో హెచ్ఎండీఏ పరిధిలో ఘట్ కేసర్ జోన్ లో  ఇలాంటి అప్లికేషన్లు ఎక్కువగా వస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. 

ధరలకు రెక్కలు

ట్రిపులార్ పనులు మొదలైతే  భూముల ధరలకు మళ్లీ రెక్కలు వచ్చే అవకాశం ఉంది. ఇన్వెస్ట్ మెంట్ కోసమైనా వెంచర్లు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అలైన్ మెంట్, భూ సేకరణ ఖరారైతే ఆయా ప్రాంతాల్లో కనీసం ఐదు కిలోమీటర్ల వరకు ధరలపై ప్రభావం చూపుతుందని, పర్మిషన్ల కోసం వచ్చే వెంచర్ల సంఖ్య భారీగా పెరుగుతుందని హెచ్ఎండీఏ అధికారులు పేర్కొంటున్నారు.నిర్మాణ కంపెనీలు మాయ చేస్తాయని, అన్ని అనుమతులు ఉన్నవాటిలో కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు.

సోషల్ ఇన్​ఫ్రా ఉంటే చాలని..

రీజినల్ రింగ్​రోడ్డు వస్తుందని తెలిసిన తర్వాత అమ్మకాలు పెరుగుతున్నాయి. రోడ్లు, స్కూళ్లు, హాస్పిటల్స్ వంటి సోషల్ ఇన్ ఫ్రా ఉంటే సిటీకి దూరంగా ఉండడానికైనా జనాలు వెనకాడడం లేదు. కంపెనీలు కూడా వస్తాయని భావించి కొందరు,  ఫ్యూచర్ ఇన్వెస్ట్ మెంట్ కోసమని మరికొందరు ప్లాట్లను కొంటున్నారు.  - అనిల్ రెడ్డి, మార్కెటింగ్ హెడ్ 

పాత ప్లాట్లను కొనేందుకు ఇంట్రెస్ట్​


ఓపెన్ ప్లాట్లు కొనుగోలు చేస్తున్నరంటేనే, ప్యూచర్ ఇన్వెస్ట్ మెంట్ కోసమని భావించాలి. మంచి ధర వచ్చిందంటే అమ్మేస్తుంటారు. ఒక వెంచర్​లో ప్లాట్లు అమ్ముడైనా, రీ సేల్ బిజినెస్ నడుస్తూనే ఉంటుంది. ఇలా రీజినల్​ రింగ్​రోడ్డు వస్తుందని తెలిసి తక్కువ ధరకు దొరికే రీ సేల్ ఓపెన్ ప్లాట్లను అడుగుతున్నారు. ఒకటి, రెండేళ్ల లోనే పెట్టిన పెట్టుబడికి రెండు వేల ధర ఎక్కువ వస్తుంది. ప్రస్తుతం ట్రిపులార్ పరిసరాల్లో పాత వెంచర్లలోని ప్లాట్లను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు.                                     - సందీప్, రియల్ ఎస్టేట్ కంపెనీ మేనేజర్