ఒక్క సోషల్ మీడియా పోస్ట్ కు కోట్లలో సంపాదన

సోషల్ మీడియాలో సెలబ్రిటీలను ఫాలో అయ్యే అభిమానులు కోట్లలో ఉన్నారు. సెలబ్రిటీలు తమ సోషల్ మీడియా అకౌంట్ లో  ఒక్క పోస్ట్ చేస్తే చాలు క్షణాల్లో కోట్ల మందికి చేరుతుంది. ఈ పాయింట్ నే  పలు బ్రాండెడ్ కంపెనీలు వారికి అనువుగా మార్చుకున్నాయి. సెలబ్రిటీలతో వారి బ్రాండ్, ప్రాడక్ట్ కు చెందిన పోస్ట్ చేయించుకుని ప్రమోషన్ పొందుతున్నాయి పలు కంపెనీలు.  ఇందుకు గాను కోట్ల రూపాయలను సదరు సెలబ్రిటీలకు అందజేస్తున్నాయి. ఇప్పటికైతే.. ఎక్కువ మంది సెలబ్రిటీలు ఇన్ స్టాగ్రామ్ ను వాడుతున్నారు.


మన దేశం నుంచి దీపికా పదుకునే, ప్రియాంక చోప్రా లాంటి పలువురు సెలబ్రిటీలు ఒక్క ప్రాడక్ట్ ను ప్రమోట్ చేయడానికి కోటి వరకు వసూలు చేస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ లాంటి హీరోయిన్స్ అయితే లక్షల్లో ఛార్జ్ చేస్తున్నారు. ఇక హాలీవుడ్ నటులైతే ఒక్క ప్రమోషన్ కు కోట్లలో తీసుకుంటున్నారు.

అమెరికాకు చెందిన మాడల్ కైలీ జెన్నర్ కు ఇన్ స్టాగ్రామ్ లో 13.4 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈమె ఏదైనా ప్రాడక్టును ప్రమోట్ చేయడానికి 7 కోట్ల రూపాయలను తీసుకుంటుంది.

ప్రపంచంలోనే ఫుట్ బాల్ తెలియని, ఆడని వారుండరు అంటే అతిశయోక్తి కాదేమో.. ఈ ఆటలో సూపర్ ప్లేయర్ క్రిస్టియనో రొనాల్డొ అంటే పిచ్చెక్కి పోయేవారెందరో.. ఇతని ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ లో 16.5 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈయన ఒక్క పోస్ట్ చేయడానికి 5.25 కోట్ల రూపాయలను తీసుకుంటున్నాడు.

కిమ్ కర్దాషియన్ అనే అమెరికాకు చెందిన బిజినెస్ ఉమెన్, మాడల్ కు సోషల్ మీడియాలో 13.3 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈమె ఒక ప్రాడక్ట్ ను ప్రమోట్ చేసేందుకు చేసే ఒక్క పోస్ట్ కు 5.04 కోట్ల రూపాయలను తీసుకుంటుంది.

అమెరికాకు చెందిన సింగర్ బెయోన్స్ కు ఇన్ స్టాగ్రామ్ లో 12.7 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈమె ఒక్క పోస్ట్ చేయడానికి 4.9 కోట్ల రూపాయలను సంపాదిస్తున్నారు.


మాజీ రెజ్లర్, హాలీవుడ్ యాక్టర్ డ్వైన్ జాన్సన్ కు ఇన్ స్టాగ్రామ్ లో 14.2 కోట్ల మంది ఫాలో వర్లు ఉన్నారు. ఈయన ఒక్క పోస్ట్ చేస్తే రూ.4.5 కోట్ల వరకు తీసుకుంటున్నారు.