ఆడబిడ్డ పుట్టిందని ఊరంతా వేడుకలు

హరిదాస్‌పూర్ : పుట్టబోయే శిశువు ఆడబిడ్డ అని తెలిస్తే చాలు కొందరు కడుపులోనే చంపేస్తున్న ఈ రోజుల్లో.. ఆ ఊళ్లో వరుసగా ముగ్గురు ఆడపిల్లలు పుట్టడంతో గ్రామ ప్రజలంతా కలిసి పండుగ చేసుకున్నారు. ఈ అరుదైన సంఘటన సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం హరిదాస్‌పూర్ గ్రామంలో జరిగింది. గ్రామంలో మొత్తం 816 మంది నివసిస్తూ ఉంటారు. అయితే అమ్మాయిలు.. అబ్బాయిల మధ్య లింగ నిష్పత్తిలో అంతర్యం ఎక్కువగా ఉండడంతో ఆవేదన చెందారు గ్రామస్తులు. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మనుగడకే ముప్పు రావొచ్చని భావించిన గ్రామస్తులు.. ఆడపిల్లలు కన్న తల్లిదండ్రులను ప్రోత్సహించాలనే నిర్ణయించుకున్నారు.

ఒకే వారంలో ముగ్గురు

జనవరి మొదటి వారంలో ముగ్గురు అమ్మాయిలు జన్మించడంతో గ్రామస్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.  చాలా రోజుల తర్వాత ముగ్గురు ఆడ బిడ్డలు జన్మించినందుకు పంచాయతీ ఆఫీసును విద్యుద్దీపాలతో అలంకరించారు. గ్రామస్తులందరూ కలిసి సంతోషంతో మిఠాయిలు పంచుకుని వేడుకలు జరుపుకున్నారు. ఆడ పిల్లల తల్లిదండ్రులను గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గరకు పిలిపించి సన్మానం చేశారు. సుకన్య సమృద్ధి యోజన కింద ఆ ముగ్గురు అమ్మాయిల పేర్లు నమోదు చేయించారు. ఒక్కో చిన్నారికి వెయ్యి రూపాయల చొప్పున తొలి ఐదు నెలల మొత్తాన్ని జమ చేశారు. ఇందుకు సంబంధించిన మూడు వేల రూపాయలను తల్లిదండ్రులకు చేతికి అందించారు గ్రామస్థులు. ఈ విషయం తెలుసుకున్న ఇరుగు పొరుగు వారు హరిదాసు పూర్  గ్రామస్తులు చేసిన గొప్ప పనికి అభినందించారు.

Latest Updates