ధారావిలో తగ్గుతున్న కేసులు

  • ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న మున్సిపల్‌ సిబ్బంది

ముంబై: ఆసియాలోనే అతిపెద్ద మురికివాడల్లో ఒకటైన ముంబైలోని ధారావిలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇరుకు సందులు, ఒకే ఇంట్లో 10 మంది ఉండటం, జనాభా ఎక్కువ ఉన్న ధారావిలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదవటంతో అధికారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సోషల్‌ డిస్టెంసింగ్‌ పాటించేందుకు వీలు కాని ఇలాంటి స్థలాల్లో కరోనా కట్టడి చేయడం పెద్ద సవాలే అని అనుకున్నారు. కానీ అంత పెద్ద మురికి వాడలో కేసులు తగ్గుముఖం పట్టాయి. గురువారం 25 కేసులు నమోదు కాగా.. శుక్రవారం కేవలం 5 కేసులు మాత్రమే నమోదయ్యాయి. పదిలక్షలకు పైగా ఉండే ఈ ప్రాంతంలో మొత్తం 220 కేసులు నమోదు కాగా.. 14 మంది చనిపోయారు. బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) ధారావిలో ప్రత్యేక చర్యలు తీసుకోవడమే దీనికి కారణం. కంటైన్‌మెంట్‌ జోన్లను ఏర్పాటు చేసిన అధికారులు జనం ఎవ్వరూ బయటకు రాకుండా చూసుకున్నారు. నిత్యావసరాలు, మెడిసిన్‌ అన్నీ డోర్‌‌ డెలివరి ఇచ్చి ఎవ్వరూ బయటకు రాకుండా జాగ్రత్తలు చేపట్టారు. డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేసి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వ్యాధి లక్షణాలు ఉన్న, వ్యాధి సోకిన వారితో కాంటాక్ట్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి స్క్రీనింగ్ చేసి, ప్రత్యేక ఐసోలేషన్‌ను ఏర్పాటు చేశామని అధికారులు చెప్పారు. ధారావిలో మొదటి కరోనా మరణం నమోదు కాగానే మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టడంతోనే కొంతమేర కేసులు తగ్గాయని అధికారులు చెప్పారు. కరోనా కేసులు పూర్తిగా తగ్గే వరకు ఈ కట్టుదిట్టమైన చర్యలు కొనసాగుతాయని అన్నారు.

Latest Updates