మరోసారి వార్తల్లో నిలిచిన హెచ్ సీఏ: హెచ్ సీఏపై బీసీసీఐకి ఫిర్యాదు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: అవినీతి ఆరోపణలు, టీమ్‌‌‌‌ సెలెక్షన్‌‌‌‌లో అక్రమాలతో  హైదరాబాద్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ (హెచ్‌‌‌‌సీఏ) మరోసారి వార్తల్లో నిలిచింది. హెచ్‌‌‌‌సీఏలో జరుగుతున్న అక్రమాలపై టీమిండియా మాజీ క్రికెటర్‌‌‌‌ అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు మరువకముందే..  స్టేట్‌‌‌‌ జూనియర్‌‌‌‌ సెలెక్షన్‌‌‌‌ కమిటీ మెంబర్‌‌‌‌ వివేక్‌‌‌‌ జయసింహా తీవ్ర ఆరోపణలు చేశారు. అవినీతితోపాటు పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం జరుగుతుందని ధ్వజమెత్తారు. వెంటనే తగిన చర్యలు తీసుకుని హెచ్‌‌‌‌సీఏలో పరిస్థితిని చక్కదిద్దాలని బీసీసీఐ ఎథిక్స్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌తో పాటు ఇండియన్‌‌‌‌ క్రికెటర్స్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ సెక్రటరీకి మెయిల్‌‌‌‌ రూపంలో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌‌‌‌ క్రికెటర్ల భవిష్యత్తును కాపాడాలని కోరారు.  శుక్రవారం మొదలైన ఓ అండర్‌‌‌‌–19 మ్యాచ్‌‌‌‌తో పాటు పలు సందర్భాల్లో జరిగిన అక్రమాలను జయసింహా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. టీమ్స్‌‌‌‌ సెలెక్షన్‌‌‌‌ విషయంలో హెచ్‌‌‌‌సీఏ  ప్రెసిడెంట్‌‌‌‌ అజరుద్దీన్‌‌‌‌, సెక్రటరీ ఆర్‌‌‌‌ విజయానంద్‌‌‌‌ నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నామన్నారు. రూల్స్‌‌‌‌ ప్రకారం సెలెక్షన్‌‌‌‌ ప్యానల్‌‌‌‌ ఎంపిక  చేసిన టీమ్స్‌‌‌‌తోపాటు  కోచ్‌‌‌‌లు, సపోర్టింగ్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌ను తమకు నచ్చినట్లుగా మార్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రతీ వ్యవహారంలో హెచ్‌‌‌‌సీఏ సెక్రటరీ బెదిరింపులకు పాల్పడుతున్నారని, అర్హత లేని ఆటగాళ్లను లిస్ట్‌‌‌‌లో చేర్చాలని తమపై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ‘ఇటీవల అండర్–19 టీమ్‌‌‌‌కు సెలెక్ట్‌‌‌‌ చేసిన కోచ్‌‌‌‌, సపోర్ట్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌ను మార్చేశారు. టీమ్‌‌‌‌ మరో ఆరు గంటల్లో బయలుదేరుతుందనగా అర్హత లేని ఓ కోచ్‌‌‌‌ను జట్టుతో పాటు పంపించారు. 15 మంది ఉండాల్సిన జట్టులో రూల్స్‌‌‌‌కు విరుద్ధంగా అదనంగా మరో ప్లేయర్‌‌‌‌ను చేర్చడంతో పాటు అతన్ని ఫైనల్‌‌‌‌ ఎలెవన్‌‌‌‌లో ఆడించారు’ అని జయసింహా వివరించారు.

సెక్రటరీ భయపెడుతున్నారు..

గత అక్టోబర్‌‌‌‌లో జరిగిన అండర్–16 టీమ్‌‌‌‌ సెలెక్షన్‌‌‌‌ సమావేశంలోనూ తీవ్ర అవమానాలు ఎదుర్కొన్నామని జయసింహా వెల్లడించారు. ‘అక్టోబర్‌‌‌‌లో అండర్‌‌‌‌–16 టీమ్‌‌‌‌ను ఎంపిక చేసినప్పట్నించి మాపై ఒత్తిడి బాగా పెరిగింది.  అండర్‌‌‌‌–16, 19, 23 టీమ్స్‌‌‌‌ సెలెక్షన్ సందర్భంగా అజర్‌‌‌‌, విజయానంద్‌‌‌‌ బ్లాక్‌‌‌‌మెయిలింగ్‌‌‌‌తో పాటు భయపెడుతున్నారు. ఉత్తరాఖండ్‌‌‌‌లో జరిగిన అండర్–23 మ్యాచ్‌‌‌‌కు సెలెక్షన్‌‌‌‌ కమిటీ ఎంపిక చేసిన జట్టు నుంచి ఓ ప్లేయర్‌‌‌‌ను తప్పించి ఫిరాజుద్దీన్‌‌‌‌ అనే ప్లేయర్‌‌‌‌ను చేర్చారు. ఈ విషయంలో మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఆ ప్లేయర్‌‌‌‌ కూడా విఫలమయ్యాడు. అండర్‌‌‌‌–23 టీమ్‌‌‌‌లో ఆడేందుకు ఓ 17 ఏళ్ల బాలుడి తండ్రి హెచ్‌‌‌‌సీఏకి  రూ.18 లక్షలు చెల్లించాడనేది బహిరంగ రహస్యం. డబ్బు చెల్లిస్తే హైదరాబాద్‌‌‌‌ టీమ్‌‌‌‌లో ప్లేస్‌‌‌‌ ఖాయమనే స్థాయికి పరిస్థితి దిగజారింది. ఫైనల్‌‌‌‌ ఎలెవన్‌‌‌‌తో పాటు 15 మంది ప్రాబబుల్స్‌‌‌‌లో  ప్లేస్‌‌‌‌ కోసం డబ్బు వసూలు చేస్తున్నారు.  ఏజ్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ క్రికెట్‌‌‌‌లో రాణిస్తున్న క్రికెటర్లు కూడా ఆర్థిక వేధింపులకు గురవుతున్నారు. నాతో పాటు పలువురు సెలెక్టర్లు ఏం చేయలేని  నిస్సహాయ స్థితిలో ఉన్నాం. ఈ విషయంలో కలుగజేసుకుని హెచ్‌‌‌‌సీఏలో పరిస్థితిని చక్కదిద్దాలి’ అని జయసింహా కోరారు.  జూనియర్‌‌‌‌ సెలెక్షన్‌‌‌‌ కమిటీలో మరో సభ్యుడైన శివాజీ యాదవ్‌‌‌‌ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. నిబంధనల ప్రకారం సెలెక్షన్‌‌‌‌ కమిటీ చైర్మన్‌‌‌‌ లేదా జాయింట్‌‌‌‌ సెక్రటరీ నిర్వహించాల్సిన సమావేశాలను హెచ్‌‌‌‌సీఏ సెక్రటరీ నిర్వహిస్తున్నారని శివాజీ తెలిపారు. అంతేకాక సెలెక్షన్‌‌‌‌ విషయంలో సెక్రటరీ బ్లాక్‌‌‌‌మెయిలింగ్‌‌‌‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు.

Latest Updates