కార్వీ.. లైసెన్సు రద్దు

హైదరాబాద్‌‌, వెలుగు: క్లయింట్ల షేర్లను కుదువ పెట్టి, ఆ డబ్బును సొంత అవసరాలకు వాడుకున్న కార్వీ స్టాక్‌‌ బ్రోకింగ్‌‌ లిమిటెడ్‌‌ (కేఎస్‌‌బీఎల్‌‌) ట్రేడింగ్‌‌ లైసెన్స్‌‌ను నేషనల్‌‌ స్టాక్‌‌ ఎక్స్చేంజ్‌‌ (ఎన్‌‌ఎస్‌‌ఈ), బాంబే స్టాక్‌‌ ఎక్స్చేంజ్‌‌ (బీఎస్‌‌ఈ)లు రద్దు చేశాయి. షేర్లు, డెట్‌‌, కమోడిటీస్‌‌ సహా అన్ని విభాగాలలోనూ ట్రేడింగ్‌‌ లైసెన్సును వెంటనే సస్పెండ్‌‌ చేస్తున్నట్లు ఎన్‌‌ఎస్‌‌ఈ ప్రకటించింది. రూల్స్‌‌కు విరుద్ధంగా క్లయింట్ల సొమ్మును సొంత అవసరాలకు వాడుకున్నట్లు తేలడంతో ఈ చర్యను తీసుకున్నారు.  కార్వీ స్టాక్‌‌ బ్రోకింగ్‌‌ లిమిటెడ్‌‌కు చెందిన ట్రేడింగ్‌‌ టెర్మినల్స్‌‌ అన్నింటినీ డీయాక్టివేట్‌‌ చేసినట్లు బీఎస్‌‌ఈ వెల్లడించింది. క్లయింట్లకు చెందిన రూ. 2,000 కోట్ల షేర్లను తనఖా పెట్టి, ఆ డబ్బును గ్రూప్‌‌ కంపెనీలకు మళ్లించిందనే ఆరోపణలను కార్వీ స్టాక్‌‌ బ్రోకింగ్‌‌ లిమిటెడ్‌‌ ఎదుర్కొంటోంది.

క్లయింట్ల ఖాతాల్లోకే షేర్లు: ఎన్‌‌ఎస్‌‌డీఎల్‌‌

కొన్న షేర్లకు పూర్తి మొత్తాన్ని చెల్లించిన కార్వీ కస్టమర్ల అకౌంట్లలోకే వారి షేర్లను బదిలీ చేసినట్లు సోమవారం ఎన్‌‌ఎస్‌‌డీఎల్‌‌ ప్రకటించింది. కష్టాలెదుర్కొంటున్న  కార్వీ కస్టమర్లకు ఇది కొంత ఉపశమనం కలిగించే విషయమే. మొత్తం 83,806 మంది క్లయింట్లకు చెందిన రూ. 2,013.77 కోట్ల విలువైన షేర్లను క్లయింట్ల అకౌంట్లకే షేర్లను బదిలీ చేసినట్లు స్పష్టం చేసింది.

ఇరుక్కుపోయిన బ్యాంకులు

కార్వీబ్రోకింగ్​ తాకట్టు పెట్టిన క్లయింట్ల షేర్లను ఎన్​ఎస్​డీఎల్​ మళ్లీ క్లయింట్ల ఖాతాల్లోకే బదిలీ చేయడంతో ఇప్పుడు బ్యాంకులు ఇరుక్కుపోయాయి. ఈ షేర్ల మీద దాదాపు రూ.రెండు వేల కోట్లు కార్వీ అప్పులుగా బ్యాంకుల నుంచి తీసుకుంది.

ఇప్పుడు క్లయింట్లు ఏం చేయాలి…..

గతంలోని సెబీ ఆంక్షలకు తోడు ఇప్పుడు ఎక్స్చేంజ్‌‌లు ట్రేడింగ్‌‌ లైసెన్సును సస్పెండ్‌‌ చేయడంతో కార్వీ స్టాక్‌‌ బ్రోకింగ్‌‌ లిమిటెడ్‌‌ క్లయింట్లు ట్రేడింగ్‌‌ చేసుకోలేక ఇబ్బందులపాలవుతున్నారు.  వేరే కొత్త స్టాక్ బ్రోకర్‌‌ను ఎంపిక చేసుకుని, అకౌంట్‌‌ ఓపెన్‌‌ చేయడం తప్ప వారికి ఇంకో ప్రత్యామ్నాయం లేదు. లక్షలాది మంది కస్టమర్లున్న కార్వీ స్టాక్‌‌ బ్రోకింగ్‌‌ లిమిటెడ్‌‌ అక్రమాలకు పాల్పడటంతో మొత్తం బ్రోకింగ్‌‌ కంపెనీలపైనే క్లయింట్లకు నమ్మకం పోయే పరిస్థితి దాపురించిందని కోటక్‌‌ సెక్యూరిటీస్‌‌ మేనేజింగ్‌‌ డైరెక్టర్‌‌ జైదీప్‌‌ హంస్‌‌రాజ్‌‌ వ్యాఖ్యానించారు. ఇంటికి లేదా ఆఫీసుకు పక్కనే ఉందనో, ఫ్రెండ్స్‌‌ చెప్పారనో, వెబ్‌‌సైట్‌‌ చాలా బాగుందనో ఏ బ్రోకింగ్‌‌ కంపెనీ వద్దా అకౌంట్లు ఓపెన్‌‌ చేయొద్దని, ఆ కంపెనీ విశ్వసనీయమైనదా, కాదా అనేది చూసుకున్నాకే అకౌంట్‌‌ ఓపెన్‌‌ చేయడం మేలని ఆయన సూచిస్తున్నారు.

