కాలిఫోర్నియాకు రియల్​ చిచ్చు

    కార్చిచ్చులతో కోటిన్నర కోట్ల నష్టం.. ఇళ్లు వదిలేసి వెళుతున్న జనం

    లాస్​ ఏంజిలిస్​, ఆరెంజ్​కౌంటీ, శాంటా క్లారా, శాన్​డయిగోలో డల్​ అయిన వ్యాపారం

    కార్చిచ్చులతో బీమా ప్రీమియం పెంచేస్తున్న కంపెనీలు

    సేఫ్​ ప్లేస్​లకు మకాం మార్పు

    మంచి ఆఫర్లు ఇస్తున్న బిల్డర్లు

కొద్ది నెలల క్రితం అమెజాన్​ అడవికి నిప్పంటుకుంది. ఊపిరితిత్తులు కాలిపోతున్నాయని ప్రపంచం మొత్తం గొంతెత్తి అరిచింది. దాని వల్ల అడవులు బాగా దెబ్బతిని ఉండొచ్చు. కానీ, ఆ సెగ అడవిని దాటి ఊళ్లల్లోకి రాలేదు. ఇళ్లను కాల్చేయలేదు. కాలిఫోర్నియాకూ కార్చిచ్చులు కొత్తేం కాదు. ఎప్పటినుంచో అమెరికాలోని ఆ రాష్ట్రం మంటల బాధను అనుభవిస్తోంది. నిప్పులు రగిలి రగిలి ఇళ్లను ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మకు.. ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకు.. అడవి నుంచి ఊరికి మంటలు వ్యాపించేస్తున్నాయి. ఇళ్లను బూడిద చేస్తున్నాయి. మంటలను అదుపు చేయాలన్న ఉద్దేశంతో అక్కడి అధికారులు కరెంట్​ను రోజుల తరబడి కట్​ చేస్తున్నారు. దీంతో అక్కడి ప్రజల బాధలు చెప్పలేకుండా ఉన్నాయి. అందుకే మంచిగ బతికితే చాలనుకుని ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసేసి వెళ్లిపోతున్నారు. ఇళ్లను వచ్చిన ధరకే అమ్మేసుకుని భద్రమైన ప్రాంతాల బాట పడుతున్నారు. దాని వల్ల కాలిఫోర్నియాలోని నాలుగు కౌంటీల్లో సుమారు 1.41 కోట్ల కోట్ల రూపాయలకుపైనే విలువైన ఇళ్లకు (రియల్​) నష్టం వాటిల్లుతోంది (2 లక్షల కోట్ల డాలర్లు).  అమెరికాకు చెందిన రెడ్​ఫిన్​ అనే సంస్థ కార్చిచ్చుల వల్ల రియల్​ఎస్టేట్​కు జరుగుతున్న నష్టంపై నివేదిక విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం ఒక్క లాస్​ ఏంజిలిస్​లోనే 84 లక్షల కోట్లకు పైగా (లక్షా 20 వేల కోట్ల డాలర్లు) నష్టం వాటిల్లిందట. ఆ తర్వాత ఆరెంజ్​ కౌంటీలో ₹35.44 లక్షల కోట్లు (50,260 కోట్ల డాలర్లు), శాంటా క్లారాలో ₹34.45 లక్షల కోట్లు (48,850 కోట్ల డాలర్లు), శాన్​ డయిగో కౌంటీలో ₹29.45 లక్షల కోట్లు (41,760 కోట్ల డాలర్లు) మేర హౌసింగ్​పై నష్టం వాటిల్లిందని రిపోర్టు వివరించింది.

ప్రీమియం 9 వేల డాలర్లు

చాలా కౌంటీల్లో ఇన్సూరెన్స్​ కంపెనీలు ఫైర్​ ఇన్సూరెన్స్​ ప్రీమియంను ఏడాదికి 9 వేల డాలర్లకు (సుమారు ₹6 లక్షల 34 వేలు) పెంచాయని ఏజెంట్లు చెబుతున్నారు. దీంతో జనాలు కార్చిచ్చులు సంభవించే చోట ఇళ్లు కొనాలంటేనే భయపడుతున్నారట. మొదటి రెండేళ్లపాటు సగం ప్రీమియంను తామే కడతామని బిల్డర్లు ఆఫర్​ ఇస్తున్నా, వద్దని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారట. ప్రీమియం కట్టకపోయినా ఫర్వాలేదుగానీ, సేఫ్​ ప్లేస్​ అయితేనే కొంటామని అంటున్నారట. ఇదే మంచి అవకాశంగా భావించిన కార్చిచ్చులు జరగని ప్రాంతాల్లోని రియల్​ వ్యాపారులు మంచి మంచి ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఫైర్​ ఇన్సూరెన్స్​ను కట్టడంతో పాటు ఇంటి ధరలను తగ్గించేస్తున్నారు. అవసరమైతే కార్చిచ్చుల ప్రమాదాలు జరగకుండా చెట్లను కొట్టేస్తామని, మంచి రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తామని ఆఫర్లు ఇచ్చేస్తున్నారు. దీంతో ఒకప్పుడు రియల్​ వ్యాపారం డల్​గా ఉన్న ప్రాంతాల్లోనూ ఇప్పుడు జోరందుకుంది. జోరుగా రియల్​ వ్యాపారం సాగిన లాస్​ఏంజిలిస్​, ఆరెంజ్​ తదితర కౌంటీల్లో పడిపోయింది. ఉదాహరణకు ఈ ఏడాది సెప్టెంబర్​లో లాస్​ఏంజిలిస్​ రియల్​ వ్యాపారం 12 శాతం పడిపోయింది. అదే ఆరెంజ్​ కౌంటీలో అయితే 17 శాతంగా ఉంది. అది మరింత పడిపోయే అవకాశం ఉందని రియల్​ఎస్టేట్​ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఇళ్లు అమ్ముకోని కొందరు ఇంటి ఓనర్లు, మంటల్లో కాలిపోయిన తమ ఇళ్లను బాగు చేసుకోవడానికి ఆసక్తి చూపించట్లేదు.

Latest Updates