అటవీ రోడ్ల వెంబడి సీసీ కెమెరాలు

ఏర్పాటు చేయాలని కేబినెట్‌‌‌‌ సబ్‌‌‌‌ కమిటీ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: అక్రమ కలప రవాణా, వన్యప్రాణుల వేట జరగకుండా అడవుల గుండా వెళ్లే రోడ్ల వెంబడి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అటవీ శాఖ అధికారులను కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. అడవుల రక్షణకు ప్రభుత్వం నియమించిన కేబినేట్ సబ్ కమిటీ సోమవారం సెక్రటేరియట్​లో తొలిసారి సమావేశమైంది. అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌‌‌‌రెడ్డి, విద్యుత్ మంత్రి జగదీశ్ రెడ్డి, పశు సంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆర్​ అండ్​ బీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ ఐదేండ్లలో అడవుల పెంపునకు తీసుకున్న చర్యలను అటవీశాఖ స్పెషల్ సీఎస్, కమిటీ కన్వీనర్ రాజేశ్వర్ తివారీ మంత్రులకు వివరించారు.

అడవుల శాతం తక్కువగా ఉన్న కరీంనగర్, గద్వాల, హైదరాబాద్, జనగామ, వరంగల్ అర్బన్, నారాయణ పేట, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో హరితహారం పకడ్బందీగా అమలు చేయాలని మంత్రులు సూచించారు. ‘జంగల్ బచావో, జంగల్ బడావో’ స్ఫూర్తితో పోలీస్‌‌‌‌, రెవెన్యూశాఖలను సమన్వయం చేసుకుంటూ పని చేయాలని ఆదేశించారు. ఐదేండ్లలో 177 కోట్ల మొక్కలు నాటామని తివారీ మంత్రులకు తెలిపారు. ఇకపై నాటిన మొక్కలతోపాటు ఎన్ని బతికాయో కూడా రికార్డులు మెయింటైన్ చేయాలని మంత్రులు ఆదేశించారు. అవెన్యూ ప్లాంటేషన్‌‌‌‌ బాగుందని, దీన్ని విస్తృతం చేయాలన్నారు. సమావేశంలో పీసీసీఎఫ్‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌.శోభ, విద్యుత్‌‌‌‌శాఖ స్పెషల్ సీఎస్‌‌‌‌ అజయ్‌‌‌‌మిశ్రా, అటవీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Latest Updates