కారు డ్రైవర్లకు ఫుల్ డిమాండ్

డ్రైవర్లు దొరుకుతలేరు

ఓలా, ఊబర్ స్పెషల్ స్కీమ్‌తో ఓన్ వెహికల్స్ 

టెంపరరీ డ్రైవర్లకు డిమాండ్

పర్మనెంట్ డ్యూటీ చేసేందుకు అయిష్టత

హైదరాబాద్, వెలుగు: సిటీలో డ్రైవర్లు దొరుకుతలేరు. కార్పొరేట్ ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫోర్టు సంస్థలు ఓలా, ఊబర్‌లు రావడంతో చాలా మంది డ్రైవర్లు ఓనర్లుగా మారారు. దీంతో నగరంలో డ్రైవర్ల కొరత తీవ్రంగా ఏర్పడింది. ముఖ్యంగా వైట్ ప్లేట్ వాహనాలు నడిపేందుకు అసలు దొరకడం లేదు. ఈ క్రమంలో టెంపరరీ డ్రైవర్లకు పుల్ డిమాండ్ పెరిగింది. సిటీలో 8 గంటలకు సుమారు రూ.600 నుంచి వెయ్యి, సిటీ నుంచి ఇతర జిల్లాలకు వెళ్తే ఒక్క రోజుకి రూ.1,500 నుంచి 2 వేలు తీసుకుంటున్నారు. సమయం, సందర్భాన్ని బట్టి ఈ టెంపరరీ డ్రైవర్లకు డిమాండ్ పెరుగుతుంది. ఇక పర్మనెంట్ డ్యూటీ చేసేందుకు డ్రైవర్లు ఆసక్తి చూపడం లేదు. నెలకు రూ.15 నుంచి 20 వేలు ఇచ్చేందుకు ఓనర్లు సిద్ధంగా ఉన్నప్పటికీ డ్రైవర్లు ముందుకు రావడం లేదని నగరవాసులు చెబుతున్నారు.

డ్రైవర్లే.. ఓనర్లయ్యారు

ఓలా, ఊబర్ సంస్థలు రావడంతో చాలా మంది డ్రైవర్లు ఓనర్లుగా మారారు. కేవలం రూ.30వేలు పెట్టుబడితో వివిధ కార్ల సంస్థలతో నేరుగా ఓలా, ఊబర్స్ ఒప్పందాలు కుదుర్చుకొని డ్రైవర్లకు వాహనాలు ఇప్పించాయి. వాటి వ్యాపారంను విస్తరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయా సంస్థలు చెబుతున్నాయి. అతి తక్కువ డౌన్ పేమేంట్ ఉండటంతో ఎక్కువమంది డ్రైవర్లు వాహనాలు కొనుగోళ్లు చేశారు. ప్రతి నెలా మెయింటనెన్స్, ఫైనాన్స్, పెట్రోల్, ఇతర ఖర్చులు పోగ కనీసం రూ.30 వేల వరకు మిగులుతుండడంతో ఎక్కువ మంది క్యాబ్‌లను కొనుగోలు చేశారు. దీంతో సిటీలో డ్రైవర్ల కొరత ఏర్పడింది.

నెలకు రూ.30 వేలు మిగులుతున్నయ్

గతంలో ఓ బ్యాంక్ మేనేజర్ వాహనం నడిపేవాడిని. ప్రతిరోజూ 8 గంటలు డ్యూటీ చేస్తే నెలకు రూ.12 వేల వరకు జీతం వచ్చది. ఓ ఫ్రెండ్ సూచనతో ఓలా సంస్థ లీజు ప్రక్రియలో క్యాబ్ కొనుకున్నా. ప్రస్తుతం నెలకు అన్ని ఖర్చులు పోగా రూ.30 వేల వరకు మిగులుతున్నాయి. నేను నా కుటుంబంతో హ్యాపీగా ఉన్నా.  భరత్ క్యాతం, మౌలాలి

డ్రైవింగ్ నేర్చుకోవాలని ఫిక్స్ అయ్యా

సిటీలో డ్రైవర్లు దొరుకుతలేరు. గతంలో 8 గంటలకు రూ.500 తీసుకునే డ్రైవర్లు ప్రస్తుతం రూ.600 నుంచి 1000 రూపాయల వరకు తీసుకుంటున్నారు. అడిగినంత చెల్లించినా డ్రైవర్లు లభిచడం లేదు. నా దగ్గర కారు ఉంది. కానీ డ్రైవింగ్ రాదు. మరో నెల రోజుల్లో డ్రైవింగ్ నేర్చుకోవాలని ఫిక్స్ అయిన.  మంతెన రవీందర్

Latest Updates