సెమీ ఫైనల్‌లో ఓటమి: మహిళా హాకీ ప్లేయర్‌‌ని కులంతో దూషించిన ఇద్దరు వ్యక్తులు

సెమీ ఫైనల్‌లో ఓటమి: మహిళా హాకీ ప్లేయర్‌‌ని కులంతో దూషించిన ఇద్దరు వ్యక్తులు

డెహ్రాడూన్: ఒలింపిక్స్‌ చరిత్రలోనే తొలిసారి సెమీ ఫైనల్​లోకి ఎంట్రీ ఇచ్చిన భారత మహిళా హాకీ టీమ్‌ను అందరూ ఘనంగా నెత్తిన పెట్టుకుంటే.. కొందరు కుల అహంకారంతో దూషించిన ఘటన ఉత్తరాఖండ్‌లో జరిగింది. టీమ్‌లో ఎక్కువ మంది దళితులే ఉండడం వల్ల గెలవలేకపోయారంటూ ఓ ప్లేయర్ ఇంటి ఎదుట గొడవ చేశారు. దీంతో ఈ పని చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ఇద్దరిలో ఒకరిని అరెస్టు చేశారు. రెండో వ్యక్తి పరారీలో ఉండడంతో అతడిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు.

మహిళా హాకీ టీమ్ ప్లేయర్ వందనా కటారియా స్వస్థలం ఉత్తరాఖండ్‌లోని రోష్నాబాద్‌. బుధవారం టోక్యో ఒలింపిక్స్‌లో అర్జెంటీనాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా మహిళా హాకీ టీమ్ పోరాడి ఓడింది. ఈ మ్యాచ్ చూసిన తర్వాత బుధవారం సాయంత్రం రోష్నాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు.. వందన ఇంటి ముందుకు వెళ్లి ఎగతాళి చేస్తూ చిందులు వేశారు. పటాకులు కాలుస్తూ కులం పేరుతో దూషించారు. టీమ్‌లో దళిత ప్లేయర్లు ఎక్కువ మంది ఉన్నారని, అందుకే ఓటమిపాలయ్యారని అంటూ కామెంట్లు చేశారు. ఆ గోల విని వందన కుటుంబసభ్యులు బయటకు రాగా, వాళ్లను కూడా నోటి కొచ్చినట్లు కులం పేరు వాడుతూ తిట్టారు. దీంతో అక్కడ వాళ్ల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చామని వందన సోదరుడు చెప్పాడు. గొడవ చేసిన ఇద్దరిపై వేర్వేరు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విజయ్ పాల్ అనే ఒకడిని గురువారం అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. రెండోవాడి కోసం గాలిస్తున్నామన్నారు.