శేషన్‌ గడగడలాడించెన్‌

ఎన్నికల సంస్కరణలు అనగానే గుర్తొచ్చే పేరు ఆయనదే. ఆయనే కేంద్ర మాజీ ఎన్నికల కమిషనర్ టీఎన్ శేషన్ (87). కేంద్ర ఎన్నికల సంఘం పదవ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన అక్రమాలకు పాల్పడే రాజకీయ పార్టీలు, నేతలను గడగడలాడించిన వ్యక్తి. ఆయన 2019 నవంబరు 10న (ఆదివారం) రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. కేరళలోని పాలక్కడ్ జిల్లా తిరునల్వేలిలో 1932లో జన్మించారు శేషన్. ఆయన 1990 నుంచి 1996 వరకు కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా సేవలందించారు.

అక్రమార్కులకు హడల్ పుట్టించి…

ప్రజాస్వామ్యానికి ఎన్నికలే పునాది. ఎన్నికలను స్వేచ్ఛగా నిర్వహించే బాధ్యత
ఎన్నికల సంఘానిది.  ఒకప్పుడు ఎలక్షన్స్‌ అంటే అరాచకంగా జరిగేవి. టి.ఎన్‌‌.శేషన్‌‌ ఎలక్షన్‌‌ కమిషనర్‌ కాగానే, మొత్తం సినారియోని మార్చేశారు. ఫ్రీ అండ్‌‌ ఫ్రాంక్‌ , పీస్‌ ఫుల్‌ ఎలక్షన్స్‌ జరిగేలా
రూల్‌ బుక్‌ ని అమలు చేశారు.

ఎన్నికల సంఘం అంటే టక్కున గుర్తొచ్చే పేరు టి.ఎన్.శేషన్. ఎన్నికల వ్యవస్థను ప్రజల పక్షంగా మార్చిన వ్యక్తి గా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ గా అయన అమలు చేసిన సంస్కరణలు వ్యవస్థలో పెను మార్పులకు
కారణమయ్యాయి. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడే రాజకీయ, సామాజిక శక్తులకు హడల్‌ పుట్టిం చారు. ఇండియాలో ఎలక్షన్స్‌ గురించి మాట్లాడేటప్పుడు ‘శేషన్‌ కి ముందు, శేషన్‌ తర్వాత’ అని మాట్లాడుకునేలా ఇన్‌ ఫ్లూయెన్స్‌ చేశారు. సీఈసీ స్వయం ప్రతిపత్తిని కాపాడారు.

చండశాసనుడిగా పేరు

శేషన్ 1955 బ్యాచ్ తమిళనాడు కేడర్‌ ఐఏఎస్ అధికారి. 1990 డిసెంబర్ 12న చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ గా బాధ్యతలు స్వీకరించారు. శేషన్ రాకముందు ఎన్నికల సంఘం పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండేది. ఎన్నికల నిర్వహణ గందరగోళంగా ఉండేది. విచ్చలవిడిగా పోలింగ్ బూత్‌ ల ఆక్రమణ జరిగేది. బ్యాలెట్ పేపర్లను చించి వేయడం, దౌర్జన్యంగా స్టేషన్లలో చొరబడి గంపగుత్తగా ఓట్లు గుద్దేయడం, బ్యాలెట్‌ బాక్స్‌ ల్లో సిరా పోయడం, బాక్సుల్ని ఎత్తు కెళ్లడం వగైరాలన్నీ రాజకీయ గూండాలకు హక్కుగా ఉండేవి. ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలపై ఈసీకి ఎలాంటి అదుపు ఉండేది కాదు. అసలు రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్‌ని పెద్దగా పట్టించు కునేవి కావు. ఇలాంటి దశలో ఆరేళ్లపాటు సీఈసీ హోదాలో శేషన్ సంస్కరణలతో కమిషన్ ఫుల్ పవర్స్ వాడి చూపించారు.

