కరోనా హాస్పిటల్ పరిసరాల్లోని గాలిలో వైరస్

సికింద్రాబాద్, వెలుగు: కరోనా హాస్పిటల్స్​పరిసరాల్లోని గాలిలో వైరస్ ఉంటుందని, ఆ పరిసరాలకు వెళ్తే కరోనా సోకే ప్రమాదం ఉందని సెంటర్​ఫర్ ​సెల్యూలార్ ​అండ్​మాలిక్యూలార్​ బయాలజీ (సీసీఎంబీ) తెలిపింది. ఈ మేరకు సైంటిస్టుల స్టడీ రిపోర్టును మంగళవారం విడుదల చేసింది. వైరస్​ సోకకుండా ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే  ప్రమాదమేమీ లేదని స్పష్టం చేసింది. కరోనా ఆస్పత్రుల ఆవరణలోనూ వైరస్ ఉంటుందని తెలిపింది. పేషెంట్ల సంఖ్య, వారు ఉండే సమయం ఆధారంగా గాలిలో వైరస్ ప్రభావం ఉంటుందని వెల్లడించింది. క్లోజ్డ్ (ఏసీ రూమ్ లు, ఐసీయూలు) రూమ్స్ లలో కొన్ని గంటల తర్వాత కూడా కరోనా వైరస్ యాక్టివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటుందని స్టడీలో తేలినట్టు చెప్పింది. ఇలాంటి చోట రెండు మీటర్ల కంటే ఎక్కువ దూరం వరకు వైరస్ వ్యాపిస్తుందని పేర్కొంది.

గాలిలో 2 గంటలు బతికుంటుంది..

హైదరాబాద్​లోని సీసీఎంబీ, చండీగఢ్​లోని ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ మైక్రోబియల్​ టెక్నాలజీ సంస్థల సైంటిస్టులు మూడు నెలలపాటు స్టడీ చేశారు. హైదరాబాద్​లోని 3, చండీగఢ్ లోని 3 హాస్పిటల్స్ లో కోవిడ్ వార్డులు, నాన్ కోవిడ్​వార్డుల నుంచి గాలి నమూనాలు సేకరించి ఆర్టీపీసీఆర్​ద్వారా టెస్టు చేసి వైరస్​ గాలిలో ఉన్నట్లు నిర్ధారించారు. కోవిడ్​వార్డుల్లో మాత్రమే వైరస్​ఉందని, నాన్​కోవిడ్​వార్డుల్లోని గాలిలో వైరస్ ప్రభావం అంతగా లేదని స్టడీలో తేలినట్టు చెప్పారు. కరోనా పాజిటివ్​కలిగిన వ్యక్తి ఒక గదిలో ఎక్కువ సమయం కూర్చుని ఉంటే  అతడి నుంచి విడుదలయ్యే వైరస్​ఆ గది గాలిలో2 మీటర్ల వరకు విస్తరించి.. 2 గంటల పాటు బతికే ఉంటుందన్నారు. అయితే అసింప్టమాటిక్ కేసుల్లో ఆయా వ్యక్తులు ఏసీ, ఫ్యాన్​ వంటి వాటి నుంచి గాలి ప్రవాహం లేని గదుల్లో కూర్చుంటే వైరస్ వారి నుండి ఎక్కువ దూరం వ్యాపించదని తెలిపారు.

వైరస్‌‌ కొంత కాలం గాలిలో..

స్టడీలో భాగంగా కరోనా సోకిన రోగులను ఓ క్లోజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొంతసేపు ఉంచి, గాలి నమూనాలు సేకరించి పరీక్షించినట్టు సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా చెప్పారు.   కరోనా వైరస్ కొంతకాలం గాలిలో ఉంటుందని తమ రీసెర్చ్ లో తేలిందని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మైక్రోబియల్ టెక్నాలజీ డైరెక్టర్ సంజీవ్ ఖోస్లా చెప్పారు.

Latest Updates