సీసీ ఫుటేజ్‌‌తో ఈవ్ టీజర్​ను పట్టించాడు

ఈ నెల 12న ఎల్ బీనగర్ లో యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయి

రాచకొండ సీపీకి సమాచారం ఇచ్చిన కాలనీ యువకుడు

నిందితుడిని అరెస్ట్ చేసిన ఎస్వోటీ పోలీసులు

హైదరాబాద్,వెలుగు: యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఆకతాయి ఆటకట్టించారు ఎల్బీనగర్ ఎస్.ఓ.టీ పోలీసులు. ఒంటరిగా వెళ్తు్న్న యువతిని బైక్ పై వెంబడించిన పోకిరీని..ఓ యువకుడి ఇంటి ముందున్న సీసీ కెమెరా ఫుటేజ్ సాయంతో గుర్తించి అరెస్ట్ చేశారు. సామాజిక బాధ్యతతో వ్యవహరించి ఈవ్ టీజర్ ను పట్టుకోవడంలో సహకరించిన ఆ యువకుడిని రాచకొండ సీపీ మహేశ్​భగవత్ అభినందించి..నగదు బహుమతి అందజేశారు. ఈ  కేసు వివరాలను ఆయన శుక్రవారం వెల్లడించారు.

బైక్ పై వచ్చి.. ఈవ్ టీజింగ్

ఈ నెల 12న ఎల్బీనగర్ లోని ఎస్బీఐ కాలనీలో ఉదయం10.30 గంటల ప్రాంతంలో 19 ఏళ్ళ ఓ బ్యూటీషియన్  నడుచుకుంటూ వెళ్తోంది. ఒంటరిగా వెళ్తున్న ఆ యువతి పట్ల వెనుక నుంచి బైక్ పై వచ్చిన ఓ గుర్తుతెలియని పోకిరీ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను తాకుతూ బైక్ పై ఎస్కేప్ అయ్యాడు.  దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన ఆ యువతికి ఏంచేయాలో అర్ధం కాలేదు. కాలనీవాసులకు విషయం చెప్పే ప్రయత్నం చేసింది. కానీ అప్పటికే తన ఇంటి బయట నిల్చుని ఉన్న దండి రవి అనే కాలనీ యువకుడు పోకిరీ చేష్టలను గమనించాడు. రవి అతడిని పట్టుకుందామనుకునే లోపే ఆకతాయి పారిపోయాడు. దీంతో రవి వెంటనే డయల్ 100కి కాల్ చేశాడు. ఆ తర్వాత తన ఇంటి సీసీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలించాడు.

బైక్ నంబర్ ఆధారంగా

రవి ఇంటి ముందున్న సీసీ కెమెరాలు రోడ్డు వైపే బిగించి ఉండడంతో యువతిని టచ్ చేసి పారిపోయిన పోకిరీ బైక్ ఫుటేజ్ రికార్డ్ అయ్యింది. దీంతో ఆ ఫుటేజ్ ను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ కి రవి పోస్ట్ చేసి వివరాలను తెలిపాడు. రవి తనకు అందించిన సీసీ ఫుటేజ్ ఆధారంగా బైక్ ను.. ఆ పోకిరీని పట్టుకోవాలని స్పెషల్ ఆపరేషన్ టీమ్ ను సీపీ మహేశ్ భగవత్ ఆదేశించారు. దీంతో ఎస్.ఓ.టీ ఇన్ స్పెక్టర్ రవికుమార్ టీమ్ సీసీ ఫుటేజ్ ఆధారంగా బైక్ నంబర్ ను గుర్తించేందుకు యత్నించింది. నంబర్ స్పష్టంగా రికార్డ్ కాకపోవడంతో ఐటీ సెల్ లోని టెక్నికల్ టీమ్ తో పోకిరీ ఉపయోగించిన బైక్ హోండా యూనికాన్ గా గుర్తించారు. బైక్ నం. టీఎస్ 29ఏ1045 సూర్యాపేట జిల్లాలోని కోదాడలో ఆజాద్ నగర్ కి చెందిన వల్లపురెడ్డి లక్ష్మి భర్త నాగిరెడ్డి పేరుతో రిజిస్టరై ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.  అయితే ఆ బైక్ ను ప్రస్తుతం సూర్యాపేట జిల్లా బేతోల్ గ్రామానికి చెందిన మోదుగు శ్రీనివాస్ రెడ్డి ఉపయోగిస్తున్నట్లు తెలుసుకున్నారు. పోలీసులు శ్రీనివాస్ రెడ్డిని ప్రశ్నించారు. అతడు ఇచ్చిన సమాచారంతో ఈ నెల10న గార్లపాటి శివకుమార్(25) అనే యువకుడు ఆ  బైక్ తీసుకున్నట్లు గుర్తించారు.

బీటెక్ చదువుతున్న శివకుమార్ కొత్తపేటలోని న్యూ మారుతీనగర్ లో ఉంటున్నాడని పోలీసులు తెలుసుకున్నారు.  దీంతో ఎస్బీఐ కాలనీలో యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి శివకుమార్ గా పోలీసులు నిర్ధారించుకున్నారు. నిందితుడిని శుక్రవారం అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

ఈ నెల 12న మొహానికి కర్చీఫ్ కట్టుకుని తానే యువతిని వెంబడించినట్లు శివకుమార్ విచారణలో అంగీకరించాడు. బాధితురాలి నుంచి ఫిర్యాదు తీసుకుని శివకుమార్ పై సెక్షన్ 354 ఐపీసీ కింద ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు. శివకుమార్ గతంలోనూ హరిపురికాలనీలో ఇలాంటి ఘటనకే పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

సిటిజన్లకు సామాజిక బాధ్యత ఉండాలి

సిటిజన్లు సామాజిక బాధ్యతతో వ్యహరించాలి. అనుమానానస్పద వ్యక్తులు కనిపిస్తే 9490617111 వాట్సప్ నంబర్ కి లేదా డయల్ 100కి సమాచారం అందించాలి. సీసీ కెమెరాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ప్రతి కాలనీలో వీటిని ఏర్పాటు చేసుకుంటే సొంత సెక్యూరిటీ ఉంటుంది. ఈ కేసులో ఈవ్ టీజర్ గురించి సమాచారం అందించి..అతడిని పట్టుకోవడంలో మాకు సహకరించిన దండి రవికి రూ.10 వేలు ప్రైజ్ మనీతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేశాం. -మహేశ్​భగవత్, సీపీ, రాచకొండ

Latest Updates