చలి పెరుగుతుంది.. మరి ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే..

స్వెటర్లు, చెద్దర్లు తీయండి బయటకు

భారీగా పడిపోతున్న రాత్రి టెంపరేచర్లు

ప్రారంభంలోనే వణికిస్తున్న చలికాలం​

వైరల్​ఫీవర్లు విజృంభించే ప్రమాదం

హైదరాబాద్‌‌, వెలుగుచలికాలం ప్రారంభంలోనే జనం వణికిపోతున్నారు. రాష్ట్రంలో వారం రోజులుగా వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. రాత్రిపూట టెంపరేచర్లు భారీగా పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరుగుతోంది. చలి వల్ల రోగాలు విజృంభించే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

రాత్రి చలి.. మబ్బున మంచు

శుక్రవారం రాత్రి సిర్పూర్‌‌– కాగజ్‌‌నగర్‌‌లో 12.4, రంగారెడ్డిలో 12.5, ఆదిలాబాద్‌‌లో 12.5, వికారాబాద్‌‌లో12.6, కుమ్రంభీం జిల్లాలో 12.8 చొప్పున  టెంపరేచర్​ నమోదయ్యాయి. పగటివి మాత్రం సాధారణంగానే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉదయం 8, 9 గంటల వరకు మంచు దట్టంగా కమ్ముకుంటోంది. తెల్లవారు జామున తప్పనిసరి బయటకు వెళ్లాల్సి వచ్చే పాల వ్యాపారులు, కూరగాయల రైతులు, కార్మికులు, కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం 6 తర్వాత ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతుండటం, చలి గాలులు వీస్తుండటంతో జనం ఇండ్లకే పరిమితమవుతున్నారు. చ‌‌లి తీవ్రత మ‌‌రింత పెరిగే అవ‌‌కాశ‌‌ముందని వాతావ‌‌ర‌‌ణ శాఖ అధికారులు అంటున్నారు. ప్రారంభంలోనే ఈ స్థాయిలో ఉంటే.. ముందు ముందు ఎలా ఉంటుందోనని జనం భయపడుతున్నారు.

రోగాల దాడి.. జర పైలం

చలి తీవ్రత వల్ల రోగాలు వ్యాపించే చాన్స్​ ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. డెంగీ, స్వైన్‌‌ఫ్లూ, ఆయాసం, చర్మ సంబంధ వ్యాధులు, న్యుమోనియా వంటి రోగాల ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఆయాసం ఉన్నోళ్లు దుమ్ము, ధూళి పనులకు దూరంగా ఉండాలని, చల్లటి గాలికి ఎక్కువగా తిరగొద్దని సూచిస్తున్నారు.  ప్రయాణం చేస్తున్నప్పుడు నోరు, ముక్కు కవర్‌‌ అయ్యేలా మాస్కులు, స్వెట్టర్లు ధరించాలని చెబుతున్నారు. గుండె జబ్బు ఉన్న వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, చలిలో ఎక్కువగా తిరగడం వల్ల రక్తనాళాలు మూసుకుపోయి  సమస్యలు వస్తాయని, ఉదయం 8 గంటల కంటే ముందు, సాయంత్రం 6 గంటల తర్వాత దూర ప్రయాణాలను రద్దు చేసుకుంటే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.

జాగ్రత్తలు పాటించాలి

చలి పెరుగుతుండటంతో వైరస్‌‌  విజృంభించే ప్రమాదం ఉంది. వాతావరణంలో తేమ ఎక్కువ ఉంటే వైరస్‌‌ శక్తివంతమవుతుంంది. దీంతో డెంగీ, స్వైన్​ ఫ్లూ తీవ్రమవుతాయి. టైఫాయిడ్‌‌, వైరల్‌‌ ఫీవర్లు పెరుగుతాయి. దగ్గు, జలుబు, ఫీవర్​ ఉంటే డాక్టర్లను సంప్రదించి వారి సలహా మేరకు ట్రీట్​మెంట్​ తీసుకోవాలి. జాగ్రత్తలు పాటించాలి.

– డాక్టర్‌‌ రంజిత్‌‌కుమార్‌‌,

జనరల్‌‌ ఫిజీషియన్‌‌

Latest Updates