కేండిడేట్ల ఎన్నికల ఖర్చు పై లిమిట్‌ని గట్టిగా అమలు చేశారు శేషన్. డబ్బును బాహాటంగా మంచినీళ్లలా ఖర్చు పెట్టే రాజకీయ పార్టీల గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. గుడి, మసీదు, చర్చి వంటి పవిత్ర స్థలాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిషేధించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్) నూరు శాతం అమలు చేయించారు. ఈ విషయంలో శేషన్‌ నిజంగా చండశాసనుడే. గీత దాటారని గుర్తిస్తే.. ఎవరినైనా ఖాతరు చేయకపోయేది. మధ్యప్రదేశ్‌ లోని ఓ నియోజకవర్గంలో సాక్షాత్తూ ఒక రాష్ట్ర గవర్నర్ ప్రచారం చేశారు. అక్కడ గవర్నర్ కుమారుడు పోటీ చేశారు. ఈ విషయం శేషన్ దృష్టికి వచ్చింది. గవర్నర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న కారణంతో అక్కడ పోలింగ్‌‌ని సస్పెండ్ చేశారు. నిబంధనల విషయంలో శేషన్ ఎంత నిక్కచ్చిగా ఉంటారనడానికి… మరో ఘటన కూడా ఉదాహరణగా చెప్పొచ్చు. ఉత్తరప్రదేశ్‌ లో ఎన్నికల ప్రచారం మరికాసేపట్లో ముగుస్తుందనగా ఆ రాష్ట్ర మంత్రి ఒకరు వేదిక ఎక్కి లెక్చరు ఇవ్వడం ప్రారంభించారు.
ప్రచారం సమయం ముగిసింది. అయినా మంత్రి తన ఉపన్యాసం ఆపలేదు. విషయం శేషన్‌ కి చేరింది. ఏం జరిగిందో ఏమో కానీ యూపీ మంత్రి కొన్ని క్షణాల్లోనే అర్ధంతరంగా ఉపన్యాసం ముగించి, హడావిడిగా కారెక్కి వెళ్లిపోయారు. దటీజ్ శేషన్.

ఎన్నికల హింస కంట్రోల్

ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయిలో పోలీసు, పారామిలిటరీ సేవలు వినియోగించుకున్నారు. సరిహద్దుల్లో ని సెన్సెటి వ్‌ ఏరియాల్లో సైన్యాన్నికూడా దించగలిగారు. అక్రమాలు జరిగే అవకాశాలున్నట్లు ఏమాత్రం ఉప్పందినా అదనపు బలగాలను తరలించేలా ఒత్తిడి తెచ్చేవారు. దీంతో పోలింగ్ శాతం కూడా పెరిగింది. గతంలో పోలింగ్ బూత్‌ కి వచ్చి ఓటు వేయడానికి భయపడేవాళ్లు శేషన్‌ ఇచ్చిన భరోసాతో ధైర్యంగా రావడం మొదలెట్టారు. దేశంలోనే అతి పెద్ద
రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ లో పోలిం గ్ కేంద్రాల క్యాప్చరింగ్ చాలా ఎక్కువగా ఉండేది. బూత్ క్యాప్చరింగ్‌‌పై శేషన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. అంతేకాదు, పోలింగ్ రోజున రాజకీయ పార్టీలు హింసకు పాల్పడేవి. చాలా మంది చనిపోయేవారు. ఈ ఎన్నికల హింసను అదుపు చేయడంలో సక్సెస్
అయ్యారు.

రూల్ బుక్ దుమ్ముదులిపారు
1996 లోక్‌‌సభ ఎన్నికల్లో శేషన్ ప్రభావం బాగా కనిపించింది. ఎన్నికల వ్యయం, ప్రచారం వంటివి
పరిశీలించడానికి పెద్ద సంఖ్యలో అబ్జర్వర్లను నియమించారు. ఒక్కో లోక్‌‌సభ సెగ్మెంట్‌ కి ముగ్గురు
చొప్పున పరిశీలకులను పంపారు. మొత్తంగా చూసినప్పుడు శేషన్‌ ఎలక్షన్‌ రూల్‌ బుక్‌‌ని పూర్తిగా అధ్యయనం చేసి, అమలు చేశారని చెప్పవచ్చు. శేషన్‌ దూకుడుగా వ్యవహరించినప్పటికీ, ఆయన తీసుకున్న చర్యలకు దేశమంతా ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఎలక్షన్స్‌ ఈమాత్రం సజావుగా,
శాంతియుతంగా సాగడానికి కారణం శేషన్‌ వేసిన పునాదేనని చెప్పక తప్పదు.

గోడ మీద రాతలు మాయం
శేషన్‌ కి ముందు ఎన్నికలంటే చాలా కంగాళీగా ఉండేది. విచ్చలవిడిగా గోడల మీద రాతలుండేవి.
కనీసం ఇంటి ఓనర్ పర్మిషన్ తీసుకునేవారు కాదు. ఇంటి ఓనర్స్ కూడా ఏమీ అనలేని పరిస్థితి. ఈ అరాచకాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టారు శేషన్. దీని ప్రభావం ఇప్పటికీ ఉంది. గోడల మీద రాయించడానికి లీడర్లు భయపడుతున్నారు. ఏ రూలు అడ్డం పెట్టుకుని ఏం చేస్తారోనని పొలిటికల్ లీడర్లు గడగడలాడుతున్నారంటే అది శేషన్‌ ప్రభావం వల్లనే. ఇక, దొంగ ఓట్లకుకూడా శేషన్ చెక్ పెట్టారు. ప్రజలకు ఓటరు గుర్తింపు కార్డులు ఇవ్వడం మొదలెట్టారు. ఎన్నికల వ్యవస్థలో ఓటరు గుర్తింపు కార్డుల జారీ అనేది ఓ విప్లవాత్మక చర్య.

