పశు సంపద ఉన్న ఏ రైతూ ఆత్మహత్య చేసుకోలేదు

జనాభా పెరిగే కొద్దీ దేశంలో అవసరాలు పెరిగిపోతున్నాయనీ, ఆహారశైలిలో వస్తున్న మార్పులు ప్రజారోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ యూనివర్శిటీ 8వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అథితిగా పాల్గొన్నారు. విద్యార్థులకు పట్టాలు అందజేశారు. మీరు ఎంచుకున్న రంగం విభిన్నమైనది, మరింత కీలకమైనది. పశువుల ఆరోగ్యం మానవ జీవనాన్ని ప్రభావితం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఈ రంగంలో మరింత పరిశోధన జరగాల్సిన అవసరం ఉందన్నారు ఉపరాష్ట్రపతి.

కొత్తగా తీసుకొచ్చే సంస్కరణలు.. భవిష్యత్తు సమస్యలకు సమాధానాలవుతాయని అన్నారు వెంకయ్య నాయుడు. పశుసంపద ఉన్న ఏ రైతూ ఆత్మహత్య చేసుకోలేదని సర్వేలు తేల్చాయని చెప్పారు. వ్యవసాయం లాభసాటిగా మారేలా శాస్త్రవేత్తలు కృషి చేయాలన్నారు. ‘ ఒకప్పుడు పశు సంపద ఉంటేనే ఇళ్లు కళకళలాడేది. పంట నష్టం వచ్చినా.. పశుసంపద ఆసరాగా నిలిచేది. విష్ణు అవతారాలు, దేవుళ్ల వాహనాలు అన్నీ పశుపక్ష్యాదులే. మన సంస్కృతిలోనే వేల ఏళ్లుగా పశుసంపద భాగంగా ఉంది’ అని వెంకయ్యనాయుడు అన్నారు. పశువైద్య విద్యలో కీలక సంస్కరణలు ప్రవేశపెట్టడం ద్వారా ఉత్నతస్థాయి ప్రమాణాలు అందిపుచ్చుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థి ఐదు విషయాలు గుర్తుంచుకోవాలన్న ఉపరాష్ట్రపతి.. జన్మనిచ్చిన తల్లిదండ్రులను, పుట్టిన ఊరును, మాతృభాషను, మాతృదేశాన్ని,  విద్య నేర్పిన గురువును ఎప్పటికీ మర్చిపోవద్దని విద్యార్థులకు సూచించారు.

Latest Updates