కులాల వారీగా జనాభా లెక్కింపు.. లేదంటే బాయ్​కాట్​ చేస్తం

జనాభా లెక్కింపులో కులాల వారీ లెక్కలు చేర్చకపోతే ఆ కార్యక్రమాన్ని బహిష్కరిస్తామని బీసీ సంఘాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించాయి. గురువారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని బీసీ భవన్‌‌‌‌‌‌‌‌లో వివిధ బీసీ సంఘాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌‌‌‌‌‌‌‌. కృష్ణయ్య మాట్లాడారు. జనాభా లెక్కింపులో 31 కాలమ్స్‌‌‌‌‌‌‌‌లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలు తదితర వివరాలు సేకరిస్తున్నారని, కానీ కులాల వారీ లెక్కలు సేకరించడానికి కేంద్రం ముందుకు రావడం లేదని మండిపడ్డారు. 2010లో కేంద్రం కులాల వారీ లెక్కలు ఇవ్వడానికి అంగీకరించిందని, కానీ సాధారణ జనాభా లెక్కింపులో కాకుండా ప్రత్యేకంగా లెక్కలు తీశారని గుర్తు చేశారు. అవి అశాస్త్రీయంగా ఉండటంతో పక్కకు పడేశారన్నారు. కనీసం ఇప్పుడైనా కులాల వారీ లెక్కలు తీస్తే ప్రభుత్వానికి అదనంగా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, శాస్త్రీయంగా చట్టబద్ధంగా పక్కా లెక్కలు వస్తాయని వివరించారు. స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ల స్థానాల కేటాయింపుపై మొదటి నుంచి న్యాయ వివాదాలు కొనసాగుతున్నాయని చెప్పారు. బీసీల అభివృద్ధి, ఆర్థిక పథకాల కోసం కులాల లెక్కలు అవసరమని, ఆ లెక్కలు తీయకుండా కేంద్రం అన్యాయం చేస్తోందని ఆరోపించారు.

Latest Updates