నేరగాళ్లకు చెక్‌
ప్రజాస్వామ్యానికి పునాది లాంటి ఎన్నికల్లో నేరగాళ్లు పోటీ చేయకుండా శేషన్ అనేక చర్యలు
తీసుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేయదలిచినవారు తమ అఫిడవిట్‌ లో తప్పనిసరిగా క్రిమినల్
యాక్టివిటీని ప్రస్తావించేలా ఒత్తిడి తెచ్చారు. దీంతో క్రిమినల్ రికార్డు ఉన్నవారికి టికెట్లు ఇవ్వడానికి పొలిటికల్ పార్టీలు వెనకాడుతున్నాయి. సీఈసీగా తనకున్న అధికారాలను బాగా స్టడీ చేసి, యాంటీ ఎలిమెంట్ స్‌ ని రాజకీయాల నుంచి తరిమేయడానికి శేషన్‌ ఎంతగానో కృషి చేశారు.

ఎన్నికల ప్రక్రియపై అవగాహన
శేషన్ హయాంలో ఎన్నికల సంఘం నూటికి నూరు శాతం స్వయం ప్రతిపత్తి గల సంస్థగా పనిచేసింది. ఎన్నికల ప్రక్రియ అలాగే ఈసీ అధికారాలపై ప్రజలకు అవగాహన కలిగింది కూడా ఈసమయంలోనే. అసలు ఎన్నికల సంఘానికి ఇన్ని అధికారాలు ఉన్నాయా అని ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు అనుకునేలా ఈసీ పనిచేసింది. శేషన్ వచ్చేనాటికి ఎన్నికల సంఘం ఏక సభ్య కమిషన్ గానే ఉండేది. 1993 లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ప్రభుత్వం ముగ్గురు సభ్యుల కమిషన్ గా మార్చింది. శేషన్ కు తోడుగా ఎన్నికల సంఘం సభ్యులుగా ఎం
ఎస్ గిల్, జీవీజీ కృష్ణమూర్తిని నియమించారు. ఈసీ, ఏ నిర్ణయం తీసుకున్నా కలిసి తీసుకోవాలి. నిర్ణయం తీసుకోవడంలో తేడాలు వస్తే మెజారిటీ నిర్ణయమే చివరకు ఫైనల్ అవుతుంది.

రాజ్యాంగం ఏమంటోంది?
రాజ్యాంగం ప్రకారం ఎన్నికల సంఘం పూర్తి స్వయం ప్రతిపత్తిగల సంస్థ. దీని విధుల్లో ఎవరి జోక్యం ఉండదు… ఉండకూడదు. ఎన్నికల కమిషనర్లతో పాటు అవసరమైన సిబ్బంది నియామకం వరకే ప్రభుత్వ పాత్ర ఉంటుంది. ఒకసారి కమిషనర్ల నియామకం పూర్తయిన తర్వాత వాళ్లు స్వతంత్రంగా వ్యవహరించాలి. ఎక్కడైనా ఒకసారి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యిందంటే… ఈసీ పనితీరులో ఎవరి జోక్యం ఉండదు. సుప్రీం కోర్టు వివిధ సందర్భాల్లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఎన్నికలకు ప్రకటన వెలువడిందంటే… ఎన్నికల షెడ్యూల్‌ తో నిమిత్తం లేకుండా ప్రభుత్వ యంత్రాంగమంతా ఎలక్షన్‌ కమిషన్‌ పరిధిలోకి వెళ్లిపోతుంది. అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని భావిస్తే…
వాళ్లను ట్రాన్స్‌ ఫర్‌ చేయించే పవర్ కూడా ఎన్నికల సంఘానికి ఉంటుంది. ఇంత పకడ్బందీగా రూపొందించిన ఎలక్షన్‌ కమిషన్‌ 1990కి ముందు సాధారణమైన గవర్నమెంట్‌ ఆఫీసుగా పనిచేసేది. శేషన్‌ వచ్చాక సామాన్య ప్రజల్లో గుర్తింపు వచ్చింది. ఇందులో మరో ముచ్చటే లేదు. ట్రాన్స్‌ ఫరెన్సీకి చిరునామాగా ఈసీని ఆయన తీర్చిదిద్దారు. శేషన్‌ కృషికి గాను 1996లో ప్రతిష్టాత్మకమైన రామన్ మెగసెసే అవార్డును ప్రకటించారు. ఈసీ చరిత్రలోనే శేషన్ హయాం ఓ స్వర్ణ యుగమని చెప్పవచ్చు.

Latest Updates