ఆమ్రపాలి గ్రూప్ రిజిస్ట్రేషన్ రద్దు : సుప్రీం

cancellation-of-amrapali-group-registration-supreme

న్యూఢిల్లీ : ఆమ్రపాలి గ్రూప్‌‌కు చెందిన రిజిస్ట్రేషన్‌‌ను రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ కింద సుప్రీంకోర్టు రద్దు చేసింది. నోయిడా, గ్రేటర్ నోయిడా అథారిటీలు జారీ చేసిన ఆమ్రపాలి ప్రాపర్టీల లీజ్‌‌ను కూడా కోర్టు క్యాన్సిల్ చేసింది. గృహ కొనుగోలుదారులకు అనుకూలంగా ఆమ్రపాలి గ్రూప్‌‌కు చెందిన పెండింగ్ ప్రాజెక్ట్‌‌లను పూర్తి చేయడానికి నేషనల్ బిల్డింగ్స్ కన్‌‌స్ట్రక్షన్ కార్పొరేషన్‌‌(ఎన్‌‌బీసీసీ)ని జస్టిస్‌‌ అరుణ్ మిశ్రా, యూయూ లలిత్‌‌లతో కూడిన బెంచ్ నియమించింది. అదేవిధంగా ఆమ్రపాలి ప్రాపర్టీలపై హక్కులను కల్పిస్తూ… సీనియర్ అడ్వకేట్ ఆర్‌‌‌‌ వెంకటరమణిని కోర్ట్ రిసీవర్‌‌‌‌గా బెంచ్ అపాయింట్ చేసింది. అంటే బకాయిలను రికవరీ చేసేందుకు గ్రూప్ ప్రాపర్టీలను అమ్మేటప్పుడు వెంకటరమణి ట్రై పార్టీ అగ్రిమెంట్‌‌లోకి ఎంటర్‌‌‌‌ అయ్యేందుకు ఆయనకు అధికారాలు ఉంటాయి.

ఫెమా, ఎఫ్‌‌డీఐ నిబంధనలను కంపెనీ ప్రమోటర్లు అతిక్రమించారని, ఇళ్ల  కొనుగోలుదారుల నగదును  దారి మళ్లించారని బెంచ్ చెప్పింది. సరియైన సమయంలో ప్రాజెక్ట్‌‌లను డెలివరీ చేయని బిల్డర్లపై తగినచర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఆమ్రపాలి సీఎండీ అనిల్ శర్మ, ఇతర డైరెక్టర్లు, సీనియర్ అధికారులను మనీ లాండరింగ్ ఆరోపణలు కింద విచారణ జరుపమని ఈడీని సుప్రీంకోర్టు ఆదేశించింది. శర్మ, గ్రూప్ డైరెక్టర్ల వ్యక్తిగత ఆస్తులను అటాచ్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ రియల్ ఎస్టేట్ దిగ్గజానికి, ప్రమోటర్లకు వ్యతిరేకంగా ఈడీ మనీ లాండరింగ్ కేసు దాఖలు చేసింది.

Latest Updates