తమిళంలో ఎంటరైన బైజూస్… త్వరలో తెలుగులో

ఆన్ లైన్ క్లాసులు నిర్వహించే ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్ ఇప్పుడు ప్రాంతీయ భాషల్లో కూడా ప్రవేశించింది. రాబోయే నెలల్లో మరిన్ని ప్రాంతీయ భాషల్లోకి టీచింగ్ క్లాసులు ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది. ఇప్పటికే 70 మిలియన్ల మంది యూజర్లను కలిగి ఉన్నబైజూస్.. 4 నుంచి 10 వ తరగతి విద్యార్థుల కోసం తమిళంలో టీచింగ్ కార్యక్రమాలను ప్రారంభించింది. తమిళనాడులో పెద్ద సంఖ్యలో యూజర్లను పెంచుకోవడానికి తమిళ వెర్షన్‌తో రంగంలోకి దిగింది. సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులను క్లిష్టంగా భావించే విద్యార్థులకు ప్రాంతీయ భాషల్లోనే బోధిస్తే వారికి ఆ సబ్జెక్టుల్లో ప్రావీణ్యం సంపాదించే అవకాశం ఉంటుందని కంపెనీ భావిస్తోంది. ఇదే వ్యూహంతో ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా యూజర్లను పెంచుకునేందుకు సన్నాహాలు చేసుకుంటోంది.

ఇప్పటి వరకు ఇంగ్లీషులో ఆన్ లైన్ లో పాఠాలు చెప్పే ఈ యాప్.. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2011లో బైజు రవీంద్రన్ థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్థాపించి  ఈ రంగంలో తిరుగులేని ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే 42 వేల కోట్ల రూపాయల విలువ కంపెనీగా ఎదిగిన బైజూస్ ను ప్రాంతీయ భాషల్లోకి అందుబాటులోకి విస్తరించి మరింత మంది యూజర్లను పెంచుకోవాలని యోచిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. కరోనా వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆన్ లైన్ క్లాసులకు విపరీతమైన ఆదరణ ఏర్పడిన విషయం తెలిసిందే. చాలా ఏళ్ల కిందటే ఆన్ లైన్ క్లాసుల మార్కెట్ ను ప్రారంభించిన బైజూస్.. ఇదే అవకాశంగా ప్రాంతీయ భాషల్లో కూడా వీలైనంత వేగంగా విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

 

 

Latest Updates