కార్వీ తరహాలోనే మరిన్ని బ్రోకింగ్‌‌ కంపెనీలు వ్యవహరించి ఉండొచ్చని చాలా మంది క్లయింట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే సంస్థల పని పట్టే కార్యక్రమంలో సెబీ బిజీగా ఉందని చెబుతూ, బహుశా చాలా చిన్న చిన్న బ్రోకింగ్‌‌ సంస్థలూ కార్వీ లాంటి అక్రమాలకు పాల్పడి ఉండొచ్చని, అదే జరిగితే చాలా మంది క్లయింట్లు ఇబ్బందుల పాలవుతారని ఢిల్లీ ఇన్వెస్టర్‌‌ అసోసియేషన్‌‌ కన్వీనర్‌‌ ఘనిష్ట్‌‌ నాగ్‌‌పాల్ చెప్పారు.  మార్జిన్‌‌ ఫండింగ్‌‌ మార్జిన్స్‌‌ పెంచుకోవడానికి గతంలో చాలా బ్రోకింగ్‌‌ కంపెనీలు క్లయింట్ల్‌‌ షేర్లను వాడుకునేవని చెబుతున్నారు. నిబంధనలు కఠినమవుతున్న నేపథ్యంలో బ్రోకింగ్‌‌ కంపెనీల నిర్వహణా వ్యయం పెరుగుతుందని, ఫలితంగా బ్రోకర్ల నెట్‌‌వర్త్‌‌నూ పెంచే అవకాశముందని ఆన్‌‌లైన్ స్టాక్‌‌బ్రోకింగ్‌‌ ప్లాట్‌‌ఫామ్‌‌ జెరోధా ఫౌండర్‌‌ నితిన్ కామత్‌‌ తెలిపారు. చిన్న స్థాయిలో నడిపే బ్రోకింగ్‌‌ వ్యాపారాలు నడపడం కష్టమని చాలా మంది ఇప్పటికే గుర్తించారని అన్నారు.

పవర్‌‌ ఆఫ్ అటార్నీ యూజ్‌‌ చేయడం కుదరదు: సెబీ

క్లయింట్లు ఇచ్చిన పవర్‌‌ ఆఫ్‌‌ అటార్నీ (పీఓఏ)లను వినియోగించడం కుదరదని కార్వీ స్టాక్‌‌ బ్రోకింగ్‌‌ లిమిటెడ్‌‌కు సెబీ స్పష్టం చేసింది. 95 వేల మంది క్లయింట్లకు చెందిన రూ. 2,300 కోట్ల విలువైన షేర్లను తనఖా పెట్టి అక్రమాలకు కార్వీ బ్రోకింగ్‌‌ పాల్పడిందని సెబీ పేర్కొంది. తన పేరుతో ఉన్న ఒక డీమాట్‌‌ అకౌంట్‌‌కు క్లయింట్ల షేర్లను బదిలీ చేసుకుని, నిబంధనలను ఉల్లంఘించిందని తెలిపింది.

మరి బ్యాంకుల పరిస్థితేంటి… ?

క్లయింట్ల షేర్లను ఎన్‌‌ఎస్‌‌డీఎల్‌‌ వారి అకౌంట్లకే బదిలీ చేయడంతో ఆ షేర్లను తనఖా పెట్టుకుని అప్పులిచ్చిన బ్యాంకుల పరిస్థితేమిటో అర్ధం కావడం లేదు. ఎన్‌‌ఎస్‌‌డీఎల్‌‌ తాజా నిర్ణయంతో కార్వీ స్టాక్‌‌ బ్రోకింగ్‌‌ లిమిటెడ్‌‌కు
అప్పులు ఇచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు చిక్కులు ఎదుర్కోక తప్పదని నిపుణులు చెబుతున్నారు. ఈ పర్యవసానం ఎక్కడికి
దారి తీస్తుందనేది ఇప్పుడే చెప్పలేమని వ్యాఖ్యానిస్తున్నారు.

Latest Updates