వీడియో: కారు బానెట్‌‌పై పోలీస్.. ఆపకుండా పోనిచ్చిన డ్రైవర్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ ట్రాఫిక్‌ పోలీసు ప్రాణాలకు ముప్పు కలిగించేలా ఒక కారు డ్రైవర్ ప్రవర్తించాడు. ఢిల్లీలోని కాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. సౌత్‌ వెస్ట్‌ ఢిల్లీ, కాంట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి, దౌలా కౌన్‌లోని ఓ రోడ్డుపై ట్రాఫిక్‌ రూల్స్ పాటించని ఒక కారును ఆపేందుకు మహిపాల్ సింగ్ అనే ట్రాఫిక్‌ కానిస్టేబుల్ యత్నించాడు. అయితే డ్రైవర్ కారును ఆపకపోగా.. వెహికిల్‌‌ను ఏకంగా‌ ట్రాఫిక్‌ పోలీస్‌ మహిపాల్‌‌ మీదకు పోనిచ్చాడు. దీంతో ట్రాఫిక్ పోలీసు కారు బానెట్‌పై పడిపోయాడు.

మహిపాల్ సింగ్ బానెట్‌పై వేలాడుతూ.. కారును ఆపమంటూ అరవసాగాడు. అయినప్పటికి డ్రైవర్‌ కారును ఆపకుండా రద్దీ రోడ్డుపై అలాగే పోనిచ్చాడు. దాదాపు 400 మీటర్ల దూరం వరకు కారు అలాగే వెళ్లింది. ఆ తర్వాత సదరు పోలీసు కారుపై నుంచి రోడ్డుపై పడిపోగా.. డ్రైవర్‌ కారు వేగాన్ని పెంచి అక్కడినుంచి ఎస్కేప్ అయ్యాడు. అయితే కారు డ్రైవర్‌‌ను పోలీసులు ఛేజ్ చేసి పట్టుకున్నారు. నిందితుడిని సౌత్ ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌‌‌కు చెందిన శుభమ్‌‌గా పోలీసులు గుర్తించారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Latest Updates