పర్సనల్ లోన్ రావాలంటే..తీసుకోవాల్సిన జాగ్రత్తలు

బ్యాంకులు పర్సనల్‌‌ లోన్‌‌ అప్లికేషన్‌‌ను తిరస్కరిస్తే దరఖాస్తుదారుడి పరిస్థితి దయనీయంగా మారుతుంది. బయట అధిక వడ్డీలకు అప్పులు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి అవి కూడా దొరక్కపోవచ్చు. ఇలాంటి పరిస్థితిని నివారించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలని నిపుణులు చెబుతున్నారు.  పర్సనల్‌‌ లోన్‌‌ ఇచ్చే ముందు ఆర్థిక సంస్థలు దరఖాస్తుదారుడి అర్హతను అంచనా వేయడానికి చాలా విషయాలను పరిశీలిస్తాయి.

ఇందులో కొన్ని కీలకమైన అంశాలూ ఉంటాయి. దరఖాస్తుదారుడి గతంలో చెల్లింపుల అప్పుల వివరాలు, క్రెడిట్‌‌ హిస్టరీ, క్రెడిట్‌‌ యుటిలైజేషన్ రేషియో/క్రెడిట్‌‌కార్డ్‌‌ ఎంక్వైరీస్‌‌, నెలవారీ ఆదాయం, ఫిక్స్‌‌డ్‌‌ ఆబ్లిగేషన్స్ టు ఇన్‌‌కమ్‌‌ రేషియో (ఇది వరకే చెల్లిస్తున్న ఈఎంఐ వంటివి), ఎంప్లాయర్‌‌ వివరాలు, ఉద్యోగ భద్రత, సంస్థ ఉన్న ప్రాంతం వంటి వాటిని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుంటాయి. క్రెడిట్‌‌స్కోర్‌‌ 750 కంటే ఎక్కువ ఉంటేనే పర్సనల్‌‌ లోన్‌‌ మంజూరుకు అవకాశాలు ఉంటాయి. ఇది ఇంకా ఎక్కువ ఉంటే అప్పు పుట్టడం సులువు. రుణ అర్హతను పెంచుకోవడానికి, పర్సనల్‌‌ లోన్‌‌ అప్లికేషన్‌‌ను తిరస్కరించకుండా నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి.

చేయాల్సినవి…

మిగులు ఆదాయం ఎక్కువ ఉండేలా చూసుకోవాలి

మీ ఖాతాలో తగినంత నగదు నిల్వ లేకున్నా పర్సనల్‌‌ లోన్‌‌ అప్లికేషన్‌‌ను తోసిపుచ్చే అవకాశాలు ఉంటాయి. చాలా సంస్థలు దరఖాస్తుదారుడి నెలవారీ కనిష్ట నికర ఆదాయాన్ని పరిశీలించాకే అప్పు ఇవ్వడంపై నిర్ణయం తీసుకుంటారు. చాలా మంది బ్యాంకర్లు ఫిక్స్‌‌డ్‌‌ ఆబ్లిగేషన్స్ అటు ఇన్‌‌కమ్‌‌ రేషియో (ఎఫ్‌‌ఓఐఆర్‌‌) మొత్తాన్ని నెలవారీ కనిష్ట నికర ఆదాయం నుంచి మినహాయించి రుణ అర్హతను నిర్ధారిస్తారు. ఈ నిష్పత్తి 40–5-0 శాతం కంటే తక్కువ ఉండాలి. అంతేకాదు లోన్‌‌కు చెల్లించాల్సిన ఈఎంఐలను ఇప్పటికే ఉన్న ఈఐఎంలతో కలిపి చూశాక.. అప్పు ఎంత ఇవ్వాలో నిర్ధారిస్తారు. కాబట్టి మనకు ఎంత అప్పునకు అర్హత ఉందో అంతకు మాత్రమే దరఖాస్తు చేసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. తక్కువ ఈఐఎంలు ఉంటే ఎఫ్‌‌ఓఐఆర్‌‌ తగ్గుతుంది. ఫలితంగా అప్పు పొందే అర్హత వస్తుంది.

అప్పుల వాయిదాలు సక్రమంగా కట్టండి

క్రెడిట్‌‌కార్డుల బిల్లు, లోన్ల ఈఎంఐలను గడువులోపే కట్టేశాకే పర్సనల్‌‌ లోన్‌‌కు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుదారుడు అప్పులను సక్రమంగా చెల్లిస్తున్నదీ లేనిదీ బ్యాంకర్‌‌ తప్పక పరిశీలిస్తాడు. వాయిదాలను సమయానికి చెల్లించడం వల్ల క్రెడిట్‌‌స్కోర్‌‌ మెరుగుపడుతుంది.

