డీఎస్పీపై కేసు నమోదు.. ఫారెన్ నుంచి వచ్చిన కొడుకు విషయం దాచినందుకే..

రంగంలోకి ఐబీ

హైదరాబాద్‌, వెలుగు: ఫారిన్​ నుంచి వచ్చిన వాళ్ల వివరాల సేకరణకు సెంట్రల్‌, స్టేట్‌ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు రంగంలోకి దిగాయి. మార్చి 1 తర్వాత రాష్ట్రానికి వచ్చిన 18 వేల మంది వివరాలను ఐబీ సేకరించింది. ఇందులో 12,486 మంది క్వారంటైన్‌ పీరియడ్‌(14 రోజులు)లో ఉన్నట్టు ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. వీరు కాకుండా ఇంకెవరైనా కరోనా అనుమానితులు ఉన్నారా అన్నదానిపై అధికారులు జల్లెడ పడుతున్నారు. ఇక క్వారంటైన్‌లో ఉన్నవాళ్లలో చాలా మంది బయట తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాళ్లు ఇంట్లో ఉంటున్నదీ, లేనిదీ తెలుసుకునేందుకు ఆరోగ్య శాఖ ‘కరోనా సర్వైలెన్స్ యాప్’ను తయారు చేయించింది. ఐబీ, పోలీస్‌, హెల్త్ ఆఫీసర్లకు యాప్‌ యాక్సెస్ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ఏఎన్‌ఎంలకు ఇప్పటికే ప్రభుత్వం ట్యాబ్​ లు ఇచ్చింది. ఈ ట్యాబ్‌ల్లో యాప్‌ను ఇన్‌స్టాల్ చేస్తున్నారు. క్వారంటైన్‌లో ఉన్నవారి ఇంటి లొకేషన్లను, ఫొటోలను యాప్‌లో అప్‌డేట్‌ చేయాలని ఏఎన్‌ఎంలకు సూచించారు. క్వారంటైన్ లో ఉన్న వ్యక్తుల ఇంటికి ప్రతి రోజూ రెండుసార్లు వెళ్లి, వారు ఇంట్లో ఉన్నదీ లేనిది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వారి ఆరోగ్య వివరాలు కూడా అందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం యాప్‌లోనే ఒక చెక్‌ లిస్ట్‌ను సిద్ధం చేశారు. ఈ యాప్ పనితీరును వివరిస్తూ ఆరోగ్యశాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు సమాచారం పంపించింది.

సెక్రటేరియట్‌లో సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్‌

కరోనా నియంత్రణకు కోఠిలోని ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్‌‌ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ రోజూ ఇక్కడకు వచ్చి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రాష్ట్రంలో రోజురోజుకూ కేసులు పెరుగుతుండడంతో, ప్రభుత్వ యంత్రాగమంతా కరోనా కట్టడి కోసమే పని చేస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ శాఖల మధ్య కో ఆర్డినేషన్​ కోసం సెక్రటేరియట్‌లో సెంట్రల్ కమాండ్ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని జనరల్ అడ్మినిస్ర్టేషన్‌ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఇక్కడి నుంచే కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా వైద్యాధికారులు, ఇతర శాఖల జిల్లా అధికారులకు సూచనలు చేయనున్నారు. ఈ సెంటర్‌‌లో పనిచేసేందుకు ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను డిప్యూట్ చేశారు. వివిధ శాఖల అధికారులు ఈ సెంటర్‌‌లో పనిచేయనున్నారు.

డీఎస్పీపై కేసు నమోదు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పనిచేస్తున్న ఓ డీఎస్పీపై ఆరోగ్యశాఖ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. క్వారంటైన్‌లో ఉండాల్సిన కొడుకు(కరోనా పాజిటివ్‌ వచ్చింది)ను తీసుకుని ఫంక్షన్లకు తిరిగినందుకు డీఎస్పీపై ఎపిడమిక్ యాక్ట్‌ కింద కేసు నమోదుకు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌‌ ఆదేశాలు జారీ చేశారు. డీఎస్పీపై కేసు బుక్ చేస్తున్నట్టు మంత్రి ఈటల రాజేందర్‌‌ సైతం వెల్లడించారు. క్వారంటైన్‌లో ఉండకుండా బయట తిరిగే వాళ్లపై కేసులు తప్పవని ఆయన హెచ్చరించారు.

For More News..

లాక్‌డౌన్‌తో జోరుగా కూరగాయల దందా

కాలిఫోర్నియా బీచుల్లో జనం జల్సాలు

Latest Updates