‘స్మార్ట్ విలేజ్’ కోసం రాజకీయాల్లోకి వస్తా.. లక్ష్మీనారాయణ

తిరుపతి : నిర్దిష్టమైన విధివిధానాలు రూపొందించి తప్పకుండా రాజకీయాలలోకి వస్తానని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ తిరుపతిలో చెప్పారు. తన ఆలోచనలతో ఏకీభవించే వాళ్ళతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం.. జీరో బడ్జెట్ రాజకీయాలు మాత్రమే చేస్తానని చెప్పి ఆసక్తి రేపారు లక్ష్మీనారాయణ.

ఆంధ్రప్రదేశ్ లోని  13 జిల్లాలలో వివిధ ప్రాంతాలలో అవగాహన సదస్సులు నిర్వహించి.. అన్ని వర్గాల ప్రజలను కలిశానని చెప్పారు లక్ష్మీనారాయణ. గ్రామీణ, రైతాంగ అభివృద్ది కోసమే పోలీసు ఉద్యోగాన్ని పక్కన పెట్టానన్నారు.

గ్రామీణ ప్రాంతాలను మెరుగుపరిస్తేనే భారత దేశం డెవలప్ అవుతుందని అన్నారు లక్ష్మినారాయణ. స్మార్ట్ సిటీస్ గురించి మాట్లాడే ప్రభుత్వాలు…. స్మార్ట్ విలేజ్ గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఆదివారం అక్టోబర్ 7నాడు అనంతపురంలో జరిగే సమావేశంలో..  వ్యవసాయ పాలసీ రూపొందిస్తామన్నారు. చేనేత, మత్స్యకారులకు ప్రత్యేక పాలసీ తయారు చేయాల్సిన ఆవసరం ఉందన్నారు. ఈరోజుల్లో సంపాదనంతా విద్య, వైద్యం కోసమే ఖర్చవుతోందని ఆవేదనగా చెప్పారు.

“పీపుల్స్ మ్యానిఫెస్టో తయారు చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలే మొబైల్ ద్వారా తమ సమస్యలపై మేనిఫెస్టో రూపొందించుకునే విధంగా మొబైల్ యాప్ ను ప్రారంభిస్తున్నాం. గ్రామీణ వలసలు నివారించకపోతే ఎన్ని స్మార్ట్ సిటీలను రూపొందించినా ఉపయోగం లేదు. ప్రభుత్వమే ఓ ఎన్జీవోగా పనిచేయాలి. రుణమాఫీ, సబ్సిడీలు వద్దు…. స్వామినాథన్ కమిషన్ విధానాలు అమలు చేస్తే చాలని రైతులు కోరుతున్నారు. ఈ లక్ష్యాల సాధన కోసం తప్పకుండా రాజకీయాల్లోకి వస్తా” అన్నారు లక్ష్మీనారాయణ.

 

Posted in Uncategorized

Latest Updates