క్రెడిట్‌‌ యుటిలైజేషన్‌‌ రేషియో 30 శాతం కంటే తక్కువ ఉండాలి

ఉదాహరణకు సురేశ్‌‌ క్రెడిట్‌‌కార్డు క్రెడిట్‌‌ లిమిట్‌‌ రూ.50 వేలు. నెలలో అతడు రూ.25 వేలకు దీని నుంచి వాడుకుంటే అతని క్రెడిట్‌‌ యుటిలైజేషన్‌‌ రేషియో 50 శాతం అన్నమాట. ఇది 30 శాతం కంటే తక్కువ ఉండాలి. ఇంతకంటే ఎక్కువ ఉంటే క్రెడిట్‌‌ స్కోర్‌‌ను తగ్గిస్తారు. దీనివల్ల పర్సనల్‌‌ లోన్‌‌ పొందే అవకాశాలు తగ్గుతాయి.

చేయకూడనివి…

లోన్‌‌ అప్లికేషన్‌‌లో తప్పులు

లోన్‌‌ దరఖాస్తులు పూర్తి సమాచారం ఇవ్వకపోయినా, తప్పులు ఉన్నా అప్పు ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరిస్తాయి. దరఖాస్తుదారుడు ఇచ్చిన సమాచారం సరైందే అని, ఉద్దేశపూర్వకంగా సమాచారాన్ని దాయడం లేదని నిర్ధారించుకోవడానికి థర్డ్‌‌పార్టీలతో విచారణ జరిపిస్తాయి. సిబిల్‌‌ స్కోర్‌‌ ఆధారంగా సూత్రప్రాయంగా లోన్‌‌ మంజూరు చేసినా, పత్రాలన్నింటినీ సమగ్రంగా పరిశీలించాకే తుది నిర్ణయం తీసుకుంటాయి.

ఎక్కువ సంఖ్యలో లోన్లు తీసుకోవడం

చాలా మంది ఒక బ్యాంకు నుంచి సరిపడినంత అప్పు రాకుంటే, వేరే బ్యాంకుల నుంచి ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తీసుకుంటారు. ఎక్కువ సంఖ్యలో తీసుకోవడం వల్ల దరఖాస్తుదారుడు అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా ఎక్కువ లోన్లు తీసుకున్న వారి క్రెడిట్‌‌స్కోరు తగ్గుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో అయితే సెక్యూర్డ్‌‌ లోన్లతోపాటు అన్‌‌సెక్యూర్డ్‌‌ లోన్లు రుణాలు తీసుకోవాలి. దీనివల్ల క్రెడిట్‌‌స్కోర్‌‌కు ఇబ్బంది ఉండదు.

బ్యాంకులకు వెళ్లి లోన్ల గురించి అడగడం

నేరుగా బ్యాంకులకు వెళ్లి పర్సనల్‌‌ లోన్ల గురించి వాకబు చేయడాన్ని క్రెడిట్‌‌ బ్యూరోలు ప్రతికూలంగా చూస్తాయి. బ్యాంకుల్లోకి వెళ్లి నేరుగా దరఖాస్తు చేస్తే క్రెడిట్‌‌స్కోర్‌‌ కొన్ని పాయింట్ల మేర తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బ్యాంకులకు వెళ్లే బదులు ఆన్‌‌లైన్ మార్కెట్‌‌ప్లేస్‌‌ (పాలసీబజార్‌‌, బ్యాంక్‌‌ బజార్‌‌, మైన్‌‌లోన్‌‌కేర్‌‌ వంటి వెబ్‌‌సైట్లు)లో ప్రయత్నించడం మేలని చెబుతున్నారు.

తరచూ ఉద్యోగాలు మారడం

స్థిరంగా ఉద్యోగంలో ఉండని వారికి లోన్లు ఇవ్వడానికి బ్యాంకులు ఇష్టపడవు. దరఖాస్తుదారుడు పర్సనల్‌ లోన్‌ కోరితే ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న సంస్థలో ఎంత కాలం నుంచి పనిచేస్తున్నాడనే విషయాన్ని కూడా పరిశీలిస్తాయి. అందుకే తరచూ ఉద్యోగాలు మారడాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవడం ఉత్తమం.

Latest Updates