సీసీఎంబీ చీఫ్ సైంటిస్ట్ మంజులారెడ్డికి ఇన్ఫోసిస్ ప్రైజ్

హైదరాబాద్​, వెలుగు : హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) చీఫ్​సైంటిస్ట్ డాక్టర్ మంజులా రెడ్డి ప్రతిష్ఠాత్మక ఇన్ఫోసిస్ అవార్డుకు ఎంపికయ్యారు. 2019 ఏడాదికి గాను లైఫ్ సైన్సెస్ విభాగంలో ఆమెకు ఈ అవార్డును ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ (ఐఎస్ఎఫ్) ప్రకటించింది. ఈ అవార్డును ఐఎస్ఎఫ్ 2008 నుంచి ఏటా ప్రకటిస్తోంది. ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్సెస్, హ్యుమానిటీస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్ అనే ఆరు విభాగాల్లో అద్భుతమైన విజయాలు సాధించిన, విశేష సేవలు చేసిన రీసెర్చర్లు, సైంటిస్టులకు ఈ అవార్డును ఏటా ప్రకటిస్తారు. ఒక్కో విజేతకు గోల్డ్ మెడల్, ప్రశంసాపత్రం, 100,000 డాలర్లు (రూ. 71 లక్షలు) చొప్పున క్యాష్​ ఇస్తారు. విజేతలు ఇండియాలో ఉంటున్నట్లైతే వారికి దక్కే ప్రైజ్ మనీకి పన్ను మినహాయింపు ఉంటుంది.

కొత్త యాంటీబయోటిక్స్ తయారీకి చాన్స్

బ్యాక్టీరియా సెల్ వాల్ నిర్మాణం, దాని పెరుగుదలను అర్థం చేసుకోవడం బ్యాక్టీరియల్ బయాలజీలో అత్యంత కీలకం. బ్యాక్టీరియా సెల్ వాల్ నిర్మాణానికి సంబంధించి డాక్టర్ మంజులా రెడ్డి బృందం కనుగొన్న విషయాలు ఈ రంగంలో కీలకమైన విజయాలుగా నిలుస్తాయని అవార్డు కమిటీ ప్రశంసించింది. యాంటీబయోటిక్స్ కు రెసిస్టెన్స్ ఏర్పర్చుకునే బ్యాక్టీరియాలను నిర్మూలించగలిగే కొత్త రకం యాంటీబయోటిక్స్ తయారీకి వీరి పరిశోధనలు కొత్త మార్గాలు చూపుతాయని పేర్కొంది. బ్యాక్టీరియా సెల్ వాల్ పై రీసెర్చ్ కు గుర్తింపుగా తనకు ఈ అవార్డు రావడం పట్ల డాక్టర్ మంజులా రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.

Latest Updates