కరోనా మృతుడి అంత్యక్రియలు అడ్డుకున్న 60 మందిపై కేసు

  •  పంజాబ్‌లోని జలంధర్‌‌లో ఘటన

చండీగఢ్‌: జాగ్రత్తలు తీసుకుంటే కరోనా సోకదని, చనిపోయిన వారి అంత్యక్రియలు చేసే సమయంలో జాగ్రత్తలు పాటిస్తే కరోనా రాదని అధికారులు ఎంత అవగాహన కల్పిస్తున్నా మనుషులు తీరు మారడం లేదు. పంజాబ్‌లోని జలంధర్‌‌లో కొందరు మానవత్వం మరిచిపోయి వ్యవహరించారు. కరోనాతో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలను అడ్డుకున్నారు. తమకు కూడా కరోనా సోకుతుందనే అనుమానంతో దహన సంస్కారాలు చేసేందుకు నిరాకరించారు. దీంతో 60 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. జలంధర్‌‌కు చెందిన ఒక వ్యక్తికి కరోనా సోకడంతో హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూ గురువారం చనిపోయాడు. కాగా.. అంత్యక్రియలు నిర్వహించేందుకు తీసుకెళ్తుండగా కొంత మంది అడ్డుకున్నారు. దాదాపు రెండు గంటల పాటు శవాన్ని కదలనివ్వకుండా గొడవ చేశారు. ఆ తర్వాత అధికారులు నచ్చచెప్పడంతో వెళ్లిపోయారు. పంజాబ్‌లో గతంలో ఇలాంటి ఘటనలు జరగడంతో అవగాహన కల్పించేందుకు ఇద్దరు మంత్రులు కరోనాతో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొని ఫేస్‌బుక్‌లో వీడియో కూడా పోస్ట్‌ చేశారు. కరోనాతో చనిపోయిన వ్యక్తుల మృతదేహాలను తీసుకునేందుకు వారి కుటుంబసభ్యులు కూడా ముందుకు రావడం లేదని అధికారులు చెప్పారు. లుథియానాలో పోయిన వారం ఒక వృద్ధురాలు కరోనాతో చనిపోగా.. ఆమె కుటుంబసభ్యులు కనీసం దహన సంస్కారాలు చేసేందుకు ముందుకు రాలేదని అన్నారు. అమృత్‌సర్‌‌లో ఇలాంటి ఘటనే జరిగింది. అంతే కాకుండా చాలా చోట్ల డాక్టర్లను, నర్సులను కూడా ఇళ్లు ఖాళీ చేయించిన ఘటనలు జరిగాయి.

Latest Updates