నువ్వుల నూనె, వెల్లుల్లితో కరోనాకు చెక్ పెట్టొచ్చా?

చైనాలోని వుహాన్ సిటీలో పెట్టిన ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచాన్ని భయపెడుతోంది. ఇప్పటికే ఆ దేశంలో వేల మందికి వైరస్ సోకగా.. దాదాపు 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. చైనాతో పాటు మరో 18 దేశాల్లోకి ఈ వైరస్ వ్యాపించింది. భారత్ లోనూ కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గ్లోబల్ హెల్త్ ఎమర్సెన్సీ ప్రకటించింది.

కరోనా వైరస్ గురించి మీడియాలో నిత్యం వార్తలు వస్తుండడంతో ప్రజల్లో అవగాహన బాగా పెరుగుతోంది. అయితే వైరస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలన్న దానిపై రకరకాల ప్రచారాలు నడుస్తున్నాయి. లేనిపోని వదంతులు వ్యాపిస్తుండడంతో WHO స్పందించింది. జనాల్లో కన్ఫ్యూజన్ కు తావులేకుండా కొన్ని క్వశ్చన్, ఆన్సర్లతో ఆవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. అవేంటో చూద్దాం.

ప్రశ్న: వెల్లుల్లి తింటే కరోనాకు చెక్?

WHO సమాధానం: నో, వెల్లుల్లికి ఆ శక్తి ఉందని చెప్పే ఆధారాలేవీ లేవు. అయితే వెల్లుల్లి తినడం ఆరోగ్యానికి మంచిదే. దీనిలో ఉండే యాంటీమైక్రోబియల్ గుణం శరీరానికి మేలు చేస్తుంది. కానీ, కరోనాను ఎదుర్కొనే గుణం గానీ, తగ్గించే శక్తిగానీ దీనికి ఉన్నట్లు నిరూపించే ఆధారాలేవీ లేవు.

ప్రశ్న: నువ్వుల నూనె ఒంటికి రాసుకుంటే కరోనా రాదా?

WHO సమాధానం: నువ్వుల నూనె.. కరోనా వైరస్ ను శరీరంలోకి ప్రవేశించకుండా చేయలేదు. అయితే బ్లీచ్, క్లోరిన్ లాంటి కొన్ని రసాయానాలకు కరోనా వైరస్ ను చంపే శక్తి కొంత మేర ఉంది. అలాగే ఎథనాల్, పెరాసెటిక్ యాసిడ్స్, క్లోరోఫామ్ లాంటివి కూడా కరోనాను అడ్డుకోగలవు. కానీ, చాలా తక్కువ మోతాదులో మాత్రమే కరోనా వైరస్ పై వీటి ఎఫెక్ట్ ఉంటుంది. అయితే వీటిని శరీరానికి పూసుకోవడం చాలా డేంజర్. వీటిని ఎట్టిపరిస్థితుల్లోనూ వాడొద్దు.

ప్రశ్న:  కరోనాపై నిమోనియా వ్యాక్సిన్ పని చేస్తుందా?

WHO సమాధానం: నో, నిమోనియా వ్యాక్సిన్ తో కరోనాను నివారించలేము. కరోనా కొత్త వైరస్. దీనికి ప్రత్యేకమైన వ్యాక్సిన్ కనుక్కోవాల్సి ఉంది. ఇందుకోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ప్రశ్న: చైనా నుంచి వచ్చే పార్సిల్స్ తీసుకోవచ్చా?

WHO సమాధానం: నో ప్రాబ్లమ్, చైనా నుంచి వచ్చే పార్సిల్స్, ప్యాకేజీలు ఏ అనుమానం లేకుండా తీసుకోవచ్చు. ఎక్కువ సమయం వస్తువులపై కరోనా వైరస్ సజీవంగా ఉండలేదు. కాబట్టి చైనా నుంచి వచ్చే పార్సిల్స్ తాకడం ద్వారా కరోనా వచ్చే చాన్స్ లేదు.

కరోనా లక్షణాలు
జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, ఊపిరి ఆడకపోవడం, ఛాతీ నొప్పి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు

విదేశాల నుంచి వచ్చిన వారెవరైనా జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు ఉంటే వెంటనే నేరుగా డాక్టర్లను కలిసి విషయం చెప్పాలి.
ప్రతి ఒక్కరూ తరచుగా చేతులను సబ్బు, లేదా హ్యాండ్ వాష్ లిక్విడ్స్ తో శుభ్రం చేసుకోవాలి.
తుమ్ములు, దగ్గు వచ్చినప్పుడు చేతులు, లేదా కర్చీఫ్ అడ్డుపెట్టుకోవాలి. ఆ తర్వాత వెంటనే చేతులు కడుక్కోవాలి.
వీలైనంత వరకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం మంచిది.
ముక్కులు, నోరు దగ్గర చేతులు పెద్దగా పెట్టకపోవడం మేలు.
విదేశీ, దూర ప్రయాణాలు చేసేటప్పుడు పక్కన ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వారిని నేరుగా టచ్ చేయడం లాంటివి చేయకుండా వీలైనంత దూరంగా ఉండడం మేలు.

Latest Updates