ప్రోటీన్లతో వెజిటేరియన్ ఎగ్స్…

carla-foods-making-vegetarian-eggs

కోడి ముందా? గుడ్డు ముందా? సమాధానం దొరకని మిస్టరీ ప్రశ్నల్లో ఇదీ ఒకటి. గుడ్డు శాకాహారమా? మాంసాహారమా? అంటే దీనికీ సరైన సమాధానం లేదు. కొందరు వెజ్ అంటారు, కొందరు నాన్ వెజ్ అంటారు. సరే ఇవన్నీ పక్కన పెడదాం. గుడ్లు చెట్లకు కాస్తే!! అంతలా ఆశ్చర్యపోకండి. నిజంగానే చెట్లకు గుడ్లు కాస్తున్నాయి. అయితే మీరునుకుంటున్నట్లు కాదు లేండి. గుమ్మడి, పెసలు తదితర విత్తనాల్లో ఉండే ప్రొటీన్లతో వెజిటేరియన్ ఎగ్స్ తయారవుతున్నాయి. అంటే చెట్ల నుంచి గుడ్లు వస్తున్నట్లే కదా! గుడ్డు మంచి ప్రోటీన్ ఉన్న ఆహారం. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీనిలో ఎవరికీ సందేహం లేదు. గుడ్లలో ఉండే ఎగ్ వైట్ (తెల్లసొన)లో ఆరోగ్యకరమైన ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయని న్యూట్రీషియన్లు చెబుతుంటారు. అయితే వెజిటేరియన్లు, వీగన్లు గుడ్లను తినరు. కొందరు శాకాహారులు మాత్రమే గుడ్డును వెజ్‌‌గా భావించి తింటారు. కోళ్ల ఫారాల వల్ల పర్యావరణం దెబ్బ తింటోందని సైంటిస్టులు ఆందోళన చెందుతున్నారు. సాల్మోనెల్లా అనే వ్యాధి కూడా ఎక్కువగా ప్రబలుతోందని చెబుతున్నారు. ఈ క్రమంలో ‘వెజిటేరియన్ ఎగ్స్’ అంశం తెరపైకి వచ్చింది. ఇండియాలో ఇంకా కనిపించని వెజ్ ఎగ్స్‌‌కు.. అమెరికా వంటి దేశాల్లో ఇప్పటికే మంచి మార్కెట్ ఉంది. వెజిటేరియన్ గుడ్లను ఫేక్ ఎగ్స్ అని, లిక్విడ్ ఎగ్స్ అని కూడా పిలుస్తున్నారు. అమెరికాలో ప్రస్తుతం బేక్డ్ ఫుడ్స్ తయారీలో ఎక్కువగా వాడుతున్నారు. అలాగే డ్రింక్స్ తయారీలోనూ వాడుతారట. త్వరలోనే ఇతర దేశాలకు విస్తరించాలని పలు కంపెనీలు ప్లాన్ చేస్తున్నాయి.

మూడు రకాల ఎగ్ ప్రొటీన్స్

‘క్లారా ఫుడ్స్’ అనే కంపెనీ ఇటీవల ‘ఇంగ్రీడియన్’ అనే సంస్థతో 20 మిలియన డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. అతి త్వరగా కరిగిపోయే ప్రొటీన్ ను మార్కెట్​లోకి తీసుకొస్తున్నట్లు క్లారా సీఈవో, కో  ఫౌండర్ ఆర్టురో ఎలిజోండో తెలిపారు. మూడు వేర్వేరు ఎగ్ ప్రొటీన్లను క్రియేట్ చేసినట్లు క్లారా ఫుడ్స్ తెలిపింది. వాటిలో ఒక రకాన్ని వచ్చే ఏడాది ప్రారంభంలో మార్కెట్​లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. డ్రింక్స్, ఫుడ్​లో ఉపయోగించేందుకు ఎలాంటి ఫ్లేవర్ లేని ఎగ్ ప్రోటీన్​ను ముందుగా మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. బేక్డ్ గూడ్స్ లో ఉపయోగించే మరో ఎగ్ ప్రోటీన్ ను కూడా సిద్ధం చేస్తోంది. ‘ఎగ్ బీటర్స్’ అనే కంపెనీకి వెజ్ ఎగ్స్ మార్కెట్​లో దూసుకుపోతోంది. లిక్విడ్ ఎగ్ బ్రాండ్​లో 27 శాతం మార్కెట్ వాటా సొంతం చేసుకుంది.

Latest Updates