క్యాప్ జెమినీలో 8 వేల కొత్త జాబ్స్

బెంగళూరు:  కరోనా ఇబ్బందుల వల్ల చాలా ఐటీ కంపెనీలు నియామకాలను, జీతాల పెంపును, ప్రమోషన్లను నిలిపివేయగా క్యాప్‌‌జెమిని మాత్రం కొత్తగా మరో ఎనిమిది వేల మందికి జాబ్స్ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఈ ఫ్రెంచ్ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 2.70 లక్షల మంది ఉద్యోగులు ఉండగా, ఇండియాలో 1.25 లక్షల మంది ఉన్నారు. ఈ ఏడాది ఎనిమిది వేల మంది ఫ్రెషర్లకు, లేటరల్స్‌‌కు ఉద్యోగాలు ఇస్తామని కంపెనీ ఇండియా సీఈఓ అశ్విన్ యర్ది చెప్పారు. డిజిటల్, క్లౌడ్, డేటా ఎనలిటిక్స్ ప్రాజెక్టుల కోసం వీరిని ఉపయోగించుకుంటామని చెప్పారు. మొదటి క్వార్టర్లో ఆరు వేల మందికి, రెండో క్వార్టర్లో నాలుగు వేల మందికి ఆఫర్స్ ఇచ్చామన్నారు. ఈ కంపెనీ క్యాలెండర్ ఇయర్‌‌‌‌ను పాటిస్తుంది. ఈ ఏడాది కాలేజీ గ్రాడ్యుయేట్లకు ఇచ్చిన ఆఫర్లన్నింటినీ కొనసాగిస్తామని, అందరికీ జాబ్స్ ఇస్తామని కంపెనీ స్పష్టం చేసింది. ఇంజనీరింగ్ కాలేజీల్లో పరీక్షలు పూర్తయిన వెంటనే  లెటర్లు పంపిస్తామని అశ్విన్ వెల్లడించారు.

ప్రతి ఏడాది మాదిరే ఈసారి కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కంపెనీ నిర్ణయించింది. అయితే జూనియర్ లెవెల్ ఉద్యోగులు మాత్రమే వీటికి అర్హులు. కంపెనీలో 70 శాతం ఉద్యోగులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. సీనియర్ కన్సల్టంట్లు, మేనేజర్స్‌‌ స్థాయి వాళ్లకు జూలై నుంచి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఇస్తారు. ఇదిలా ఉంటే కరోనా వల్ల నష్టాలు వచ్చినందున ఈసారి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఇవ్వడం లేదని టీసీఎస్, విప్రో వంటి ఐటీ కంపెనీలు ఇది వరకే ప్రకటించాయి. ఉద్యోగులను మాత్రం తొలగించబోమని ఇన్ఫోసిస్, టీసీఎస్ హామీ ఇచ్చాయి. పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని విప్రో తెలిపింది.

.

Latest Updates