నోటిఫికేషన్​కు ముందే క్యాండిడేట్లను ఎట్ల ప్రకటిస్తరు

హైదరాబాద్‌‌, వెలుగు: మున్సిపల్‌‌ నోటిఫికేషన్‌‌కు ముందే, రిజర్వేషన్లు తెలియకుండానే టీఆర్‌‌ఎస్ క్యాండిడేట్ల లిస్ట్‌‌లను ఎలా ప్రకటిస్తారో కేటీఆర్‌‌ చెప్పాలని కాంగ్రెస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ పొన్నం ప్రభాకర్‌‌ డిమాండ్‌‌ చేశారు. గాంధీభవన్‌‌లో మంగళవారం మున్సిపల్‌‌ ఎన్నికల నోటిఫికేషన్‌‌, వార్డుల విభజనపై పొన్నం ప్రభాకర్‌‌, ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌‌ కుమార్‌‌, గాంధీభవన్‌‌ ఇన్‌‌చార్జీ కుమార్‌‌ రావు చర్చించారు. అనంతరం పొన్నం మీడియాతో మాట్లాడారు. చట్టాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం వార్డుల విభజన చేపట్టిందన్నారు. ఎలక్షన్స్‌‌కు తామెప్పుడూ భయపడమని, కోర్టులకు వెళ్లి ఎన్నికలను ఆపే దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ లేదన్నారు. కోర్టుకు మీరిచ్చిన హామీ ఏంటి, చేస్తున్నదేంటని ఎన్నికల కమిషన్‌‌ను ప్రశ్నించారు. వార్డుల విభజన, రిజర్వేషన్లు పూర్తయ్యాకే ఎన్నికల షెడ్యూల్ ఇవ్వాలని కోర్టు చెప్పిందని, దాన్ని పట్టించుకోకుండా ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌‌ ఇవ్వడమేంటని సంపత్‌‌ ప్రశ్నించారు.

టీఆర్‌‌ఎస్‌‌కు ఓట్లడిగే హక్కులేదు

టీఆర్‌‌ఎస్‌‌కు మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదని, మున్సిపల్ శాఖకు వేల కోట్లు కేటాయింపులు చేసి వందల కోట్లు కూడా రిలీజ్‌‌ చేయలేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌‌ విమర్శించారు. స్మార్ట్ సిటీలంటూ హడావుడి చేసిన బీజేపీ వరంగల్‌‌కు ఎన్నినిధులిచ్చిందో చెప్పాలన్నారు. ఏఐసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, కాంగ్రెస్‌‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నిరంజన్ పాల్గొన్నారు.

సంక్రాంతి తర్వాత పెట్టాలె

మున్సిపల్‌‌ ఎన్నికలను సంక్రాంతి తర్వాత పెట్టాలని, ఇష్టానుసారంగా షెడ్యూల్‌‌ ఇవ్వడమేంటని కాంగ్రెస్‌‌ నేతలు ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌‌ నాగిరెడ్డిని మాజీ మంత్రి మర్రి శశిధర్‌‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌‌, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌‌కుమార్‌‌ మంగళవారం కలిసి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం శశిధర్‌‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కోర్టు ఆదేశాల మేరకు వార్డుల డీలిమిటేషన్‌‌   చేపట్టిన ప్రభుత్వం ఆయా వార్డుల్లో ఓటర్ల సంఖ్య అందుబాటులో ఉన్నా కావాలనే ఆ వివరాలను ప్రకటించలేదన్నారు. ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని మండిపడ్డారు. నోటిఫికేషన్‌‌ జారీకి ఒక్కరోజు ముందు రిజర్వేషన్లను ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు.

Latest Updates